Auditor Steals Gold: ఆడిట్ కోసం వచ్చి బంగారం చోరీ
ABN , Publish Date - Sep 10 , 2025 | 06:10 AM
చింతలపూడిలోని ఒక ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్‌కు ప్రధాన కార్యాలయం నుంచి ఆడిటర్‌గా వచ్చిన వ్యక్తి..
ఫైనాన్స్ కంపెనీ ఆడిటర్ చేతివాటం
2.5కోట్ల విలువైన తాకట్టు బంగారంతో పరార్
ఏలూరు క్రైం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): చింతలపూడిలోని ఒక ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్‌కు ప్రధాన కార్యాలయం నుంచి ఆడిటర్‌గా వచ్చిన వ్యక్తి.. బ్యాంకు అధికారులను ఏమార్చి.. రూ.2.50 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. వివరాలివీ.. ఏలూరు జిల్లా చింతలపూడిలోని కనకదుర్గ గోల్డ్ ఫైనాన్స్ బ్రాంచ్‌కు విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు ఆకస్మిక ఆడిటర్‌గా వడ్లమూడి ఉమామహేశ్ వచ్చాడు. బ్రాంచ్ మేనేజర్ యాదాల ప్రవీణ్ కుమార్, క్యాషియర్ అమృతాల ఆశను వివరాలు అడిగి.. ఖాతాదారులకు చెందిన తాకట్టులో ఉన్న బంగారం ప్యాకెట్లను చూపించాలని ఆదేశించాడు. దీంతో వారు స్ర్టాంగ్ రూమ్‌లోని 380 ప్యాకెట్లను ఆయన ముందుంచగా, ఒక్కొక్కటీ పరిశీలిస్తూ తూకం వేశాడు. సాయంత్రం 5 గంటల సమయంలో కొబ్బరినీళ్లు తీసుకురావాలని మేనేజర్, క్యాషియర్‌ను పంపించాడు. వారు తిరిగొచ్చేసరికి ఉమామహేశ్ కనిపించలేదు. అనుమానం వచ్చి సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా, ఆడిటర్ ఆ ఆభరణాన్నింటినీ బ్యాగ్‌లో పెట్టుకుని తేలింది. దీంతో బ్రాంచి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. చింతలపూడి బస్టాండ్‌లె ఆర్టీసీ బస్సు ఎక్కిన అతడు మధ్యలో ఎక్కడో దిగి వేరే వాహనంలో తెలంగాణవైపు పరారై ఉండొచ్చని భావిస్తున్నారు. ఉమామహేశ్ మొత్తం రూ.2.50కోట్ల విలువైన తాకట్టులోని బంగారు ఆభరణాలను అపహరించుకుపోయినట్లు చెబుతున్నారు.