Minister Atchannaidu: రైతు సంక్షేమంతోనే దేశాభివృద్ధి
ABN , Publish Date - Oct 12 , 2025 | 05:31 AM
రైతు సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది అని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్ రైతులకు మేలు చేసే కార్యక్రమాల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని...
పప్పుధాన్యాల సాగుకు ప్రోత్సాహం
పంట ఉత్పత్తుల్లో నాణ్యత పెంచాలి: అచ్చెన్న
గుంటూరు సిటీ, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది అని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్ రైతులకు మేలు చేసే కార్యక్రమాల అమలుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గుంటూరు సమీప లాంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో న్యూఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ప్రారంభించిన పీఎం ధన్-ధాన్య కృషి యోజన, పప్పు ధాన్య ఆత్మ నిర్భరత మిషన్ ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పీఎం ధన్ ధాన్య యోజన రైతుల ఆర్థిక పరిపుష్టికి దారితీస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా రూ.42,000 కోట్ల విలువైన వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక తదితర అనుబంధ రంగాలకు చెందిన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభిస్తున్నారని తెలిపారు. పీఎం ధన్-ధాన్య కృషి యోజనలో రాష్ట్రంలో ఎంపికైన అల్లూరి, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో వచ్చే ఆరేళ్లలో.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తుల పెంపు, నాణ్యతపై దృష్టి, పంట నష్టాల తగ్గింపు లక్ష్యంగా ప్రోత్సాహం అందిస్తారని తెలిపారు. ప్రజల ఆహార అలవాట్లు మారిన నేపథ్యంలో ప్రోటీన్‌తో కూడిన పప్పుధాన్యాలను ప్రజలకు అందచేయడానికి.. వాటి సాగును ప్రోత్సహిస్తారని చెప్పారు. రైతులు సాగుచేసిన పప్పు ధాన్యాలను చివరి గింజ వరకు మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ఒకే విధమైన పంటలను సాగు చేయకుండా ప్రకృతి సాగు పద్ధతులను అవలంబించాలని మంత్రి సూచించారు. విదేశీ ఎగుమతులకు వీలుగా పంట ఉత్పత్తుల్లో నాణ్యతను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, వ్యవసాయ శాఖ ఎక్స్‌అఫిషియో సెక్రటరీ బి.రాజశేఖర్, ఉప కులపతి శారద జయలక్ష్మిదేవి, విశ్వ విద్యాలయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.