Share News

Justice Chandrakumar: ప్రజల హక్కుల కోసం పోరాడితే అరెస్టులా

ABN , Publish Date - Jul 20 , 2025 | 04:33 AM

ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి. అధికారంలో ఉన్న నాయకులు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు.

Justice Chandrakumar: ప్రజల హక్కుల కోసం పోరాడితే అరెస్టులా

  • దేశ సంపద, ప్రజల సొమ్ము దోచుకుంటున్న వారే నిజమైన టెర్రరిస్టులు: జస్టిస్‌ చంద్రకుమార్‌

ఒంగోలు కార్పొరేషన్‌/కలెక్టరేట్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి. అధికారంలో ఉన్న నాయకులు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. దేశ సంపదను, ప్రజల సొమ్మును దోచుకుంటున్న వారే నిజమైన టెర్రరిస్టులు’ అని శాంతి చర్చల కమిటీ చైర్మన్‌,హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కె.చంద్రకుమార్‌ ధ్వజమెత్తారు. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర సదస్సు శనివారం ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేడ్కర్‌ భవనంలో జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ 2026 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్రం ప్రకటించడం దారుణమన్నారు. శాంతియుత చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలిపిన ఆయన.. అజిత్‌ పవార్‌ లాంటి బడా నేతలు రూ.70 వేల కోట్లు దోచుకుంటే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కగార్‌ ఆపరేషన్‌తో ఆదివాసీ సంపదను దోచుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. మావోయిస్టులను నిర్మూలించాలని, హెచ్చరించడం దుర్మార్గమైన చర్య అని అభిప్రాయపడ్డారు. పేదరికంలేని సమాజాన్ని సాధించడం కోసం, ప్రజల హక్కులు, ఆదివాసీల కోసం ప్రశ్నించిన దుడ్డు ప్రభాకర్‌ను అరెస్టు చేయడం దుర్మార్గమని జస్టిస్‌ చంద్రకుమార్‌ తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ దుడ్డు ప్రభాకర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.


సాగు ప్రాజెక్టుల్లో ‘ప్రైవేటు’ను సహించం: రామకృష్ణ

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఒంగోలులోని మల్లయ్యలింగం భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులను నిర్మిస్తామని ఇరిగేషన్‌ మంత్రి చెప్పడాన్ని ఖండించారు. పోలవరం ప్రాజెక్టులో 45.75 అడుగుల ఎత్తున నీటి నిల్వ చేసుకునే అవకాశం కేంద్రం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయకుండా ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం పోలవరం, బనకచర్లను తెరపైకి తెచ్చిందన్నారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న దాని గురించి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 04:33 AM