వేగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:59 AM
గ్రామాల్లో పేదరికాన్ని రూపుమాపటం, కుటుంబాల ఆదాయం గణనీయంగా పెంచేందుకు కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటి దగ్గరే పని కల్పించటం కోసం ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూఎఫ్‌హెచ్) సర్వే చేపట్టింది. ప్రతి కుటుంబంలోని సభ్యుల విద్యార్హతలు, వాటి ఆధారంగా వారు చేయగలిగే పనుల గురించి వివరాలు సేకరిస్తోంది. ఇంటి దగ్గరే ఐటీ, ఐటీ యేతర పనులు చేసుకుంటూ ఆదాయాన్ని ఆర్జించేందుకు వీలుగా ఈ సర్వేను జరిపిస్తోంది.

- ఎన్టీఆర్ జిల్లాలో 11,88,000 మంది, కృష్ణాజిల్లాలో 9,03,730 మందికి ఉపాధే లక్ష్యం
- ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాల కల్పన
- ఎన్టీఆర్‌లో 31 శాతం, కృష్ణాలో 28 శాతం సర్వే పూర్తి
- పేదరికాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమం
గ్రామాల్లో పేదరికాన్ని రూపుమాపటం, కుటుంబాల ఆదాయం గణనీయంగా పెంచేందుకు కూటమి ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటి దగ్గరే పని కల్పించటం కోసం ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూఎఫ్‌హెచ్) సర్వే చేపట్టింది. ప్రతి కుటుంబంలోని సభ్యుల విద్యార్హతలు, వాటి ఆధారంగా వారు చేయగలిగే పనుల గురించి వివరాలు సేకరిస్తోంది. ఇంటి దగ్గరే ఐటీ, ఐటీ యేతర పనులు చేసుకుంటూ ఆదాయాన్ని ఆర్జించేందుకు వీలుగా ఈ సర్వేను జరిపిస్తోంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఉమ్మడి కృష్ణాజిల్లాలో వర్క్ ఫ్రమ్ హోమ్ (డబ్ల్యూఎఫ్‌హెచ్) సర్వే చురుగ్గా సాగుతోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మ్యాపింగ్ జరిగిన ప్రతి కుటుంబానికి ఫోన్లు చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేస్తున్నారు. వివరాలను అప్పటికప్పుడే ప్రభుత్వం ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌లో రిజిస్టర్ చేస్తున్నారు. ఆధార్ ఆధారిత ఫోన్ నంబర్లకు వచ్చిన ఓటీపీ ఆధారంగా రిజిస్ర్టేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. విద్యావంతులు, నిరక్ష్యరాస్యులు అనే రెండు కేటగిరీలుగా ఈ సర్వేను చేస్తున్నారు. విద్యావంతుల సర్వేలో ప్రస్తుతం మీరు పనిచేస్తున్నారా? ఐటీ, ఐటీయేతర సాఫ్ట్‌వేర్ ఆధారిత పనులు చేయటానికి మీకు ఆసక్తి ఉందా? దీనికి సంబంధించి శిక్షణ తీసుకోవటం మీకు ఇష్టమేనా ? మీకు వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవటానికి ఆసక్తి ఉందా ? మీ ఇంట్లో బ్రాడ్ బ్యాండ్ సదుపాయం ఉందా? ఉంటే దాని స్పీడ్ ఎంత ఉంది ? ఇంటి వద్దనే పని చేయటం కోసం తగిన స్పేస్ ఉందా? రూమ్ (గది) ఏరియా ఎంత? ఆ గదిని ఎంత మంది వినియోగించుకోవటానికి అవకాశం ఉంటుంది ? వంటి వివరాలను సేకరిస్తున్నారు.
లక్ష్యానికి అనుగుణంగా..
ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 5,30,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల్లో కనీసం 11,88,000 మందికి వర్క్‌ఫ్రమ్ హోమ్ కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. దీనికి అనుగుణంగా ఇప్పటి వరకు 3,68,800 మందికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నిర్వహించారు. నిర్దేశించుకున్న లక్ష్యంలో ఎన్టీఆర్ జిల్లాలో 31శాతం పూర్తయింది. కృష్ణాజిల్లాలో 4,14,000 కుటుంబాలు ఉండగా.. మొత్తం 9,03,730 మందికి వర్క్ ఫ్రం హోమ్ కల్పించాలన్నది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంగా ఉంది. ఇప్పటి వరకు 2,51,836 మందికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేను పూర్తి చేశారు. కృష్ణాజిల్లాలో 28 శాతం మేర వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పూర్తయ్యింది.
పనిచేసుకునే పద్ధతులపై ఆరా
వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఐటీ, ఐటీ అనుబంధ రంగాలకు సంబంధించిన జాబ్ వర్క్‌నే ఇస్తారు. దీని కోసం ముందస్తుగా శిక్షణ ఉంటుంది. శిక్షణ వద్దు అనుకున్న వారికి కూడా జాబ్ వర్క్ ఇవ్వటం జరుగుతుంది. ఈ జాబ్ వర్క్‌లో కూడా మూడు పద్ధతులు ఉన్నాయి. పూర్తిగా ఇంటి దగ్గరే పనిచేసుకోవచ్చు, ఒక రోజు ఆపీసులో, మరో రోజు ఇంటి దగ్గర పనిచేసుకోవచ్చు. పూర్తిగా ఆఫీసులో కూడా పనిచేసుకోవచ్చు. వీటికి కూడా వర్క్ ఫ్రం హోమ్ డేటా ఎంట్రీలోనే వివరాలు అడుగుతున్నారు.
నెలాఖరుకు సర్వే పూర్తి!
ఈ నెలాఖరు నాటికి వర్క్ ఫ్రం హోమ్ (డబ్ల్యూఎఫ్‌హెచ్) సర్వేను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో ఈ నెల 20వ తేదీ నాటికి సర్వేను పూర్తి చేసేందుకు లక్ష్యం నిర్దేశించుకున్నారు. కృష్ణాజిల్లా కంటే ఎన్టీఆర్ జిల్లాలో సర్వే ఇంకా పురోగతిలో ఉంది. జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి అధికారిణి జ్యోతి సర్వేను పరుగులు పెట్టిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా - గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లో ముందుగా సర్వే జరగలేదు. రెండో దశలో ప్రారంభించాల్సి వచ్చింది. అయినప్పటికీ చాలా వేగంగానే సర్వే జరుగుతోంది.