CPI Leader Tribute: సుధాకర్‌రెడ్డికి తుది వీడ్కోలు
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:40 AM
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది.
చంద్రబాబు, రేవంత్, వెంకయ్య సహా ప్రముఖుల నివాళి
అధికార లాంఛనాలతో అంతిమ యాత్ర.. గాంధీ వైద్య కళాశాలకు భౌతిక కాయం అప్పగింత
సుధాకర్‌రెడ్డి మృతి తీరని లోటు:సీఎం చంద్రబాబు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డికి ప్రభుత్వం అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రి నుంచి ఉదయం 10 గంటలకు హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌కు ఆయన భౌతిక కాయాన్ని తీసుకువచ్చారు. అక్కడ ప్రజలు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సుధాకర్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు సురవరం భౌతిక కాయానికి పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం సుధాకర్‌రెడ్డి భౌతిక కాయాన్ని గాంధీ వైద్య కళాశాలకు అప్పగించేందుకు అంతిమ యాత్ర మొదలైంది. ఇందులో భాగంగా హిమాయత్‌నగర్ వై జంక్షన్ వరకు పోలీసుల మార్చ్ సాగింది. అక్కడి నుంచి రెడ్ వాలంటీర్లు కవాతు చేశారు. నారాయణగూడ చౌరస్తా, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ముషీరాబాద్ మీదుగా యాత్ర సాగింది. సాయంత్రం 4.45 గంటలకు సురవరం భౌతిక కాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. ఈ సందర్భంగా విప్లవ జోహార్లు అంటూ కార్యకర్తలు పాటలు పాడుతూ సుధాకర్‌రెడ్డికి కడసారి వీడ్కోలు పలికారు.

రేవంత్, చంద్రబాబు నివాళి..
సీపీఐ దిగ్గజ నేత సురవరం సుధాకర్ రెడ్డి పేరును శాశ్వతంగా గుర్తుండేలా చేస్తామని, ఈ మేరకు క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలకు ఆదర్శంగా నిలిచిన వారిని తమ ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. మఖ్దూం భవన్‌లో సుధాకర్‌రెడ్డి భౌతిక కాయానికి రేవంత్ నివాళులు అర్పించారు. సురవరం మృతి సీపీఐకి, దేశానికి తీరని లోటని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సుధాకర్‌రెడ్డి భౌతిక కాయానికి చంద్రబాబు అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సురవరంతో తనకు సుదీర్ఘ స్నేహం ఉందని చంద్రబాబు తెలిపారు. ఆయనకు అనేక ఉద్యమాలు నడిపిన అనుభవం ఉందని అన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సురవరం భౌతిక కాయానికి నివాళులు అర్పించి, సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సురవరం మా తొలి ఫ్రొఫెసర్
గాంధీ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర
సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని వైద్య కళాశాలకు అప్పగించడం స్ఫూర్తిదాయకం. ఆయన గాంధీ కళాశాల విద్యార్థులకు తొలి అనాటమీ ప్రొఫెసర్ అవుతారు. ఆయన శరీరం ద్వారా ఎంతో మంది విద్యార్థులు వైద్య శాస్త్రాన్ని నేర్చుకుంటారు. ఆయన కుటుంబ సభ్యులు, సీపీఐ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు.