Nellore District: కుమారుడిని చంపిన తండ్రి
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:58 AM
పేదల సామాజిక భద్రత కోసం ప్రభుత్వం పంపిణీ చేసే ఎన్టీఆర్ పింఛన్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
పింఛన్ నగదు ఇవ్వాలని ఒత్తిడి చేయడమే కారణం
ఆత్మకూరు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పేదల సామాజిక భద్రత కోసం ప్రభుత్వం పంపిణీ చేసే ఎన్టీఆర్ పింఛన్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడులో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామంలోని దళితవాడకు చెందిన ఎం.పుల్లయ్యకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ వస్తుంది. సోమవారం 1వ తేదీ కావడంతో సచివాలయ సిబ్బంది పుల్లయ్య ఇంటికి వచ్చి పింఛన్ డబ్బులు రూ.4 వేలు ఇచ్చారు. అతని కుమారుడు మస్తానయ్య పింఛన్ డబ్బులు ఇవ్వాలని తండ్రిపై ఒత్తిడి చేశాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న పుల్లయ్య కోపంతో పక్కనే ఉన్న కర్రతో కుమారుడి తలపై దాడి చేశాడు. దీంతో మస్తానయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి వైద్యశాలకు తరలించేటప్పటికే మృతి చెందాడు. ఆత్మకూరు సీఐ గంగాధర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పుల్లయ్యను అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు.