AP Transport Department: ఫైలు కదలాలంటే పైసలివ్వాల్సిందే
ABN , Publish Date - Dec 12 , 2025 | 05:38 AM
మా మంత్రి పేషీలో ఫైలు కన్నా ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు ఎంతో వేగంగా కదులుతాయి.. ఆర్టీసీ సిబ్బంది పదోన్నతులపై సీఎం ఆదేశించినా నెలల తరబడి ఆపేసి...
వామ్మో.. రవాణా మంత్రి పేషీ
సీఎం చెప్పినా ముడుపులు ఇవ్వాల్సిందే
ప్రతి పనికీ ఎంతో కొంత చెల్లించాలి
రవాణా శాఖలో లక్షల్లో.. ఆర్టీసీలో వేలల్లో
శాఖను పట్టించుకోని మంత్రి రామ్‌ప్రసాద్
ఏడాదిన్నరలో ఒక్కసారే రవాణాపై సమీక్ష
ఆర్టీసీ వైపు కన్నెత్తి కూడా చూడని వైనం
ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రికి చివరి ర్యాంకు
పేషీలో ఇద్దరు అధికారుల చక్రం.. వాటాలు
ఈ-ఫైలు ఒకరు చూస్తే.. ఓటీపీ మరొకరికి
కమిషనరేట్, ‘ఆర్టీసీ’లో బహిరంగ వ్యాఖ్యలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘మా మంత్రి పేషీలో ఫైలు కన్నా ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు ఎంతో వేగంగా కదులుతాయి.. ఆర్టీసీ సిబ్బంది పదోన్నతులపై సీఎం ఆదేశించినా నెలల తరబడి ఆపేసి ముడుపులు వసూలు చేశాకే ఫైలు కదిపిన ఘనత మా మంత్రిగారి పేషీదే.. ప్రతి పనికీ ఎంతోకొంత చెల్లించాల్సిందే.. లేదంటే ఏ ఫైలు అయినా ముందుకు కదలదు’.. అంటూ ఏపీఎ్‌సఆర్టీసీ హౌస్‌లో సిబ్బంది, అధికారులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. రవాణా శాఖలో పనిచేసే వారి పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంది. ‘ఆదాయం వస్తుందిగా.. తెచ్చివ్వండి’ అని పేషీలో డిమాండ్ చేస్తున్నారు. ఎవరైనా డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు వచ్చిన వెంటనే కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా చర్యలు తీసుకొంటున్నారు. అడ్డూ అదుపూ లేకుండా దండుకుంటున్న కొందరు రవాణా అధికారులపై ఏకంగా రవాణా కమిషనరేట్ నుంచే ఏసీబీకి వివరాలు వెళ్లాయని తెలుస్తోంది. ‘లంచం తీసుకుంటే కమిషనర్‌తో సమస్య.. లంచం తీసుకోలేదు, వాటా ఇవ్వలేమంటే మంత్రి పేషీలో కుదరదు’ అంటూ వాపోతున్నారు.
రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి శాఖా పరమైన పనితీరులో అందరు మంత్రుల కన్నా అట్టడుగున ఉండటంపై సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో సీరియస్ అయ్యారు. గురువారం పత్రికల్లో వార్తలు చూసిన ఆర్టీసీ, రవాణా సిబ్బంది తమ అనుభవాలను బహిరంగంగా చెబుతున్నారు. రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రామ్‌ప్రసాద్ రెడ్డికి చిన్న వయసులోనే రవాణా మంత్రిగా అవకాశం లభించింది. ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు ఆర్జించి పెట్టే కీలకమైన రవాణా శాఖను ఆయన పూర్తిగా వదిలేశారు. ఏపీఎ్‌సఆర్టీసీ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఏడాదిన్నరలో రవాణా శాఖపై ఒక్కసారి మాత్రమే సమీక్షించిన మంత్రి.. ఆర్టీసీపై రెండుసార్లు మాత్రమే అధికారులతో సమావేశమయ్యారు. హైదరాబాద్, బెంగళూరులలో వ్యాపారాలు, నియోజకవర్గంలో వ్యవహారాలతోనే ఆయన తలమునకలై ఉన్నారు.
ఆ ఇద్దరే కీలకం
మంత్రి పేషీలో అధికారిక ఓఎస్‌డీగా ఆర్టీసీ అధికారి విశ్వనాథ్ నియమితులయ్యారు. రిటైర్డ్ ఈడీ కోటేశ్వరరావును అడిషనల్ ఓఎస్‌డీగా మంత్రి నియమించుకున్నారు. నీటిపారుదల శాఖ ఉద్యోగి చైతన్యను పీఎస్‌గా తీసుకున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎమ్మెల్యే(మాజీ మంత్రి) సిఫారసు మేరకు ఇటీవల మరో వ్యక్తిని తీసుకున్నా ఇప్పటి వరకూ అధికారికంగా ఆదేశాలివ్వలేదు. రవాణా, ఆర్టీసీతో పాటు క్రీడలు, యువజన సర్వీసులకు సంబంధించిన ఫైళ్లన్నీ ఇక్కడి నుంచే కదలాలి. ఈ-ఫైళ్లు చూసే అధికారం ఉన్న అధికారి వాటిని పట్టించుకోవట్లేదు. ఇదే అవకాశంగా మరో సీట్లో ఉన్న వ్యక్తి ఈ-ఫైళ్లు తాను చూస్తానని మంత్రి అనుమతి తీసుకున్నారు. తన సంగతేంటని ఇంకో ఉద్యోగి అడగటంతో.. ఈ-ఫైలు మీ ఇద్దరిలో ఎవరు చూసినా మరొకరికి ఓటీపీ వచ్చేలా పని చేసుకోమని మంత్రి అనుమతిచ్చారు. పదోన్నతులు, పనిష్మెంట్లు, వినతులకు సంబంధించిన ఫైళ్లు ఏవి వచ్చినా ముందుకు కదలవు. బేరం కుదిరేదాకా జాప్యం చేస్తున్నారు. అవసరమున్నవారు ఎంతో కొంత ముట్టజెప్పి పని చేయించుకుంటున్నారు. రవాణా శాఖలో పనులైతే లక్షల్లో, ఆర్టీసీలో ఫైళ్లయితే వేలల్లో ఇవ్వాలని విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలనా భవనంలో చర్చించుకుంటున్నారు. ఆటోమెటిక్ టెస్టింగ్ సెంటర్లతో పాటు ఎంవీఐలతోనూ పేషీ ఖర్చులంటూ వసూలు చేస్తున్నట్టు సమాచారం.
యువజన సర్వీసులకు సంబంధించి ఉత్తరాంధ్రకు చెందిన ఒక మహిళా అధికారి డిప్యుటేషన్‌పై వచ్చేందుకు అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సిఫారసుతో దరఖాస్తు చేసుకున్నారు. పైసా ఆదాయం లేని ఆ పోస్టు కోసం ఆమె నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. చివరికి ముడుపులు చెల్లించుకున్నాకే ఫైలు క్లియరైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రవాణా శాఖలో ఒక అధికారి పూర్తి అదనపు బాధ్యతలు(ఎ్‌ఫఏసీ) కోసం భారీగా ముట్టజెప్పినట్లు చర్చ జరుగుతోంది. ఇలాంటి వారిని పేషీ నుంచి బయటికి పంపకపోతే ఆ తప్పులకు మంత్రి బాధ్యత వహించే పరిస్థితి ఎంతో దూరంలో లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.