Share News

Nuzvid Triple IT Engineering College: ఫీజు కడితేనే సర్టిఫికెట్‌

ABN , Publish Date - Sep 18 , 2025 | 04:20 AM

విద్యార్థుల జీవితాలతో ఉన్నత విద్యాశాఖ ఆటలాడుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంటు కింద ప్రభుత్వం సొమ్ము చెల్లించకపోవడంతో విద్యార్థులు తమ అమూల్యమైన అవకాశాలను కోల్పోతున్నారు.

Nuzvid Triple IT Engineering College: ఫీజు కడితేనే సర్టిఫికెట్‌

  • ఉన్నత విద్యాసంస్థల అల్టిమేటం

  • విద్యార్థుల జీవితాలతో ఆటలు

  • సర్టిఫికెట్లు ఇవ్వని ఆర్జీయూకేటీ

  • పీజీ అనుమతికి ఏఎన్‌యూ నో

  • ప్రభుత్వ ఫీజు బకాయిలే కారణం

  • ఇప్పటికి ఆరు క్వార్టర్లు పెండింగ్‌

  • అప్పు చేసి ఫీజు కడుతున్న వైనం

  • కట్టలేనివారు ఉన్నతవిద్యకు దూరం

  • జగన్‌ విధానమే సమస్యకు కారణం

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన ఓ విద్యార్థికి ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ, సర్టిఫికెట్లు క్యాంప్‌సలోనే ఉండిపోయాయి. ఫీజు కట్టలేదనే కారణంతో అధికారులు సర్టిఫికెట్లు నిలిపివేశారు. దీంతో ఆ విద్యార్థి ఉద్యోగం కోల్పోయే దుస్థితి ఏర్పడింది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

విద్యార్థుల జీవితాలతో ఉన్నత విద్యాశాఖ ఆటలాడుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంటు కింద ప్రభుత్వం సొమ్ము చెల్లించకపోవడంతో విద్యార్థులు తమ అమూల్యమైన అవకాశాలను కోల్పోతున్నారు. ప్రభుత్వ పరిధిలోని విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలే ఫీజుల కోసం విద్యార్థులను ఇక్కట్ల పాల్జేస్తున్నాయి. ‘ఫీజు కట్టు.. సర్టిఫికెట్‌ తీసుకో’ నినాదంతో ఒత్తిడి పెంచుతున్నాయి. నాగార్జున, ఆర్జీయూకేటీ, ఎస్వీ యూనివర్సిటీలు సహా పలు ఉన్నత విద్యాసంస్థలు ఇదే అనుసరిస్తున్నాయి. దీంతో చదువు పూర్తయి ఉద్యోగాల వేటలో ఉన్నవారికి, ఇప్పటికే ఉద్యోగం వచ్చి సర్టిఫికెట్లు సమర్పించాల్సిన వారికి, మరింత ఉన్నత స్థాయి విద్యను అభ్యసించాలని అనుకున్నవారికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోనీ ఆర్జీయూకేటీ, నాగార్జున, శ్రీవెంకటేశ్వర వర్సిటీల పరిధిలోని కాలేజీలు ప్రైవేటు విద్యా సంస్థలా అంటే కాదు. ప్రభుత్వ పరిధిలో ఉన్న కాలేజీలే. అయినప్పటికీ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వం ఆరు క్వార్టర్ల ఫీజులు బకాయిపెట్టింది.


మరోవైపు ప్రభుత్వ పరిధిలోనే ఉన్న యూనివర్సిటీ కాలేజీలు ఫీజులు కట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో విద్యార్థులు అల్లాడిపోతున్నారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలో బీటెక్‌ పూర్తిచేసిన ఓ విద్యార్థి తనకు ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని, సర్టిఫికెట్లు ఇవ్వాలని వేడుకున్నాడు. కానీ, నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ అధికారులు నిరాకరించారు. మొత్తం పెండింగ్‌ ఫీజు కట్టి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉద్యోగాలు సాధించిన కొందరు విద్యార్థులకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. దీంతో వారు చేసేది లేక.. అప్పు చేసి ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఇక, ఫీజులు చెల్లించే స్తోమత లేనివారు.. ‘‘మా గోడు వినిపించుకోండి.’’ అంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం సకాలంలో ఫీజులు విడుదల చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా చెబుతున్నారు.


