Farmers receive Annadata Sukhibhava: ఆ రైతులకూ అన్నదాత నిధులు
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:42 AM
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి పొందలేకపోయిన రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం రూ.71.38 కోట్లు విడుదల చేశారు.
ఎన్నికల కోడ్‌తో ఆగిన సొమ్ము విడుదల
1,42,765 ఖాతాలకు రూ.71.38 కోట్లు జమ
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకం లబ్ధి పొందలేకపోయిన రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం రూ.71.38 కోట్లు విడుదల చేశారు. ఈ పథకం మొదటి విడత కింద ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున 1,04,107 మంది రైతులతో పాటు ఈ-కేవైసీ, ఎన్పీసీఐ క్రమబద్ధీకరించుకున్న మరో 38,658 మంది కలిపి మొత్తం 1,42,765 మంది ఖాతాలకు మంత్రి నిధులు జమ చేశారు. ఈ నెల 2న ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తూర్పు వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు ‘అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల చేశారు. అప్పట్లో కొన్నిచోట్ల స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఆ ప్రాంతాలకు మినహా రాష్ట్రవ్యాప్తంగా 44.75 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.5వేలు చొప్పున జమ చేశారు. తాజాగా ఎన్నికల కోడ్ ముగియడంతో స్థానిక ఎన్నికలు జరిగిన ప్రాంతాల రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పుడు సొమ్ము చెల్లింపులు జరిపారు. కాగా, ఎన్పీసీఐలో మ్యాపింగ్ కాని, వాడుకలో లేని 1,21,422 ఖాతాల్లో 38,658 మంది మాత్రమే క్రమబద్ధీకరణ చేయించుకున్నారని, మిగిలినవారు కూడా మ్యాపింగ్ అయ్యేలా క్షేత్రస్థాయి అధికారులు దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు ఆదేశించారు.