ఇక వేగంగా..
ABN , Publish Date - Jun 30 , 2025 | 01:18 AM
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు చేపట్టేందుకు సీఆర్‌డీఏ అడుగులు ముందుకు వేస్తోంది. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బీవోటీ) విధానంలో రోడ్డును నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలో అవసరమైన 1,155.41 ఎకరాల భూములు సమీకరించేందుకు త్వరలో గ్రామ సభలు నిర్వహించనుంది. అవిపూర్తయిన పక్షం రోజుల్లోనే టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది.
బీవోటీ విధానంలో ఇన్నర్ రింగ్ రోడ్డు!
- రంగం సిద్ధం చేసిన సీఆర్‌డీఏ
- ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భూ సమీకరణ
- అవసరమైన భూములు 1,155.41 ఎకరాలు
- ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం, జీ కొండూరు, విజయవాడ రూరలలలల్ మండలాల్లో..
- కృష్ణా జిల్లాలో గన్నవరం, పెనమలూరు మండలాల్లో భూ సమీకరణ!
- గ్రామ సభలు నిర్వహించేందుకు సన్నద్ధం
- పూర్తికాగానే పక్షం రోజుల్లో టెండర్ల ప్రక్రియ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు చేపట్టేందుకు సీఆర్‌డీఏ అడుగులు ముందుకు వేస్తోంది. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బీవోటీ) విధానంలో రోడ్డును నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలో అవసరమైన 1,155.41 ఎకరాల భూములు సమీకరించేందుకు త్వరలో గ్రామ సభలు నిర్వహించనుంది. అవిపూర్తయిన పక్షం రోజుల్లోనే టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) పనులకు సీఆర్‌డీఏ రంగం సిద్ధం చేస్తోంది. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బీవోటీ) విధానంలో ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించేందుకు సిద్ధమవుతోంది. మూడు నెలల్లోపే దీనికి సంబంధించిన టెండర్లు పిలవనుంది. అమరావతి రెండో దశ భూ సమీకరణలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఆటోమేటిక్‌గా భూ సమీకరణ జరిగిపోతుంది. దాదాపుగా 45 శాతం మేర భూములు ఐఆర్‌ఆర్‌కు సమకూరనున్నాయి. ఎటొచ్చీ ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భూములను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు జిల్లాల్లో కూడా భూ సమీకరణ కిందనే భూములను తీసుకోవాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. దీని కోసం ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్ పరిధిలోని మండలాల్లో గ్రామ సభలు నిర్వహించనుంది. గ్రామ సభల్లో ఐఆర్‌ఆర్ ఉద్దేశ్యాన్ని వివరించి, రైతులతో చర్చలు జరిపి వారి అభిప్రాయాలను తీసుకుంటుంది. గ్రామ పంచాయతీల తీర్మానాలను కూడా తీసుకుంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావటానికి మూడు నెలల డెడ్‌లైన్‌ను సీఆర్‌డీఏ నిర్దేశించుకుంది. డెడ్‌లైన్ పూర్తి కాగానే బీవోటీ విధానంలో టెండరు నోటిఫికేషన్‌ను వెలువరించనుంది. బీవోటీ విధానంలో కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్టు సంస్థ మాత్రమే చేపడుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించే సంస్థకు నిర్ణీత కాలపరిమితి మేరకు నిర్వహణ చేపట్టి ఆ తర్వాత ప్రభుత్వానికి యాజమాన్య హక్కులను అప్పగిస్తుంది. బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ విధానంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువుగా ఎక్స్‌ప్రెస్‌వేలు, ఎయిర్‌పోర్టులు నిర్మిస్తున్నారు.
96.25 కిలోమీటర్లు.. 3,556.17 ఎకరాలు
ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) ప్రాజెక్టు అనేది గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాల పరిధిలో ఉంటుంది. మొత్తంగా 41 గ్రామాల్లో ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్ సాగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో ఇన్నర్ రింగ్ రోడ్డు కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ మీదుగా కూడా వెళుతుంది. ఐఆర్‌ఆర్‌కు సంబంధించిన అలైన్‌మెంట్, డీపీఆర్‌ను గతంలోనే ‘స్టుప్’ కన్సల్టెన్సీతో సీఆర్‌డీఏ తయారు చేయించింది. ఐఆర్‌ఆర్‌ను 75 మీటర్ల వెడల్పుతో మొత్తం 96.25 కిలోమీటర్ల పొడవున నిర్మించాలని డీపీఆర్‌ను రూపొందించటం జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం 3,556.17 ఎకరాల భూములు అవసరమని ప్రతిపాదించింది. అమరావతి రాజధానిలోని 27 ప్రధాన రహదారులన్నింటినీ అనుసంధానించేలా ఇన్నర్ రింగ్ రోడ్డుకు తుది డీపీఆర్‌ను ఇవ్వటం జరిగింది. స్టుప్ సంస్థ ఇచ్చిన డీపీఆర్ ప్రకారం.. ఐఆర్‌ఆర్‌ను రెండు దశల్లో చేపట్టేలా నిర్ణయించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఎన్టీఆర్ జిల్లాలో కేతనకొండ దగ్గర ప్రారంభమవుతుంది. కృష్ణా జిల్లాలో చోడవరం దగ్గర ముగుస్తుంది.
భూ సమీకరణ జరిగే ప్రాంతాలు?
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం మొత్తం 1,155.41 ఎకరాల భూములు అవసరమవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం పరిధిలో దాములూరులో 29.9 ఎకరాలు, ఇబ్రహీంపట్నంలో 7.17 ఎకరాలు, జూపూడిలో 0.23 ఎకరాలు, కేతనకొండలో 58.33 ఎకరాలు, కొండపల్లిలో 93.40 ఎకరాలు, కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో 100.65 ఎకరాలు, కొటికలపూడిలో 37.41 ఎకరాలు, నవీపోతవరంలో 30.33 ఎకరాలు, త్రిలోచనాపురంలో 20.15 ఎకరాలు, జమీ మాచవరంలో 3.31 ఎకరాలను సమీకరించనున్నారు. జీ కొండూరు మండలంలో కవులూరు గ్రామంలో 74.83 ఎకరాలు, వెలగలేరు గ్రామంలో 2.85 ఎకరాలు, విజయవాడ రూరల్ మండలంలో దోనె ఆత్కూరు గ్రామంలో 19.43 ఎకరాలు, కొత్తూరు గ్రామంలో 55.15 ఎకరాలు, నున్నలో 96.86 ఎకరాలు, పాతపాడులో 48.57 ఎకరాలు, తాడేపల్లిలో 16.25 ఎకరాలు, నిడమానూరులో 73.96 ఎకరాలను సమీకరించనున్నారు. కృష్ణా జిల్లా విషయానికి వస్తే గన్నవరం మండలం పరిధిలో రామచంద్రాపురంలో 5.25 ఎకరాలు, వెదురుపావులూరు గ్రామంలో 132.86 ఎకరాలు, సావారిగూడెంలో 18.71 ఎకరాలను సమీకరిస్తారు. పెనమలూరు మండలం చోడవరం గ్రామంలో 85.91 ఎకరాలు, గంగూరులో 5 ఎకరాలు, పెనమలూరులో 49.62 ఎకరాలు, పోరంకిలో 89.27 ఎకరాల చొప్పున సమీకరించనున్నారు.