నాడు నేడు కలిపి 6

ఫీజురీయింబర్స్‌మెంటు సొమ్ములో గత వైసీపీ ప్రభుత్వం మూడు క్వార్టర్ల ఫీజు పెండింగ్‌ పెట్టింది. ప్రస్తుత ప్రభుత్వం మరో 3 క్వార్టర్లు బకాయి పెట్టింది. మొత్తం 6 క్వార్టర్ల ఫీజులను విడుదల చేయాల్సి ఉంది. ఇది రూ.4,200 కోట్లుగా ఉంది. ఏళ్లు గడిచినా విడుదల చేయడం లేదు. దీంతో తమ భవిష్యత్తు కోసం విద్యార్థులే తమ ఫీజులు చెల్లించే పరిస్థితి ఏర్పడింది. గతంలో రీయింబర్స్‌మెంట్‌ సొమ్మును నేరుగా కాలేజీల ఖాతాలకు జమ చేసేవారు. జగన్‌ వచ్చాక జనం మెప్పుకోసం.. ఆ సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమచేయడం ప్రారంభించారు. అయినప్పటికీ ఆయన దిగిపోయే సమయానికి 3 క్వార్టర్ల సొమ్ము బకాయి పెట్టారు. అప్పటికే తల్లుల ఖాతాల్లో జమ చేసిన సొమ్మును కొందరు కాలేజీలకు చెల్లించలేదు. వైసీపీ పెండింగ్‌ పెట్టిన 3 క్వార్టర్ల సొమ్మును ఇప్పుడు కూడా తల్లుల ఖాతాల్లోనే జమ చేయాలి. దీంతో ఆ సొమ్మును తమకు చెల్లిస్తారో లేదో అన్న బెంగతో కాలేజీలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. దీనికితోడు నేరుగా ప్రభుత్వం తమ ఖాతాల్లో వేసే సొమ్ము విషయంలోనూ మెలిక పెట్టి.. పెండింగ్‌లో ఉన్న బకాయిలు కూడా మీరే కట్టాలని వర్సిటీల అధికారులు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారు. ఒకట్రెండు క్వార్టర్ల ఫీజులైతే ఎలాగోలా కట్టగలమని, ఆరు క్వార్టర్ల ఫీజులు ఎక్కడి నుంచి తేవాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఉన్నతాధికారుల మౌనం

విద్యార్థుల ఇబ్బందులపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆర్జీయూకేటీ ఇన్‌చార్జ్‌ చాన్స్‌లర్‌ కె. మధుమూర్తి, నూజివీడు ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ అమరేంద్రకుమార్‌ల దృష్టికి విద్యార్థుల సమస్యలు వెళ్లినా ఎలాంటి పరిష్కారం లభించలేదు. మరోవైపు ఉన్నత విద్యాశాఖ అధికారులు, మంత్రి నారా లోకేశ్‌ పేషీ అధికారులు ఈ సమస్య తమ పరిఽధిలో లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికే అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యలో అడ్మిషన్లు కోల్పోయారు.

ఆ అధికారులతోనే అడ్డంకి!

ఆర్జీయూకేటీ క్యాంప్‌సలలో ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో నియమించిన అధికారులే కీలక హోదాల్లో ఉన్నారు. ఇప్పుడు వారే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఉన్నతాధికారులు సర్టిఫికెట్లు ఇవ్వాలని చెబుతున్నా వినిపించుకోవడం లేదు. కొందరు యూనివర్సిటీల అధికారులు కూడా ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు నిలిపివేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విద్యార్థులకు ఎక్కడా సర్టిఫికెట్లు ఆపడానికి వీల్లేదని మంత్రి లోకేశ్‌ ఇచ్చిన ఆదేశాలను కూడా వర్సిటీల అధికారులు బేఖాతరు చేస్తున్నారు.

Updated Date - Sep 18 , 2025 | 04:24 AM