Share News

Fatepuram: ఊరంతా నిక్‌నేమ్‌లే

ABN , Publish Date - Dec 21 , 2025 | 04:26 AM

గోదావరి జిల్లాలంటేనే వెటకారానికి పెట్టింది పేరు! అందులోనే ఆట పట్టింపు, హాస్యం.. ఆ వెంటనే ఆప్యాయత కలబోత ఉంటుంది! అలాంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలంలోని చిననిండ్రకొలను ఊరి పేరుకూ ఓ నిక్‌నేమ్‌ ఉంది.

Fatepuram: ఊరంతా నిక్‌నేమ్‌లే

  • ఆ పేరుతో పిలిస్తేనే పలుకుతారు

  • ముద్దుపేర్లకు కేరాఫ్‌ ఫత్తేపురం!

  • అసలు పేరు చిననిండ్రకొలను

  • నిక్‌నేమ్‌తో పిలవడం, పిలిపించు కోవడం వారికి.. అదో తుత్తి!

  • గోదారి జిల్లాలంటేనే వెటకారం అన్నమాటకు రుజువు

ఏరా.. ట్రాక్టర్‌ శీనుగాడింటికి ఫంక్షన్‌కి ఇంకా బయల్దేరలేదా?

లేదురా.. ఆ కలెక్టర్‌గాడు కూడా వస్తే కలిసి వెళ్తాం..!

ఇంకెక్కడి కలెక్టర్‌.. ఆడూ.. ఐజీగాడూ ముందే వెళ్లిపోయారు...

అవునా.. నేనూ వస్తాను.. ఇక్కడుండమన్నాడు మరీ..!

సరిసర్లే.. బయల్దేరు.. నేనూ.. చంద్రబాబూ ఒక బండిమీద వచ్చేస్తాం..!

..ట్రాక్టర్‌ శీనుగాడింట్లో ఫంక్షన్‌ ఏంటీ.. కలెక్టర్‌.. ఐజీ ఏంటీ.. చంద్రబాబు.. ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా?.. అవును ఆ ఊళ్లో అడుగు పెడితే ఇలాంటి సంభాషణలే వినిపిస్తాయి!. అయితే వాళ్లంతా నిజమైన కలెక్టరు.. ఐజీలు కాదు.. వారికి ఉన్న ముద్దుపేర్లు అవి!.. అసలు ఆ ఊరిపేరుకూ నిక్‌నేమ్‌ ఉంది.. అదే.. ఫత్తేపురం!.. అసలు పేరేంటి అని ఆలోచిస్తున్నారా?..!! చదవండి మరి!

(నిడమర్రు-ఆంధ్రజ్యోతి)

గోదావరి జిల్లాలంటేనే వెటకారానికి పెట్టింది పేరు! అందులోనే ఆట పట్టింపు, హాస్యం.. ఆ వెంటనే ఆప్యాయత కలబోత ఉంటుంది! అలాంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలంలోని చిననిండ్రకొలను ఊరి పేరుకూ ఓ నిక్‌నేమ్‌ ఉంది. అదే ‘ఫత్తేపురం’. రికార్డుల ప్రకారం చిన నిండ్రకొలను అని ఉన్నప్పటికీ ఫత్తేపురం అంటేనే ఈ ప్రాంతం వారికి తెలుస్తుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాల పరిధిలో ఉందీ గ్రామం.


మారు పేర్ల వెనుక కథ..

ఓ వ్యక్తి ప్రతి విషయంలోనూ నిబంధనలు పాటించాలని రూల్స్‌ మాట్లాడతాడు. అందుకే అతడిని కలెక్టర్‌ అంటారు. మరో వ్యక్తిని సీఐడీ గాడు అని ఎందుకంటారంటే.. ఊరిలో ఏదైనా విషయం జరిగితే ముందుగా పడేది వాడిచెవినే. ఎవరికీ తెలియని విషయాలు కూడా తెలుసుకుని ఆరాలు తీస్తుంటాడు. యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచీ గెడ్డం తీయకుండా పెంచుకుంటున్నాడని ఒకరిని గెడ్డం శ్రీను అని పిలుస్తుంటారు. ఒకాయన చంద్రబాబులా గెడ్డం పెంచుకొని, ఆయనలా కనిపించడంతో అతడిని జూనియర్‌ చంద్రబాబు అని పిలుస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే మొండేలు కొండయ్య, చినమూర్తి, బియ్యంగాడు,, మోచేతులోడు, మువ్వగాడు, బొమ్మలోడు, అబ్బులిక్కం, ట్రాక్టర్‌ శ్రీను, కాన్వెంట్‌ శ్రీను.. ఇలా ఎన్నో మరెన్నో నిక్‌ నేమ్‌లు తారసపడుతుంటాయి. వీరంరికీ అసలు పేర్లు వేరే ఉన్నాయి. ఇలా ఒక్కో నిక్‌ నేమ్‌కు ఒక్కో చరిత్ర... ఒక్కో కథ. అయితే, మారుతున్న కాలంతోపాటు అధికంగా విద్యావంతులు కావడంతో నిక్‌ నేమ్‌లు సంప్రదాయం తగ్గుతూ వస్తోందని స్థానికులు చెబుతున్నారు. కానీ నిక్‌నేమ్‌తో పిలవడం, పిలిపించుకోవడం గోదావరి యాస, భాష, ఓ సరదా. ఓ తుత్తి.. అని అక్కడివారు చెబుతారు.


