kakinada: ప్రాణం తీసిన కుటుంబ కలహాలు
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:39 AM
కాకినాడ జేఎన్టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మట్ల శ్రీనివాస్(36) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే అతడి మరణానికి కారణమని తెలుస్తోంది.
ఆత్మహత్య చేసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్
రావికంపాడు వద్ద రైలు కింద పడి మృతి
తనను క్షమించాలంటూ వాట్సాప్ మెసేజ్
తొండంగి/తుని రూరల్, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): కాకినాడ జేఎన్టీయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మట్ల శ్రీనివాస్(36) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే అతడి మరణానికి కారణమని తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకునే ముందు ‘నన్ను క్షమించండి’ అంటూ తల్లిదండ్రులకు, పిల్లలకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు. కాకినాడ జిల్లాలోని తుని రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని తొండంగి మండలం రావికంపాడు రైల్వే యార్డు సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తుని రైల్వే ఇన్‌స్పెక్టర్ జి.శ్రీనివాసరావు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తొండంగి మండలం రావికంపాడు గ్రామానికి చెందిన మట్ల శ్రీనివాస్(36) కాకినాడ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో కాంట్రాక్టు పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా 13ఏళ్లుగా పనిచేస్తున్నారు. అతడు భార్య దివ్య, పిల్లలు సాన్విత(11), అవినాష్ (8)లతో కలిసి కాకినాడలో నివసిస్తున్నారు. భార్యభర్తల మధ్య వచ్చిన వివాదం కారణంగా అన్నవరం పోలీస్ స్టేషన్‌లో భార్య కేసు పెట్టారు. దీంతో మనస్తాపానికి గురైన పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నానంటూ తండ్రికి చెప్పి బయటకు వెళ్లారు. ఇంటి నుంచి వెళ్లిన శ్రీనివాస్ రావికంపాడు రైల్వే యార్డు సమీపంలో రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని రైల్వే పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్తానని చెప్పి.. వెళ్లిన కాసేపటికే ‘క్షమించండి’ అంటూ సాన్విత, అవినాష్, అమ్మనాన్నలకు మెసేజ్ పెట్టాడని, దాన్ని చూసి అతడి కోసం గాలించగా.. రైలు పట్టాలపై శవమై కనిపించాడని బంధువులు చెప్పారు. గతంలో రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో శ్రీనివాస్ తల్లి గంగ నడవలేని స్థితిలో ఉన్నారు. తనకు మందులు తెచ్చి ఇచ్చి.. ఇంతలోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆ తల్లి విలపిస్తోంది. తండ్రి కూడా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఇంటికి ఆసరాగా ఉన్న కొడుకు.. కళ్లెదుటే కడతేరిపోవడంతో వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.