Share News

Sri Sathya Sai District: పంట కొని.. డబ్బులు ఎగేసి

ABN , Publish Date - Aug 09 , 2025 | 04:21 AM

ఆహార ధాన్యాల వ్యాపారం పేరుతో చిన్న, సన్నకారు రైతుల నుంచి పెద్దఎత్తున పంట ఉత్పత్తులు సేకరించి..

 Sri Sathya Sai District: పంట కొని.. డబ్బులు ఎగేసి

  • వివిధ వ్యాపారాల పేరిట 200 కోట్ల మేర మోసం

  • శ్రీసత్యసాయి జిల్లాలో దాల్‌మిల్‌ సూరి బ్రదర్స్‌ ఆగడాలు

  • ఒక్కొక్కరుగా వచ్చి ఫిర్యాదు చేస్తున్న బాధితులు

పుట్టపర్తి రూరల్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఆహార ధాన్యాల వ్యాపారం పేరుతో చిన్న, సన్నకారు రైతుల నుంచి పెద్దఎత్తున పంట ఉత్పత్తులు సేకరించి.. ఆపై వారికి డబ్బులు చెల్లించకుండా శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన అన్నదమ్ములు దాల్‌మిల్‌ సూరి, పాండు మోసం చేస్తున్నారని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. సత్యసాయి జిల్లాలోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ వ్యాపారాల పేరిట వారు రూ.200 కోట్ల మేర మోసం చేశారని అన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సూరి బ్రదర్స్‌ ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయాలని కోరారు. పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రత్న వివరాలు వెల్లడించారు. కొత్తచెరువు మండల కేంద్రానికి చెందిన అన్నదమ్ములు దాల్‌మిల్‌ సూరి అలియాస్‌ మొరంశెట్టి సురేశ్‌, పాండు చేసిన ఆర్థిక మోసాలపై భాదితులు ఒక్కొక్కరుగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారన్నారు. మోసాలు, ఆర్థిక నేరాలకు పాల్పడటంతో సూరిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశామన్నారు. ఆయనపై ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లో 36 కేసులు నమోదయ్యాయని, వాటిలో ఈడీ కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. సూరి బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ఽధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. దాల్‌మిల్‌ సూరిపై ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు కూడా జారీ చేశామన్నారు. అన్నదమ్ముల ఆర్థిక నేరాలు, ఈడీ కేసుల వివరాలను బ్యాంకు అధికారులకిచ్చి వారి ఖాతాలను ఫ్రీజ్‌ చేయాలని కోరామని ఎస్పీ తెలిపారు.

Updated Date - Aug 09 , 2025 | 04:23 AM