ఫత్తేపురం పేరు ఇలా వచ్చింది..

పూర్వం నిజాం నవాబు పాలనలో ఈ ప్రాంతం ఉండేది. నిజాం ప్రభువు ప్రతినిధి ఫత్తేఖాన్‌ అనే అధికారి చిననిండ్రకొలనులోనే నివాసం ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంత ప్రజల బాగోగులు చూస్తుండేవారు. దీంతో కొల్లేరు ముఖద్వారంగా ఉండే ఈ ప్రాంతం ఫత్తేఖాన్‌ పేరు మీద ఫత్తేపురంగా పిలువబడుతూ వచ్చింది. చిననిండ్రకొలను పేరు అధికారికంగా నిలిచినా, ఫత్తేపురమని అంటేనే బయటివారికి తెలుస్తుంది.

ప్రముఖుల ముద్ర

ప్రముఖ గాంధేయవాది చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు స్వస్థలం ఫత్తేపురం. ఆయన తన ఇంటిని నెహ్రూ గారి ఇంటి నమూనాలో నిర్మించుకొని గాంధేయవాద సిద్ధాంతాలను ప్రచారం చేస్తూండేవారు. 30 ఏళ్ల పాటు స్థానిక ఎమ్మెల్యేగా నిలిచి ఎన్నో విద్యాసంస్థలను నెలకొల్పి ఈ ప్రాంత ప్రజలకు విద్యాదాతగా పేరుపొందారు. చిననిండ్రకొలను సరిహద్దులో మూర్తిరాజు పార్లమెంట్‌ నమూనాలో నిర్మించిన గాంధీ భవన్‌ ఇప్పటీకీ చారిత్రక, పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతోంది. ప్రస్తుత ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు స్వగ్రామం కూడా ఫత్తేపురమే. రాజకీయ ముఖచిత్రంలోను ఈ గ్రామానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ ఓటుకు రూ.లక్ష చొప్పున పందేలు జరిగాయి. అలా వైసీపీకి 131 ఓట్లు మెజారిటీ రావడంతో.. ఓడిన వారు కోటీ 31 లక్షల పందెం సొమ్మును ప్రత్యర్థులకు సమర్పించుకున్నారు.


ఉత్తరం ఇవ్వడానికి మూడు రోజులు పట్టింది..

నా రూపం, ఆహార్యం అచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాదిరి ఉండడం వల్ల నన్ను గ్రామంలో అందరూ జూనియర్‌ బాబు అని, జూనియర్‌ చంద్రబాబు అని పిలుస్తుంటారు. నా అసలు పేరు శ్రీరాప సత్యనారాయణ. ఈ పేరుతో ఉత్తరం వస్తే పోస్టుమాన్‌ నాకు అందించడానికి మూడు రోజులు పట్టింది. గ్రామస్ధులందరూ అభిమానంతో పిలవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ నిక్‌నేమ్‌లు మా ఊరిలో చాలా మందికి ఉన్నాయి. మా ఊరోళ్లకు ఇదో సరదా!

- జూనియర్‌ చంద్రబాబు అలియాస్‌ శ్రీరాప సత్యనారాయణ


పిలుపులో ఆప్యాయతనే చూస్తాం..

మా గ్రామం ఆచారాలకు, అభిమానానికి పెట్టింది పేరు. పూర్తిగా గ్రామీణ వాతావరణం. ప్రతి ఒక్కరూ ఎదుటివారిని ఆప్యాయతగా పిలవడం అలవాటు. నేను చిన్ననాటి నుంచి లావుగా, బొద్దుగా ఉండి కొండలా కనబడడం వల్ల నన్ను కొండయ్య, కొండరాజు అని మా పెద్దళ్లో పిలిచివారు. అదేపేరు వాడుక పేరుగా మారిపోయింది. ఆ పిలుపులో ఆప్యాయతను చూస్తామే కానీ వెక్కిరింపును పట్టించుకోం.

- వెంకటేశ్వరరాజు, గ్రామ ఉపసర్పంచ్‌ ఫత్తేపురం


సంతకానికే అసలు పేరు వాడుతాను

ఊరిలో నన్ను అందరూ బాచిరాజు అని పిలుస్తారు. స్కూల్‌ రికార్డులలో నా పేరు చింతలపాటి వెంకట సత్యనారాయణరాజు. కానీ ఆ పేరు ఊర్లో చాలామందికి తెలియదు. నా అసలు పేరును బ్యాంకుల్లో, ప్రభుత్వ సంతకాల సమయంలోనే వాడతాను.

- సత్యనారాయణరాజు, ఆక్వా వ్యాపారి

Updated Date - Dec 21 , 2025 | 04:26 AM