Farmers Grievance Meeting: కూల్‌గా మాట్లాడి.. అంతలోనే కుప్పకూలి
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:03 AM
అమరావతిలో ఎన్-8 రోడ్డు కింద ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న రైతులతో జరిగిన సమావేశంలో ఆ రైతు కూడా పాల్గొని మాట్లాడారు.
రాజధాని రైతుల భేటీలో అపశ్రుతి
ఎన్-8 రోడ్డు కింద స్థలాలు, ఇళ్లు కోల్పోతున్నవారితో భేటీకి రాములు
మాట్లాడి కూర్చుంటుండగా గుండెపోటు
మంత్రి కాన్వాయ్ కారులో ఆస్పత్రికి
అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారణ
తుళ్లూరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : అమరావతిలో ఎన్-8 రోడ్డు కింద ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న రైతులతో జరిగిన సమావేశంలో ఆ రైతు కూడా పాల్గొని మాట్లాడారు. చాలా కూల్‌గా మాట్లాడి.. ఆ వెంటనే కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మరణించారు. ఈ ఘటన మందడం రైతుల సమావేశంలో చోటు చేసుకుంది. ల్యాండ్ ఫూలింగ్ యూనిట్ కార్యాలయంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, మంత్రి నారాయణ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో దొండపాటి రామారావు (రాములు)(75) పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతుండగా, దగ్గరకు వచ్చి సీడ్ రోడ్డు పక్కన తనకు స్థలం కేటాయించాలని రాములు కోరారు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వెనుదిరిగి తన కుర్చీలో కూర్చునే క్రమంలో రాములు కింద పడిపోయారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని తెలుసుకొని మంత్రి కాన్వాయ్ కారులో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాములు మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. భూసమీకరణలో భాగంగా రాములు ఐదు ఎకరాల భూమిని ఇచ్చారు. ఎన్-8 రోడ్డు కింద ఇళ్లు కోల్పోతున్న వారి జాబితాలో ఆయన ఇల్లు కూడా ఉంది. ఇదే విషయంపై వారం కిందట ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ నిర్వహించిన సమావేశంలో కూడా రాములు పాల్గొన్నారు.