Share News

Family Tragedy: కబళించిన మృత్యువు

ABN , Publish Date - Nov 30 , 2025 | 05:39 AM

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి బయలుదేరిన ఓ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.

Family Tragedy: కబళించిన మృత్యువు

  • రెండు కార్లు ఢీకొని ఐదుగురి దుర్మరణం

  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

  • మంత్రాలయం దర్శనానికి వెళ్తుండగా దారుణం

కర్నూలు/ఎమ్మిగనూరు/ఆదోని రూరల్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి బయలుదేరిన ఓ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్లు గ్రామం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యుఒడికి చేరారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులంతా కర్ణాటకలోని ఓలార్‌ జిల్లా బంగారుపేట తాలుకా చిక్కహోసళ్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు... బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పని చేస్తున్న ఎన్‌.సతీశ్‌, మీనాక్షి దంపతులకు మూడేళ్ల కుమారుడు రుత్విక్‌ ఉన్నాడు. ఈ నెల 27న వీరి పెళ్లి రోజుకావడంతో మామగారైన వెంకటేశప్ప స్వగ్రామం చిక్కహోసళ్లికి వచ్చారు. అక్కడినుంచి మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి శుక్రవారం రాత్రి బయలుదేరారు. కోటేకల్లు గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఎన్‌.సతీశ్‌ (34), మీనాక్షి (32), వారి కుమారుడు రుత్విక్‌ (3), మీనాక్షి మేనల్లుడు (సోదరుడి కుమారుడు) బన్నిత్‌గౌడ్‌ (5), ఆమె తండ్రి వెంకటేశప్ప(76) అక్కడికక్కడే మృతిచెందారు. వెంకటేశప్ప భార్య గంగమ్మ, కారు డ్రైవింగ్‌ చేస్తున్న చేతన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆదోని ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. కాగా, వాహనం నడుపుతున్న చేతన్‌ నిద్రమత్తులో మలుపులో రాంగ్‌ రూట్‌లో వెళ్లి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఎయిర్‌ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో చేతన్‌తో పాటు వీరు ఢీకొన్న కారులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎమ్మిగనూరు రూరల్‌ సీఐ చిరంజీవి తెలిపారు.


సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక వాసులు ఐదురుగు దర్మరణం చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్‌ ఏ.సిరి, డీఐజీ కోయ ప్రవీణ్‌ను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా, మంత్రి టీజీ భరత్‌ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రులు లోకేశ్‌, రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, అచ్చెన్నాయుడు, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ప్రమాదంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Updated Date - Nov 30 , 2025 | 05:42 AM