Rare Disease: పేదింటి చిన్నారికి అరుదైన వ్యాధి
ABN , Publish Date - Oct 26 , 2025 | 05:26 AM
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కేశవాపురం గ్రామానికి చెందిన బి.ఆంజనేయులు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు...
వైద్యం కోసం రూ.20 లక్షలకు పైగా అప్పు
పూర్తి కాని చికిత్స.. దాతల సాయానికి తల్లిదండ్రుల వినతి
గార్లదిన్నె, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కేశవాపురం గ్రామానికి చెందిన బి.ఆంజనేయులు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో చిన్నారి అక్షయ గ్రేస్ (12) జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోంది. ఏడో తరగతి చదువుతున్న ఈ బాలిక మూడేళ్ల కిత్రం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు, ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతోందని గుర్తించారు. జన్యుపరమైన సమస్య కారణంగా ప్రతి ఎముక కీళ్ల వద్ద గుజ్జు బలహీనంగా మారుతోందని నిర్ధారించారు. తల్లిదండ్రులు వైద్యం కోసం ఆమెను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకూ రూ.20 లక్షలకు పైగా అప్పులు చేసి చికిత్స చేయించారు. ఎముకలలోని గుజ్జు మార్పించేందుకు భారీగా ఖర్చు అవుతోంది. ఆంజనేయులు శింగనమల మండలం ఉల్లికల్లు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అక్షయ గ్రేస్ జబ్బు బారిన పడటంతో ఈ కుటుంబం దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటోంది. దొరికిన చోటల్లా అప్పు చేశామని, అయినా వైద్యం పూర్తి కాలేదని దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎకరం భూమి తప్ప ఎలాంటి ఆస్తి లేదని, తమ బిడ్డను కాపాడుకునేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు సాయం చేయాలని అక్షయ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. బండెల ఆంజనేయులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నంబరు 31225013888, కల్లూరు బ్రాంచి, ఐఎ్‌ఫఎ్‌ససీ: ఎస్‌బిఐఎన్0002737కు కానీ, ఫోన్ పే నంబర్ 9985673403కు కానీ దాతలు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.