Film Producer Dasari Kiran: వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ అరెస్టు
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:13 AM
వ్యూహం చిత్రనిర్మాత దాసరి కిరణ్‌ను హైదరాబాద్‌లో విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు..
ఆ సినిమా కోసం బంధువు వద్ద 4.5 కోట్ల అప్పు
డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు అనుచరులతో దాడి..
పోలీసుల అదుపులో మరో నలుగురు అనుచరులు
విజయవాడ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): వ్యూహం చిత్రనిర్మాత దాసరి కిరణ్‌ను హైదరాబాద్‌లో విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ చిత్ర నిర్మాణం కోసం బంధువు నుంచి తీసుకున్న అప్పును ఎగ్గొట్టడమే కాకుండా, ఆయనపై దాడి చేయించిన ఘటనలో కిరణ్‌ఫై కేసు నమోదయింది. మరో నలుగురు కిరణ్ అనుచరులు పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. దాసరి కిరణ్ వైసీపీ హయాంలో, ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని వ్యూహం పేరుతో చిత్రాన్ని నిర్మించారు. దీనికోసం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సమీప బంధువు గాజుల మోహన్ నుంచి రూ.4.5 కోట్లను ఆయన అప్పుగా తీసుకున్నారు. హైదరాబాద్‌లో ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న మోహన్ తన వద్ద కూడా అంత డబ్బు లేకపోవడంతో పరిచయం ఉన్న వారివద్ద అప్పు చేసి కిరణ్‌కు డబ్బులు సర్దుబాటు చేశారు. ఆ నాటి నుంచి ఇప్పటి వరకు ఈ డబ్బుకు సంబంధించిన వడ్డీ గానీ, అసలు గానీ కిరణ్ చెల్లించడం లేదు. దీంతో మోహన్ దంపతులు ఈనెల 18వ తేదీన విజయవాడ పటమటలోని కిరణ్ కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో కిరణ్ కార్యాలయంలో లేరు. ఆయన అనుచరులు నలుగురు ఉన్నారు. మోహన్ దంపతులు డబ్బులు అడగడానికి వచ్చారని తెలుసుకున్న కిరణ్ .. కార్యాలయంలోని తన అనుచరులతో వారిపై దాడి చేయించారు. దీనిపై మోహన్ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో కిరణ్‌తోపాటు ఆయన అనుచరులు రామవరప్పాడుకు చెందిన గుదే గౌతమ్, పెనమలూరుకు చెందిన అవ్వారు నాగతేజ, ఎనికేపాడుకు చెందిన గండికోట దుర్గాప్రసాద్, ప్రసాదంపాడుకు చెందిన చేబోయిన సాయిచైతన్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.