Paddy Procurement: ధాన్యం అమ్మడానికి ఎన్ని తిప్పలో
ABN , Publish Date - Dec 07 , 2025 | 04:55 AM
ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు మధ్య పొంతన ఉండటం లేదు. ధాన్యం సేకరించే పౌరసరఫరాల సంస్థ అధికారుల మాత్రం తేమశాతం...
రైతులందరికీ అందని గోనె సంచులు
అందుబాటులో లేని రవాణా వాహనాలు
ఓ వైపు వాతావరణ సమస్యలు
మరోవైపు తేమతో ఇబ్బందులు
సతమతమవుతున్న అన్నదాతలు
(అమరావతి- ఆంధ్రజ్యోతి)
ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు మధ్య పొంతన ఉండటం లేదు. ధాన్యం సేకరించే పౌరసరఫరాల సంస్థ అధికారుల మాత్రం తేమశాతం సాకుతో రైతులను బెదర గొడుతున్నారు. సకాలంలో తగినన్ని గోనె సంచులు అందించకుండా, ధాన్యం రవాణా వాహనాలు అందుబాటులో ఉంచకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. గత వారం రోజులుగా దిత్వా తుఫాన్ హెచ్చరికలతో నూర్చి, ఆరబోసిన ధాన్యం తడవకుండా కొందరు రైతులు టార్పాలిన్లు కప్పి, నానా తిప్పలు పడ్డారు. తుఫాన్ బలహీనపడిందనే సమాచారంతో మరికొందరు వరి కోతలకు ఉపక్రమించారు. అయితే, తడిగా ఉంటే కొనలేమని, కోతలకు మరికొన్ని ఆగాలని, బాగా ఆరిన ధాన్యాన్నే తేవాలని క్షేత్రస్థాయి సిబ్బంది వారికి తేల్చి చెబుతున్నారు. అదేమంటే తుఫాన్ పోయినా వాతావరణం మారి, వానజల్లులు పడుతున్నాయని, ధాన్యంలో తేమశాతం తగ్గకపోతే కొనుగోలు చేయలేమని తేల్చి చెబుతున్నారు. దీనివల్ల రెండో పంట వేయడానికి ఆలస్యమవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వాతావరణంలోనే తేమ అధికంగా ఉండటంతో ధాన్యం ఆరబోసినా అది పూర్తిగా పోవడం లేదు. మరోవైపు ధాన్యం కాటాలు వేసి 2-3 రోజులైనా...లోడు ఎత్తడానికి లారీలు లేవని రైతుసేవా కేంద్రాల సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వం ధాన్యం రవాణాకు వాహనాలు ఏర్పాటు చేస్తోంది కదా అని అడిగితే.. రోజూ రేపొస్తాయి.. మాపొస్తాయంటూ, లారీలొచ్చే దాకా ఆగలేకపోతే.. మీరే బండ్లు తెచ్చుకోండి.. అంటున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. బండ్లు తెచ్చుకుంటే కిరాయి తామే సొంతంగా కట్టుకోవాల్సి వస్తుందంటున్నారు. ఈ-క్రాప్ నియమాలు, తేమ శాతం నిబంధనలను అధిగమించి పౌర సరఫరాల సంస్థకు ధాన్యం అమ్మడానికి నానా ఇబ్బందులు పడే కన్నా.. నేరుగా మిల్లర్లకు అమ్మితే.. బ్రోకర్ల ద్వారా త్వరగా పని అయిపోతుందనిపిస్తోందని కొందరు రైతులు చెబుతున్నారు. వాస్తవంగా ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాలకు సొమ్ము జమ అవుతుండటంతో అన్నదాతలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని భావిస్తున్నారు.
అయితే, క్షేత్రస్థాయి సమస్యలు ఇబ్బందికరంగా ఉంటున్నాయని అంటున్నారు. నాణ్యమైన ధాన్యానికే మద్దతు ఇస్తామని మిల్లర్లు తేల్చిచెబుతున్నారు. తేమ,తాలు, ఇతర వ్యర్థ్యాలు ఉంటే.. ధర తగ్గించి వారు అడుగుతుండటంతో ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ధాన్యం రైతుల పరిస్థితి తయారైంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం ఓ కారణం. అంతకంటే కూడా సకాలంలో గోనె సంచులు, అందుబాటులో రవాణా వాహనాలు ఉంచకపోగా, క్షేత్రస్థాయి సిబ్బంది రైతులతో సున్నితంగా వ్యవహరించకపోవడం, ఉన్నతాధికారులు సకాలంలో స్పందించకపోవడమే ప్రధానంగా సమస్య అయినట్టు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలుపై ఉన్నత స్థాయిలో సమీక్ష జరిపి, క్షేత్రస్థాయి సమస్యలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
నేడు మంగళగిరిలో మార్కెట్ కమిటీ చైర్మన్ల రాష్ట్ర సదస్సు
అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ల రాష్ట్ర సదస్సు ఆదివారం మంగళగిరిలోని ఆర్‌ఆర్‌ఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించనున్నట్టు ఏఎంసీ చైర్మన్ల కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సదస్సుకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హాజరుకానున్నారు. ఏఎంసీల ప్రాధాన్యాన్ని మరింత విస్తరించేందుకు తీసుకోవాల్సిన భవిష్యత్ కార్యాచరణపై సదస్సులో చర్చించనున్నారు. కాగా.. మార్కెటింగ్ యార్డుల వ్యవస్థపై ఏఎంసీ చైర్మన్లకు అవగాహన కార్యక్రమాన్ని ప్రాంతీయ స్థాయిలో నిర్వహించాలని మార్కెటింగ్ నిర్ణయించింది. సోమవారం గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో విజయవాడ ప్రాంతీయ ఏఎంసీ చైర్మన్ల అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆర్‌జేడీఎం కె.శ్రీనివాసరావు తెలిపారు.