Finance Department: అలా కుదరదు రెవెన్యూకు ఆర్థికశాఖ షాక్
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:07 AM
జగన్ ప్రభుత్వంలో రెవెన్యూశాఖలో కీలక పోస్టులో ఉన్న ఓ జూనియర్ అధికారి 2023లో 300 మంది సీనియర్ అసిస్టెంట్లకు డిప్యూటీ తహసీల్దార్‌లుగా(డీటీ) అడహక్ పదోన్నతులు ఇచ్చారు. అందులో 175 మందిని ఎలక్షన్ డీటీలుగా పంపిస్తే...
జగన్ హయాంలో అడ్డగోలుగా సృష్టించిన 300 డీటీ పోస్టులను ఆమోదించబోం
రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిపాదనకు నో
అవి తాత్కాలిక పోస్టులు, వాటికి హేతుబద్ధత లేదన్న ఆర్థికశాఖ
శాశ్వత సిబ్బంది సంఖ్యలో కలపొద్దని స్పష్టీకరణ
న్యాయసలహా పొందాలని దిశానిర్దేశం
జగన్ ప్రభుత్వంలో జరిగిన అనేకనేక తప్పులను చంద్రబాబు సర్కారు సరిదిద్దుతోంది. కానీ, రెవెన్యూశాఖ మాత్రం జగన్ సర్కారులో జరిగిన తప్పులను రెగ్యులరైజ్ చేయాలని చూస్తోంది. గత ఎన్నికలకు ఏడాది ముందు ఓ అధికారి ధనదాహం కోసం నాడు అడ్డగోలుగా సృష్టించిన 300 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులను క్రమబద్ధీకరించాలంటూ ఆర్థికశాఖకు ప్రతిపాదన పంపింది. అయితే, అనూహ్యరీతిలో రెవెన్యూశాఖకు ఆర్థికశాఖ షాక్ ఇచ్చింది. రెవెన్యూది హేతుబద్ధత లేని ప్రతిపాదన అని తేల్చేసింది. అవి తాత్కాలిక పోస్టులని, శాశ్వత సిబ్బంది సంఖ్యలో కలపొద్దని గట్టిగా తేల్చిచెప్పింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగన్ ప్రభుత్వంలో రెవెన్యూశాఖలో కీలక పోస్టులో ఉన్న ఓ జూనియర్ అధికారి 2023లో 300 మంది సీనియర్ అసిస్టెంట్లకు డిప్యూటీ తహసీల్దార్‌లుగా(డీటీ) అడహక్ పదోన్నతులు ఇచ్చారు. అందులో 175 మందిని ఎలక్షన్ డీటీలుగా పంపిస్తే, మిగిలిన 125 మంది రెవె న్యూయేతర శాఖల్లో (ఫారిన్ సర్వీస్) ఉన్నారు. వీరికిచ్చిన అడహక్ పదోన్నతులను శాశ్వతమైనవిగా చూపించేందుకు, ఆ తర్వాత వారి పోస్టులను శాశ్వత ఉద్యోగుల సంఖ్యలో (పర్మినెంట్ కేడర్) కలిపేందుకు ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం ఆ అధికారి భారీగా దండుకున్నారని, ఆయన అడ్డగోలు పనులు చేశారన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. జగన్ ప్రభుత్వంలో ఉండగానే అది వర్కవుట్ కాలేదు. అడ్డగోలు పదోన్నతులు ఇచ్చిన అధికారి ఆ తర్వాత పోస్టును వదులుకొని ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తన పలుకుబడిని ఉపయోగించి ఆ నాడు తాను సృష్టించిన 300 పోస్టులను శాశ్వత ఉద్యోగుల సంఖ్యలో చూపించాలని మరోసారి సదరు వ్యక్తి ప్రయత్నం చేశారు. ఈ మేరకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నుంచి రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాకు ప్రతిపాదనలు వచ్చాయి. ఈ పరిణామంపై ‘‘సర్కారుకు తెలియకుండా 300 డీటీ పోస్టుల సృష్టి’’ శీర్షికతో ఆంధ్రజ్యోతి వార్తను ప్రచురించింది. ఈ వార్తపై స్పందించిన నాటి రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నివేదిక కోరారు. సీసీఎల్‌ఏ పంపించిన ప్రతిపాదనలపై సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), ఆర్థికశాఖల అభిప్రాయాలు కోరారు. వాటిపై రెవెన్యూశాఖకు షాక్‌ఇచ్చేలా అభిప్రాయాలు వచ్చాయి.
వాటిని ఆమోదించలేం : ఆర్థికశాఖ
2023లో జగన్ ప్రభుత్వంలో సృష్టించిన 300 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులను ఆమోదించలేమని ఆర్థిక శాఖ తేల్చిచెప్పింది. ఈ మేరకు రెవెన్యూశాఖకు లిఖితపూర్వకంగా తన అభిప్రాయం తెలియజేసింది. ‘‘ఆ పోస్టులకి హేతుబద్ధత లేదు. కాబట్టి అడహక్ పదోన్నతుల ద్వారా భర్తీచేసిన ఆ పోస్టులను ఆమోదించి శాశ్వాత ఉద్యోగుల సంఖ్యలో కలపలేం. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకునేందుకు న్యాయశాఖ అభిప్రాయం తీసుకోండి’’ అని ఆర్థిక శాఖ తేల్చిచెప్పింది.
మరోసారి తేల్చుకోండి
ఇక ఇదే అంశంపై సాధారణ పరిపాలనశాఖ మరింత స్పష్టత ఇచ్చింది. అడహక్ పదోన్నతుల ద్వారా సృష్టించిన 300 డీటీ పోస్టులను శాశ్వత ఉద్యోగుల సంఖ్యలో కలపలేమని ఆర్థికశాఖ తేల్చిచెప్పిన నేపధ్యంలో, ఇక ఇందులో తాము చేసేది కొత్తగా ఏమీలేదని పేర్కొంది. ఈ విషయంలో మరోసారి ఆర్థిక శాఖతోనే తేల్చుకోవాలంది. ఇంకా న్యాయశాఖ సలహాకూడా తీసుకోవాలని సూచించింది. అడహక్ పదోన్నతుల విషయంలో ఇటు ఆర్థికశాఖ, అటు జీఏడీ.. న్యాయశాఖ సలహా తీసుకోవాలని సూచించాయి. కానీ రెవెన్యూశాఖ ఆ పనిచేయలేదు. ఎందుకంటే, ఈ పోస్టుల విషయంలో హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. రెవెన్యూశాఖ కౌంటర్ దాఖలు చేయాలి. అదే జరిగితే మొదటికే మోసం వస్తుంది. దీంతో ఏం చేయాలో రెవెన్యూకు దిక్కుతోచడం లేదు.