Share News

Financial Review: పోలవరం పునరావాసంపై నేడు ఆర్థిక శాఖ సమీక్ష

ABN , Publish Date - Nov 12 , 2025 | 04:27 AM

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ, పునరావాస కార్యక్రమాల అమలుపై రాష్ట్ర ఆర్థిక శాఖ సమీక్షించనుంది.

Financial Review: పోలవరం పునరావాసంపై నేడు ఆర్థిక శాఖ సమీక్ష

  • మిగిలిన 750 కోట్లు ఖర్చుచేస్తే కేంద్రం నుంచి తదుపరి నిధులు!

అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ, పునరావాస కార్యక్రమాల అమలుపై రాష్ట్ర ఆర్థిక శాఖ సమీక్షించనుంది. బుధవారం జరిగే ఈ సమీక్షలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌, జల వనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, ఈఎన్‌సీ నరసింహమూర్తి, ఇతర ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొంటారు. 41.15 మీటర్ల కాంటూరులో పోలవరం తొలి దశ నిర్మాణానికి రూ.30,436.95 కోట్ల వ్యయాన్ని కేంద్ర జల సంఘం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఇంకా రూ.6,645.13 కోట్లు కేంద్రం నుంచి రావలసి ఉంది. ప్రాజెక్టు కోసం గత ఏడాది అక్టోబరు 9న రూ.76.46 కోట్లు, రూ.383.23 కోట్లు, రూ.2,348 కోట్లు విడుదలయ్యాయి. వీటిని ప్రాజెక్టు కోసం తెరచిన ప్రత్యేక ఖాతాలో వేయకుండా రాష్ట్ర ఆర్థిక శాఖ సీఎంఎ్‌ఫఎ్‌సలో జమచేసింది. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆర్థిక శాఖ వీటిలో రూ.998 కోట్లను జనవరిలో నిర్వాసితుల వ్యక్తిగత ఖాతాల్లో జమచేసింది. దరిమిలా కేంద్రం ఈ ఏడాది మార్చి 11వ తేదీన మరో రూ.2,704.71 కోట్లను విడుదల చేసింది. వీటిలో దాదాపు రూ.1,700 కోట్లను పోలవరం ప్రత్యేక ఖాతాలో వేశారు. ఇందులో రూ.1,000 కోట్లను నిర్వాసితులకు విడుదల చేశారు. తాజాగా కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం.. ప్రత్యేక ఖాతాల్లోని నిధులు నిర్వాసిత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో విడివిడిగా జమచేయాలంటే.. నిర్వాసిత భూమి విస్తీర్ణం, సర్వే నంబరు, ఆధార్‌ నంబరు తదితర వివరాలన్నింటినీ వ్యక్తిగతంగా ‘అప్‌లోడ్‌’ చేయాల్సి ఉంటుంది.


ఈ సమాచారమంతటినీ అప్‌లోడ్‌ చేసేందుకు చాలా సమయం తీసుకుంటుంది. దీంతో గత నెలలో ప్రారంభించిన నిర్వాసితులకు నగదు చెల్లింపు ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్రం విడుదల చేసిన నిధుల్లో మరో 750 కోట్ల దాకా రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉన్నాయని.. ఈ నిధులనూ ప్రత్యేక ఖాతాకు బదలాయిస్తే నిర్వాసితులకు పూర్తిగా చెల్లింపులు చేయొచ్చు. ఈ నిధులను కూడా వ్యయంచేసి తమకు సమాచారం పంపితే.. తదుపరి మొత్తం విడుదల చేస్తామని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ సమీక్షించనుండడం ఆసక్తికరంగా మారింది.

Updated Date - Nov 12 , 2025 | 04:28 AM