Financial Pressure: ఈఎంఐలు చెల్లించలేక ఆత్మహత్య
ABN , Publish Date - Oct 01 , 2025 | 04:37 AM
అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. నెలకు రూ.65 వేల జీతం. హైదరాబాద్, ఏలూరుల్లో ఇళ్లు కొనుగోలు చేశాడు. మూడు నెలల క్రితం ఉద్యోగం పోయింది.
అమెజాన్‌లో ఉద్యోగం పోవడంతో ఆర్థిక కష్టాలు
మృతుడు సికింద్రాబాద్ వాసి.. ఆకివీడులో ఘటన
ఆకివీడు, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. నెలకు రూ.65 వేల జీతం. హైదరాబాద్, ఏలూరుల్లో ఇళ్లు కొనుగోలు చేశాడు. మూడు నెలల క్రితం ఉద్యోగం పోయింది. నాలుగు నెలలుగా ఈఎంఐలు చెల్లించకపోవడంతో ఒత్తిడి పెరిగింది. ఫలితంగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. సికింద్రాబాద్‌కు చెందిన పాలకుర్తి సంతోష్ కుమార్ చదువుకునే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన కీర్తనను ప్రేమించి 2018లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. సంతోష్ హైదరాబాద్‌లో అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. హైదరాబాద్‌లో ఒకటి, ఏలూరులో రెండు ఇళ్లు కొనుగోలు చేశాడు. బ్యాంకులకు నెలకు సుమారు రూ.55 వేలు ఈఎంఐలు చెల్లిస్తున్నాడు. కొంత మొత్తాన్ని ఆయన తండ్రి, మామగారు సర్దేవారు. ఈ క్రమంలో వర్క్ ఫ్రం హోం చేసుకునేందుకు ఇటీవల కుటుంబ సమేతంగా అత్తగారింటికి ఆకివీడు వచ్చాడు. అయితే మూడు నెలలు క్రితం అమెజాన్ నుంచి సంతోష్ కుమార్‌ను తొలగించారు. బ్యాంకులకు ఈఎమ్‌ఐలు చెల్లించలేకపోవడంతో ఒత్తిడి పెరిగింది. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఇంటి వరండాలో సంతోష్ కుమార్(35) మెడకు చీర బిగించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సెల్ఫీ సూసైడ్ వీడియోను భార్య ఫోన్‌కు పంపించాడు.