Share News

Fertilizer Distribution: ఎరువుల కోసం రైతులు క్యూకట్టే పరిస్థితి తేవద్దు

ABN , Publish Date - Jul 13 , 2025 | 05:42 AM

ఎరువులు లేవనే అపోహలు గానీ, ఎరువుల కోసం ఎక్కడా రైతులు క్యూలో వేచి ఉండే పరిస్థితులు గానీ ఉండకూడదని వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ రాజశేఖర్‌ జిల్లా అధికారులకు స్పష్టం చేశారు.

Fertilizer Distribution: ఎరువుల కోసం రైతులు క్యూకట్టే పరిస్థితి తేవద్దు

  • వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ రాజశేఖర్‌

అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): ఎరువులు లేవనే అపోహలు గానీ, ఎరువుల కోసం ఎక్కడా రైతులు క్యూలో వేచి ఉండే పరిస్థితులు గానీ ఉండకూడదని వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ రాజశేఖర్‌ జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. కర్నూలు, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో రైతులు బారులు తీరిన పరిస్థితుల్లో శనివారం ఆయన జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, మార్క్‌ఫెడ్‌ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎరువుల కోసం రైతులు క్యూలో ఉండాల్సిన పరిస్థితులు తేవొద్దన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో ఎరువుల లభ్యతపై వాస్తవ పరిస్థితులను రాజశేఖర్‌ వాకబు చేశారు. రానున్న రెండు నెలలు ఎరువుల పంపిణీ అత్యంత కీలకమని, సాగు విస్తీర్ణం, పంటలకు అవసరమైన ఎరువులు, జిల్లాల్లో నిల్వలపై బేరీజు వేసుకుని, వ్యవసాయ, సహకార, మార్క్‌ఫెడ్‌ అధికారులు సమన్వయంతో అంతర్గత యాజమాన్యంపై శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. మన్యం, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లు శ్యాంప్రసాద్‌, స్వప్నిల్‌ దినకర్‌ మాట్లాడుతూ తమ జిల్లాల్లో పంటల సాగు విస్తీర్ణానికి తగ్గ ఎరువుల నిల్వలున్నాయని, రైతులకు ఎరువులు అందవనే అపోహ అవసరం లేదని స్పష్టం చేశారు. కర్నూలు కలెక్టర్‌ రంజిత్‌ బాషా స్పందిస్తూ.. గత ఐదేళ్లూ సొసైటీల్లో ఎరువుల పంపిణీ అలవాటు తప్పిందని, ఇప్పుడు రైతులంతా డీసీఎంఎస్‌ ఎరువుల పాయింట్‌కు రావడంతో క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని వివరించారు. మార్క్‌ఫెడ్‌కు ఇచ్చే 50ు కోటా నుంచి రైతుసేవా కేంద్రాలకు ఎరువుల వికేంద్రీకరణ జరిగితే రైతులు క్యూలో ఉండాల్సిన అవసరం ఉండదని సూచించారు. జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న ఎరువులు, జూలై, ఆగస్టులో రానున్న ఎరువుల వివరాలను వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డిల్లీరావు వివరించారు.

Updated Date - Jul 13 , 2025 | 05:44 AM