Nearly 2 Lakh Apply for TET: టెట్‌కు 1,97,823దరఖాస్తులు
ABN , Publish Date - Nov 21 , 2025 | 04:08 AM
ఉపాధ్యాయ అర్హత పరీక్షటెట్‌కు 1,97,823 దరఖాస్తులు వచ్చాయి. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో కొత్తగా ఉపాధ్యాయ విద్య పూర్తిచేసిన వారికి అవకాశం...
వారిలో ఇన్‌సర్వీస్ టీచర్లు 17,883 మంది
పురుషుల కంటే మహిళల నుంచి రెట్టింపు సంఖ్యలో వచ్చిన దరఖాస్తులు
రెండు రోజుల్లో ముగియనున్న గడువు
అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు 1,97,823 దరఖాస్తులు వచ్చాయి. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో కొత్తగా ఉపాధ్యాయ విద్య పూర్తిచేసిన వారికి అవకాశం కల్పించే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ ఇటీవల టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసారి 17,883 మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఈ నెల 23తో దరఖాస్తుల గడువు ముగియనుంది. మొత్తం దరఖాస్తుల్లో 66,104 పురుషుల నుంచి, 1,31,719 మహిళల నుంచి వచ్చాయి. పురుషులతో పోలిస్తే మహిళలు దాదాపుగా రెట్టింపు సంఖ్యలో టెట్‌కు దరఖాస్తు చేశారు. ఇదిలా ఉండగా, ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అయినప్పటికీ మినహాయింపు లభిస్తుందనే ఆశతో ఎక్కువమంది దరఖాస్తు చేసుకోలేదు. 2011నుంచి టెట్ అమల్లోకి వచ్చింది. అంతకుముందు నుంచి టీచర్లుగా ఉన్నవారు కూడా ఇప్పుడు టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ ప్రకారం రాష్ట్రంలో దాదాపు లక్ష మంది టీచర్లు ఈ పరీక్ష రాయాల్సి ఉంది. కానీ ఇప్పుడు అందులో 25శాతం మంది కూడా దరఖాస్తు చేసుకోలేదు. టెట్ అర్హత సాధించేందుకు ఇన్ సర్వీస్ టీచర్లకు రెండేళ్ల సమయం ఉంది. మరోవైపు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీంలో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. దానిపై విచారణ కొనసాగుతోంది. కేంద్రం కూడా మినహాయింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలో పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని టీచర్లు భావిస్తున్నారు.