Elephant Attack: గజ దాడిలో రైతు దుర్మరణం
ABN , Publish Date - Nov 14 , 2025 | 06:16 AM
చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు ఓ రైతు ప్రాణాలు తీసింది. కుప్పం మండలం ఉర్లఓబనపల్లె పంచాయతీ కూర్మానపల్లె సమీపంలో రైతు కృష్ణప్ప రాగి, జొన్న పంటలను సాగు చేస్తున్నాడు.
పరామర్శించిన ఎమ్మెల్సీ శ్రీకాంత్, డీఎఫ్ఓ
తక్షణ సాయంగా 5 లక్షల చెక్కు అందజేత
అమరావతి, కుప్పం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు ఓ రైతు ప్రాణాలు తీసింది. కుప్పం మండలం ఉర్లఓబనపల్లె పంచాయతీ కూర్మానపల్లె సమీపంలో రైతు కృష్ణప్ప రాగి, జొన్న పంటలను సాగు చేస్తున్నాడు. బుధవారం రాత్రి పొలం వద్ద కాపలా ఉన్నాడు. అటుగా వచ్చిన ఏనుగు కృష్ణప్ప ఉన్న గుడిసెను తోసి, తొక్కిపడేయడంతో రైతు దుర్మరణం పాలయ్యాడు. ఉదయం కృష్ణప్ప ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లా రు. కృష్ణప్ప మృతదేహాన్ని చూసి కన్నీళ్లపర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చిత్తూరు డీఎ్‌ఫఓ శ్రీనివాసులు మృతుడి భార్య, పిల్లలను పరామర్శించారు. తక్షణ సాయంగా ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కును అందించారు. మరో రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు.
ఏనుగుల కదలికలపై ముందస్తు హెచ్చరికలు పెంచాలి: పవన్
అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉన్న గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నమైతే ముందస్తు హెచ్చరికలు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. కుప్పం మండలంలో ఏనుగు దాడిలో మృతి చెందిన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్... ఘటనపై గురువారం అధికారులతో చర్చించారు. పరిహారాన్ని వీలైనంత త్వరగా అందించాలని ఆదేశించారు. ‘ముందస్తు హెచ్చరికలను మరింత విస్తృతం చేయాలి. గ్రామాల వారీగా రైతులతో సోషల్ మీడియా గ్రూపులు ఏర్పాటు చేయండి. టెక్ట్స్ మెసేజ్‌లతో పాటు వాయిస్ మెసేజ్‌లు కూడా పంపితే సమాచారం త్వరగా చేరుతుంది’ అని సూచించారు.