తాగునీటిపై రగడ!
ABN , Publish Date - Jun 25 , 2025 | 01:37 AM
ఏపీఐఐసీ జమాక్ గృహ సముదాయాలకు మంచినీరు ఇవ్వాలని టీడీపీ కార్పొరేటర్లు ప్రతిపాదించగా, వైసీపీ పాలకవర్గం కుదరదని తిరస్కరించడంతో అఽధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర రగడ జరిగింది. టీడీపీ కార్పొరేటర్లు జమాక్ గృహసముదాయాలకు నీటి పన్ను కట్టించుకొని మంచినీరు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కానీ అధికార వైసీపీ పక్షం కుదరదని, ఆ గృహసముదాయాలు వీఎంసీ పరిధిలోకి రావని, టీడీపీ హయాంలో ఎందుకు మంచినీరు ఇవ్వలేదని వాగ్వాదం చెయ్యటంతో కొద్దిసేపు కౌన్సిల్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఏపీఐఐసీ జమాక్ గృహసముదాయాలకు మంచినీరు ఇవ్వాలని టీడీపీ ప్రతిపాదన
కుదరదని తిరస్కరించిన వైసీపీ పాలక పక్షం
ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లపై వాడీవేడిగా చర్చ
ఇంజనీరింగ్ విభాగం పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సభ్యులు
ఏపీఐఐసీ జమాక్ గృహ సముదాయాలకు మంచినీరు ఇవ్వాలని టీడీపీ కార్పొరేటర్లు ప్రతిపాదించగా, వైసీపీ పాలకవర్గం కుదరదని తిరస్కరించడంతో అఽధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర రగడ జరిగింది. టీడీపీ కార్పొరేటర్లు జమాక్ గృహసముదాయాలకు నీటి పన్ను కట్టించుకొని మంచినీరు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కానీ అధికార వైసీపీ పక్షం కుదరదని, ఆ గృహసముదాయాలు వీఎంసీ పరిధిలోకి రావని, టీడీపీ హయాంలో ఎందుకు మంచినీరు ఇవ్వలేదని వాగ్వాదం చెయ్యటంతో కొద్దిసేపు కౌన్సిల్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది.
కార్పొరేషన్, జూన్ 24(ఆంధ్ర జ్యోతి):
నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్యంగా నగరంలో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు కార్పొరేటర్లు మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. కొండ ప్రాంతాల్లో మంచినీటి సమస్యతో పాటు పాత వాటర్ పైపులైన్లు మార్పు చేయకపోవడంతో మంచినీరు కలుషితం అయి రంగుమారి వస్తుందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న వర్షాకాలం ప్రజలు వ్యాధుల బారిన పడతారని వివరించారు. ఇంజనీరింగ్ విభాగం పనితీరు చాలా అధ్వానంగా ఉందని, అధికారులు కొండ ప్రాంతాలతోపాటు కొన్ని ప్రాంతాలలో మంచినీటి పైపులైన్లు మార్పు చేయాలని చెప్పినా పట్టించుకోవడంలేదని, వాటర్ రాని ప్రాంతాల్లో ప్రజలకు మంచినీటిని అందించలేకపోతున్నారని కార్పొరేటర్లు మండిపడ్డారు. లారీ స్టాండ్ స్థలం ఆక్రమణలకు గురవుతుందని, దానిని పరిరక్షించాలని కోరారు. మధ్యాహ్నం భోజన అనంతరం మేయర్ అనివార్య కారణాలతో రాలేకపోవడంతో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మేయర్ స్థానంలో కౌన్సిల్‌ను ముందుకు నడిపారు. అంతకు ముందు ప్రశ్నోత్తరాల సమయంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లపై వాడీవేడిగా చర్చ జరిగింది. ఏళ్లు గడుస్తున్న లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వలేదని, పేదలు అప్పులు చేసి అద్దె నివాసాల్లో ఉంటున్నారని సీపీఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు ప్రశ్నించారు. వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఇళ్లు సకాలంలో లబ్ధిదారులకు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే టిడ్కో ఇళ్లు పేదలకు ఎప్పుడు అప్పజెబుతారని అధికారులను మేయర్ ద్వారా నిలదీశారు.
