Share News

Land lottery: రూ.కోటి పొలానికి లాటరీ!

ABN , Publish Date - Dec 25 , 2025 | 04:27 AM

సాధారణంగా ఎవరైనా భూములు అమ్ముకోవాలంటే ఆ విషయాన్ని నలుగురికీ చెబుతారు. కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన వారితో బేరసారాలాడి తమకు నచ్చిన ధరకు విక్రయిస్తారు.

Land lottery: రూ.కోటి పొలానికి లాటరీ!

  • ఒక్కోటీ రూ.500 చొప్పున టోకెన్ల అమ్మకం

  • వేలంవెర్రిగా కొనుగోలు చేసిన ఔత్సాహికులు

పెనుగంచిప్రోలు రూరల్‌, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): సాధారణంగా ఎవరైనా భూములు అమ్ముకోవాలంటే ఆ విషయాన్ని నలుగురికీ చెబుతారు. కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన వారితో బేరసారాలాడి తమకు నచ్చిన ధరకు విక్రయిస్తారు. కానీ ఎన్టీఆర్‌ జిల్లా కు చెందిన ఓ రైతు మాత్రం తన పొలాన్ని అమ్మడానికి లాటరీ పద్ధతిని ఎంచుకొని టికెట్లు విక్రయించారు. పెనుగంచిప్రోలుకు చెందిన రైతు దేవరశెట్టి రాంబాబుకు 95 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. ఇక్కడ ఎకరం రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకూ పలుకుతోంది. తన అవసరాల రీత్యా ఆ భూమిని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. లాటరీ టోకెన్లు విక్రయించి డ్రా తీసి గెలుపొందిన వారికి రిజిస్ర్టేషన్‌ చేసేలా ప్రణాళిక వేసుకున్నారు. అనుకున్నదే తడవుగా సోషల్‌ మీడియా యాడ్స్‌ చేసేవారిని రంగంలోకి దించి తిరుపతమ్మ ఆలయం నుంచి పొలం వరకు రహదారులను, పొలాన్ని డ్రోన్‌లతో అందంగా వీడియో తీయించారు. దానికి యాంకర్‌తో వాయిస్‌ ఓవర్‌ చెప్పించి, ప్రోమో రూపొందించారు. ఆ ప్రోమోలను సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌, వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ చేశారు.

ఒక టోకెన్‌ రూ. 500

ఒక్కో టోకెన్‌ ధర రూ.500గా నిర్ణయించారు. మొత్తం 30 వేల టోకెన్లు ఆన్‌లైన్‌ ద్వారా విక్రయాలకు పెట్టారు. దీంతో పాటు 500 మంది ఏజెంట్లను ఏర్పాటు చేశారు. టోకెన్‌ విక్రయించిన ఏజెంట్‌కు రూ.100 కమీషన్‌ ఇచ్చారు. పెద్దమొత్తంలో విక్రయించిన వారికి ప్రత్యేక రాయితీలు కూడా ప్రకటించారు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో 3,800 టోకెన్లు విక్రయించారు. సంక్రాంతి రోజున డ్రా తీయడానికి సన్నద్ధమయ్యారు. ఈలోగా పోలీసులు రంగప్రవేశం చేసి టోకెన్ల విక్రయాలు ఆపేయాలని స్పష్టం చేయడంతో ఇప్పటి వరకు వాటిని కొనుగోలు చేసినవారికి నగదు వాపసు చేస్తున్నారు.

Updated Date - Dec 25 , 2025 | 04:27 AM