AP Field Assistants: ఉద్యోగ భద్రత కల్పించండి
ABN , Publish Date - Sep 09 , 2025 | 06:07 AM
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి పథకంలో పనిచేస్తుంటే కేవలం 3 వేల మంది సిబ్బంది మాత్రమే...
గ్రామీణాభివృద్ధిశాఖకు ఫీల్డ్ అసిస్టెంట్ల విజ్ఞప్తి
అమరావతి, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి పథకంలో పనిచేస్తుంటే కేవలం 3 వేల మంది సిబ్బంది మాత్రమే ఎఫ్‌టీఈ(ఫిక్స్ టెన్యూర్ ఎంప్లాయీస్)గా ఉన్నారని, మిగిలిన వారిని కూడా ఎఫ్‌టీఈలను చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్‌ల ప్రతినిధులు ఉపముఖ్యమంత్రి ఓఎస్‌డీ వెంకటకృష్ణకు విజ్ఞప్తి చేశారు. ‘నిర్వేదంలో ఉపాధి సిబ్బంది’ శీర్షికన ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై గ్రామీణాభివృద్ధిశాఖ స్పందించింది. ఒక్కో రోజు ఒక్కో కేడర్ ఉపాధి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఎస్‌ఆర్‌డీఎస్ మెంబర్ సెక్రటరీ మద్దిలేటి ఆధ్వర్యంలో తాడేపల్లిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ సమావేశం ఏర్పాటు చేయగా, అన్ని జిల్లాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్స్ ప్రతినిధులు తరలివచ్చారు. ముఖ్య అతిథిగా వెంకటకృష్ణ పాల్గొన్నారు. సిబ్బంది సమస్యలను సానుకూలంగా విన్న అధికారులు ఇందులో ప్రభుత్వం పరిష్కరించగలిగినవన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.