డ్రెయినేజీ, మంచినీటి సమస్యలపై వాడీవేడిగా చర్చ
కౌన్సిల్‌లో మంచినీరు, డ్రెయినేజీ వ్యవస్థకు సంబంధించిన అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగింది. డ్రెయినేజీ వ్యవస్థతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఉందని, మంచినీరు కలుషితం అవుతున్న అధికారులు పట్టించుకోకుండా కుంటిసాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ డివిజన్‌లోనైనా మంచినీరు రాలేదని, మంచినీటి ట్యాంకర్లు పంపించాలని కార్పొరేటర్లు ఇంజనీరింగ్ అధికారులకు ఫోన్ చేసిన సమాధానం ఉండటంలేదని కార్పొరేటర్లు మండిపడ్డారు. పలుచోట్ల పైపులైన్లు డ్రెయినేజీలో ఉన్నాయని, లీకులతో కలుషితం అవుతున్నా ఆ పైపులైన్లు మార్చకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడంలేదని, ఇంజినీరింగ్ విభాగం పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు మేయర్ ద్వారా కమిషనర్‌ను కోరారు.
ఏకపక్షంగా వైసీపీ ప్రతిపాదనలకు ఆమోదం
-టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎన్.బాలస్వామి
నగరంలో ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతుంటే వాటిని చర్చించి ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన పాలక పక్షం ఏకపక్షంగా తమ ప్రతిపాదనలు ఆమోదించుకుంటుందని టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎన్.బాలస్వామి ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి అవకాశం లేకుండా ప్రజలను గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ప్రతిపాదనలపై ఎటువంటి చర్చ జరగకుండా అంశాలను కౌన్సిల్‌లో పెట్టి ఆమోదించుకున్నారని విమర్శించారు. ఇది సరికాదన్నారు. గ్రీనరీ పేరట ఉద్యానశాఖ అధికారులు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారే తప్పా నగరంలో ప్రధాన రహదారుల్లో సుందరీకరణ తూతూ మంత్రంగా ఉందని ఆరోపించారు. వేలాది రూపాయలతో కొనుగోలు చేసిన మొక్కలను ఎక్కడో శివారు ప్రాంతాల్లో కనిపించకుండా పెడుతున్నారని విమర్శించారు.
ప్రజల గోడు పట్టించుకోరా..
-సీపీఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు
‘‘ప్రజలు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు.. వారి సమస్యలు పట్టించుకోరా.. పశ్నిస్తే గొంతునొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. బయటకు నెట్టేస్తున్నారు’’ అని సీపీఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు విమర్శించారు. ప్రజలపై ప్రభుత్వాలు పన్నుల భారాలు మోపటమే తప్ప వారి గోడు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఏళ్లు గడుస్తున్నా టిడ్కో, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. టీడీపీ కార్పొరేటర్ ఉమ్మనేని ప్రసాద్ తదితరులు మాట్లాడారు.
ఆ ఉద్యోగిపై ఎందుకంత ప్రేమ?
-టీడీపీ కార్పొరేటర్ ముమ్మనేని వెంకట ప్రసాద్
వీఎంసీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఏకంగా 11 నెలలు ఎటువంటి సమాచారం లేకుండా సెలవు పెట్టారని టీడీపీ కార్పొరేటర్ ఉమ్మనేని వెంకట ప్రసాద్ తెలిపారు. అతనికి అధికారులు వీఎంసీ నిబంధనల ప్రకారం రెండు వార్షిక ఇంక్రిమెంట్లు కట్ చేశారని చెప్పారు. అయితే పాలకపక్షం కౌన్సిల్‌లో అతనిది మొదటి తప్పుగా భావించి, విధించిన శిక్షను రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేసిందని విమర్శించారు.