Student Issues: బకాయిల పాపం జగన్‌దే
ABN , Publish Date - Mar 11 , 2025 | 04:46 AM
ప్రతి ఏటా మూడో క్వార్టర్ ముగిసిన తర్వాత గానీ మొదటి క్వార్టర్ ఫీజులు ఖాతాలకు చేరలేదు. ఈ క్రమంలో అధికారం నుంచి దిగిపోతూ.. 3 క్వార్టర్ల ఫీజులు బకాయి పెట్టి వెళ్లారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ 2,832 కోట్లు.. వసతి దీవెన 989 కోట్లు.. పీజీ 450 కోట్లు
ఉన్నత విద్యలోనే 4,271 కోట్ల బకాయిలు.. పాఠశాల విద్యలో మరో 352 కోట్లు
ఒక్కసారీ సకాలంలో ఫీజులివ్వని వైసీపీ.. మూడు క్వార్టర్లు గడిస్తేనే తొలి క్వార్టర్ ఫీజు
జగన్ హయాంలో ఉన్నత విద్యార్థుల ఇక్కట్లు.. పీజీకి రీయింబర్స్‌మెంట్ పథకమే రద్దు
వైసీపీ పెట్టిన బకాయిలపై వైసీపీనే ధర్నా.. విమర్శలతో ‘ఫీజు పోరు’ పేరు మార్పు
అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ఒక్క త్రైమాసికంలోనూ సకాలంలో ఫీజులు విడుదల చేయలేదు. ప్రతి ఏటా మూడో క్వార్టర్ ముగిసిన తర్వాత గానీ మొదటి క్వార్టర్ ఫీజులు ఖాతాలకు చేరలేదు. ఈ క్రమంలో అధికారం నుంచి దిగిపోతూ.. 3 క్వార్టర్ల ఫీజులు బకాయి పెట్టి వెళ్లారు. పైగా కాలేజీలు-ప్రభుత్వం మధ్య ఉండాల్సిన ఫీజుల అంశాన్ని.. కాలేజీలు-తల్లిదండ్రుల మధ్యకు తీసుకొచ్చి వారినీ ఇబ్బంది పెట్టారు. పీజీకి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్నే రద్దుచేశారు. ఉన్నత విద్యలో ఇన్ని ఘనకార్యాలు చేసిన జగన్.. ఇప్పుడు ‘యువత పోరు’ పేరుతో ధర్నాలకు పిలుపునివ్వడం విడ్డూరంగా మారింది. గతంలో ఎవరూ చేయని విధంగా తాను పెట్టిన బకాయిలపై తానే ధర్నాలకు మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. అసలు ఈ బకాయిలు ఎవరు పెట్టారు? అనే విషయాన్ని పక్కనపెట్టి ఫీజుల బకాయిలు విడుదల చేయాలంటూ నిరసనలకు దిగుతున్నారు. అయితే, తాము పెట్టిన బకాయిలపై తామే ధర్నాలు చేయడంపై విమర్శలు పెరగడంతో ‘ఫీజు పోరు’ను వైసీపీ ‘యువత పోరు’గా మార్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో పాటు నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాలనూ చేర్చారు. ఇలా పేరు మార్చడంతోనే ఆ పాపం మాదేనని వైసీపీ అంగీకరించినట్టయింది.
బకాయిల పర్వం ఇదీ..
కూటమి అధికారంలోకి వచ్చేనాటికే ఉన్నత విద్యలో రూ.4,271 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద దాదాపు నాలుగు క్వార్టర్ల ఫీజులు రూ.2832 కోట్లను వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. హాస్టల్ ఖర్చులు, ఇతర అవసరాల కోసం ఏడాదికి రూ.20 వేలు ‘వసతి దీవెన’ కింద ఇస్తామని హామీ ఇచ్చి వాటిలోనూ రూ.989 కోట్లు బకాయి పెట్టింది. పీజీలో అక్రమాలు జరుగుతున్నాయని విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. కాలేజీలకు చెల్లించాల్సిన రూ.450 కోట్లు ఆపేసింది. దానిపై విచారణ పూర్తయినా ఆ బకాయిలు విడుదల చేయలేదు. దీంతో ప్రభుత్వంతో తమకు సంబంధం లేదంటూ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి సదరు ఫీజులు వసూలు చేశాయి. అనేక చోట్ల కోర్సు పూర్తయినా సర్టిఫికెట్ జారీచేయకుండా నిలిపివేసి ఇబ్బందులు పెట్టాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక క్వార్టర్ ఫీజులు రూ.788 కోట్లు నేరుగా కాలేజీల ఖాతాల్లో జమ చేసింది. ఇక, 2021 నుంచి మొత్తం పీజీకి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్నే రద్దు చేసింది. ప్రైవేటు కాలేజీల్లో పీజీ చదివితే రీయింబర్స్‌మెంట్ వర్తించదని, కేవలం యూనివర్సిటీల కాలేజీల్లో చదివితేనే ఈ పథకం వర్తిస్తుందని నిబంధనలు మార్చడంతో పేద విద్యార్థులు పీజీ చదువులు మానేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వైసీపీ ప్రభు త్వం అస్తవ్యస్తం చేసింది. ఒక్క సంవత్సరం కూడా సక్రమంగా ఫీజులు విడుదల చేయలేదు. ప్రతి విద్యా సంవత్సరంలో క్వార్టర్ ముగియగానే ఫీజులు తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామని అప్పట్లో వైసీపీ ప్రకటించింది. అలా ఏడాదికి నాలుగు సార్లు ఫీజులు రావాలి. కానీ, విద్యార్థి కాలేజీలో చేరిన మూడు క్వార్టర్ల తర్వాత మొదటి క్వార్టర్ ఇచ్చేవారు. విద్యార్థి రెండో సంవత్సరంలోకి వచ్చాక మొదటి ఏడాది రెండో క్వార్టర్ ఫీజులు వచ్చేవి. ఇలా వైసీపీ హయాంలో తీవ్ర ఇబ్బందులు పెట్టారు.
పేరు మార్చి ఏమార్చే యత్నం!
వరసుగా రైతు పోరు.. విద్యుత్తు ఛార్జీల పోరు వైఫల్యం కావడంతో.. విద్యార్ధుల ‘ఫీజు పోరు’ పేరిట ఈ నెల 12వ తేదీన జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని.. కలెక్టర్లకు వినతి పత్రాలను ఇవ్వాలని వైసీసీ అధ్యక్షుడు జగన్ భావించారు. దీనికి సంబంధించి పోస్టర్లను కూ డా సిద్ధం చేశారు. ఫీజు పోరుకు సహకరించాలంటూ విద్యార్ధుల తల్లిదండ్రుల మద్దతు కోరారు. పెద్ద ఎత్తున విద్యార్థులతో కలసి కలెక్టరే ట్‌లకు వెళ్లి వినతి పత్రాలను ఇవ్వా లని వైసీపీ నేతలకు జగన్ కర్తవ్య బోధ చేశారు. అయితే.. విద్యార్థుల నుంచి పెద్దగా స్పందన కనిపిం చడం లేదు. దీంతో.. ఫీజుపోరును కాస్తా.. ‘యువత పోరు’గా మార్చేశారు.