Share News

రైతు సంక్షేమానికే ప్రాధాన్యం: సీఎం

ABN , Publish Date - Sep 23 , 2025 | 04:39 AM

లాభసాటి వ్యవసాయం, రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. తాను ఐటీ గురించి మాట్లాడినా..

రైతు సంక్షేమానికే ప్రాధాన్యం: సీఎం

  • ఐటీ గురించి మాట్లాడినా నా ప్రతి నిర్ణయం వారి కోసమే

  • కష్ట సమయాల్లో అండగా ఉంటున్నాం.. ఉచితంగా సూక్ష్మపోషకాలు,

  • భూసార పరీక్షలు.. యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు రూ.800 ప్రోత్సాహకం

  • నెలలో ఒకరోజు ఎమ్మెల్యేల పొలం బాట.. వ్యవసాయంపై చర్చలో చంద్రబాబు

‘నేను ఐటీ గురించే మాట్లాడతానని అందరూ అనుకుంటారు. కానీ నేనూ రైతు కుటుంబం నుంచే వచ్చాను. పాలనలో నా శ్రద్ధ అంతా రాజకీయాల కన్నా.. వ్యవసాయ రంగంపైనే ఉంటుంది. రైతు సేవను ఒక పవిత్ర కార్యక్రమంగా భావిస్తున్నాం. రాష్ట్ర రైతాంగానికి ఎన్డీయే ప్రభుత్వం అండగా ఉంటుంది.’

- సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): లాభసాటి వ్యవసాయం, రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. తాను ఐటీ గురించి మాట్లాడినా.. తాను తీసుకున్న ప్రతి నిర్ణయమూ రైతులకు ఉపయోగపడేలా చేశానన్నారు. రైతులు యూరియా వాడకం తగ్గించాలని, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని సూచించారు. ప్రతి ఎమ్మెల్యే నెలలో ఒక్క రోజైనా పొలం బాట పట్టాలని నిర్దేశించారు. అక్టోబరు నుంచి ప్రతి నెలా అధికారులు, ప్రజాప్రతినిధులు రైతుల దగ్గరకు వెళ్లి, వారి సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేలా యాక్షన్‌ ప్లాన్‌ ప్రకటిస్తామని వెల్లడించారు. సోమవారం శాసనసభలో వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తూ మాట్లాడారు. రైతు సంక్షేమానికి, లాభసాటి వ్యవసాయానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహిస్తామని, సూక్ష్మపోషకాలను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల క్యాన్సర్‌ వస్తున్నందున రైతులు ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించాలని కోరారు. ‘రేషన్‌, పెన్షన్ల మాదిరిగా పోర్టబులిటీతో వచ్చే సీజన్‌ నుంచి ఆధార్‌ అనుసంధానంతో ఎంత ఎరువులు కావాలంటే అంత ఇస్తాం. పొలం దగ్గరకే ఎరువులు పంపుతాం. కానీ యూరియా వాడకం తగ్గించాలి. తగ్గించిన రైతులకు ఒక్కో బస్తాపై కేంద్రం పీఎం ప్రణమ్‌ పథకం కింద ఇచ్చే రూ.800 ప్రోత్సాహకాన్ని రైతులకే రాయితీగా ఇస్తాం’ అని ప్రకటించారు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని సీఎం స్పష్టం చేశారు.


ఎగుమతి అవకాశమున్న పంటలతో ‘గిట్టుబాటు’

‘ప్రతి ఎమ్మెల్యే నెలకో రోజు పొలం దగ్గరకు వెళ్లి రైతులతో మాట్లాడాలి. వచ్చే నెల నుంచి రైతుల దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టి, వారి సమస్యలు విని పరిష్కరించాలి. మారిన ప్రజల అలవాట్లకు అనుగుణంగా పంటల సాగు విధానం ఉండాలి’ అని పేర్కొన్నారు. డిమాండ్‌ ఉన్న పంటలకే మార్కెట్‌ ఉంటుందన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యా లు, ఆయిల్‌పామ్‌ వంటి నూనె గింజల పంటలపైనా దృష్టి సారించాలని సూచించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దెబ్బకి ఆక్వా రంగం విలవిలలాడుతోందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రత్యామ్నాయాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అయినా దేశీయ వినియోగం పెరగాలన్నారు. గతంలో కోడిగుడ్లను ప్రోత్సహించినట్లే.. ఇప్పుడు రొయ్యల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. ఆక్వా రైతులకు సాయపడాలని బ్యాంకర్లతోనూ మాట్లాడుతున్నామని తెలిపారు. ఆక్వా ఉత్పుత్తుల కోసం కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 35 శాతం జీఎస్డీపీ వ్యవసాయ రంగంపైనే వస్తోందని సీఎం చెప్పారు. ‘ ఏపీని భవిష్యత్‌లో హార్టికల్చర్‌ హబ్‌గా మారుస్తాం. ఉద్యాన పంటల్ని 2029 నాటికి 25 లక్షల హెక్టార్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వెనుకబడిన జిల్లాల్లోనూ ఉద్యాన సాగు పెద్ద గేమ్‌ చేంజర్‌ అవుతోంది’ అని సీఎం చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టామని, కృత్రిమ మేథ ద్వారా మరింత సాంకేతికతను అందిస్తామని తెలిపారు.


రైతులకు అన్ని విధాలుగా అండగా..

ఈ ఏడాది జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయని సీఎం అన్నారు. సమర్థ నీటి నిర్వహణ ఫలితంగానే ఈ అవకాశం ఏర్పడిందన్నారు. నెల్లూరులో ఎప్పుడూ ఒకే పంట వేస్తారని, ఈసారి రెండు పంటలు వేశారని చెప్పారు. రైతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, కొందరు అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ కింద ఒకేసారి రూ.7 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో వేశాం. ఉల్లి ధర పడిపోతే హెక్టారుకు రూ.50 వేలు ప్రకటించాం. టమాటో ధర పడిపోతే 1,267 టన్నులు కొన్నాం. మామిడి రైతులకు రూ.194 కోట్లు చెల్లించాం. ఉద్యాన రైతులకు 90 శాతం రాయితీతో సూక్ష్మసేద్య పరికరాలు అందిస్తున్నాం’ అని చెప్పారు.

Updated Date - Sep 23 , 2025 | 04:40 AM