Share News

Visakhapatnam: క్లిక్‌ దూరంలో రైతుబజార్లు

ABN , Publish Date - Dec 07 , 2025 | 04:26 AM

రైతుబజారు నుంచి తాజా కూరగాయలు ఆన్‌ లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశం ఉంటే.. అక్కడి రేట్లకే ఇంటికే తెచ్చి ఇస్తే.. ఎంత బావుంటుందో కదా.! ఈ ఆలోచనతోనే అటు రైతులకు, ఇటు వినియోగదారులకు...

Visakhapatnam: క్లిక్‌ దూరంలో రైతుబజార్లు

  • ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే నిమిషాల్లోనే ఇంటికి కూరగాయలు

  • రైతుబజార్‌ ధరలకే డోర్‌ డెలివరీ

  • విశాఖలో పైలట్‌ ప్రాజెక్టు

  • ప్రస్తుతం డిజిరైతుబజార్‌ఏపీ.కామ్‌ వెబ్‌సైట్‌ ద్వారా బుకింగ్‌

  • త్వరలో అందుబాటులోకి యాప్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రైతుబజారు నుంచి తాజా కూరగాయలు ఆన్‌ లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశం ఉంటే.. అక్కడి రేట్లకే ఇంటికే తెచ్చి ఇస్తే.. ఎంత బావుంటుందో కదా.! ఈ ఆలోచనతోనే అటు రైతులకు, ఇటు వినియోగదారులకు కూడా లాభం చేకూర్చ డానికి ప్రభుత్వ సహకారంతో ‘మాచింట్‌ సొల్యూషన్స్‌’ అనే సంస్థ ముందుకొచ్చింది. రైతు బజార్లను ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారంపైకి తీసుకువచ్చింది. బ్లింకిట్‌, బిగ్‌ బాస్కెట్‌ వంటి సంస్థలు ఎలాగైతే ఆన్‌లైన్‌లో కూరగాయలు, పండ్లను ఆర్డర్‌ తీసుకొని డోర్‌ డెలివరీ చేస్తున్నాయో అదే విధానంలో రైతుబజార్ల నుంచి తాజా కూరగాయాలు, పండ్లు, ఇతర నిత్యవసరాలు సరఫరా చేయడానికి మాచింట్‌ సొల్యూషన్స్‌ https://digirythubazaarap.com/ అనే వెబ్‌సైట్‌ రూపొం దించింది. ఆ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే ఆరోజు రైతుబజార్లలో అందుబాటులో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు, వాటి ధరలు కనిపిస్తాయి. నచ్చినవి ఆర్డర్‌ చేసుకున్న తర్వాత.. నిమిషాల వ్యవధిలోనే వాటిని మాచింట్‌ సొల్యూషన్స్‌ సంస్థ డోర్‌ డెలివరీ చేస్తుంది. వీటికి ఆన్‌లైన్‌లోనే డిజిటల్‌ చెల్లింపులు చేసుకోవచ్చు. విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతుబజారులో దీనిని పైలట్‌ ప్రాజెక్టు కింద వారం రోజుల క్రితం ప్రారంభించారు. రైతుబజారుకు 4 నుంచి 5 కి.మీ. దూరంలో ఉన్న వారి నుంచి ఆర్డర్లు తీసుకొని, డెలివరీ చార్జీలు ఏమీ తీసుకోకుండానే రైతుబజార్‌ ధరలకే సరుకులు, కూరగాయలు అందిస్తున్నారు. ఇది విజయవంతమైతే ఈ సంస్థతో ఎంవోయూ చేసుకుని మిగిలిన బజార్లకు కూడా ఈ సేవలు విస్తరించాలని వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖాధికారులు యోచిస్తున్నారు. డిజిరైత బజార్‌ యాప్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. త్వరలోనే అది కూడా అందుబాటులోకి రానుంది.


ప్రచారం కల్పించాలి

డిజిరైతుబజారుఏపీ.కామ్‌లో ఎవరైనా ఆర్డర్‌ బుక్‌ చేయగానే మాచింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ సిబ్బంది నేరుగా రైతుబజార్‌కు వచ్చి వాటిని రైతుల వద్దనే కొని డబ్బులు చెల్లించి తీసుకువెళుతున్నారు. ప్రస్తుతం రోజుకు పది నుంచి పదిహేను వరకు ఆర్డర్లు వస్తున్నాయి. దీనికి ఇంకా విస్తృత ప్రచారం కల్పించి, యాప్‌ను పూర్తిగా అందుబాటులోకి తీసుకువస్తే బ్లింకిట్‌, బిగ్‌బాస్కెట్‌లా విజయవంతం అవుతుంది.

- వరహాలు, రైతుబజారు ఎస్టేట్‌ అధికారి

Updated Date - Dec 07 , 2025 | 04:27 AM