Agriculture Department: పంట నష్టం జాబితాలపై అభ్యంతరాలు చెప్పొచ్చు
ABN , Publish Date - Nov 02 , 2025 | 05:16 AM
మొంథా తుఫాన్‌తో రాష్ట్రవ్యాప్తంగా 1.38 లక్షల హెక్టార్లలో పంట ముంపునకు గురైనట్లు ప్రాథమిక అంచనా ఉండగా, శనివారం సాయంత్రం 6 గంటల వరకు 69 శాతం పంట నష్టం వివరాలు...
ఇంకా నష్టం అంచనాలు నమోదు చేస్తాం: వ్యవసాయశాఖ
అమరావతి, నవంబరు1(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌తో రాష్ట్రవ్యాప్తంగా 1.38 లక్షల హెక్టార్లలో పంట ముంపునకు గురైనట్లు ప్రాథమిక అంచనా ఉండగా, శనివారం సాయంత్రం 6 గంటల వరకు 69 శాతం పంట నష్టం వివరాలు నమోదు చేసినట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది. 14 జిల్లాల్లో సామాజిక తనిఖీ పూర్తయ్యిందని వెల్లడించింది. 24 జిల్లాల్లో 391 మండలాల్లోని 3,553 గ్రామాల్లో 95,583 హెక్టార్లలో పంట నష్టం నమోదు పూర్తి చేసినట్లు తెలిపింది. పంట నష్టం అంచనా గడువు ముగియడంతో ‘రైతుల్లో గడువు గుబులు’ శీర్షికతో శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై వ్యవసాయశాఖ వివరణ ఇచ్చింది. రైతులు ఆందోళన చెందొద్దని, పంట నష్టం నమోదులో లేని వారు, రైతుసేవా కేంద్రంలో సంప్రదించి, వివరాలు అందించాలని కోరింది. సామాజిక తనిఖీలో భాగంగా జాబితాలోని రైతులు పంట వివరాలపై ఏవైనా అభ్యంతరాలు, విజ్ఞప్తులున్నా తెలియజేయవచ్చని సూచించింది. ఇంకా నీరు తొలగించాల్సిన ప్రాంతాల్లోనూ నష్టం అంచనా వేస్తామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ ‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్‌లో చెప్పారు.