Family Dispute: భార్య, మామ, బావమరిదిపై దాడి
ABN , Publish Date - Nov 11 , 2025 | 05:08 AM
కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య, బావమరిది, మామపై అల్లుడు, అతని మేనమామ కలిసి కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం...
స్థానికుల జోక్యంతో ఉడాయింపు.. ఆస్తి తగాదాలే కారణం
పాలకోడేరు, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్య, బావమరిది, మామపై అల్లుడు, అతని మేనమామ కలిసి కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామ శివారు తుమ్మలగుంటపాలెంలో చోటు చేసుకుంది. అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన వీరవల్లి రామచంద్రరావుకు తుమ్మలగుంటపాలేనికి చెందిన శ్రీలక్ష్మికి 17 ఏళ్లక్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. ఉపాధి నిమిత్తం రామచంద్రరావు గల్ఫ్ దేశంలో కొంతకాలం ఉన్నాడు. తిరిగి వచ్చిన నాటి నుంచి ఆస్తి విషయంలో భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఇది పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పలుమార్లు పెద్దల సమక్షంలో రాజీ ప్రయత్నాలు జరిగినా ఫలితం లేదు. దీంతో తుమ్మలగుంటపాలెంలోని ఆమె పుట్టింటి వద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో రామచంద్రరావు, అతని మేనమామ మట్టపర్తి కృష్ణతో కలిసి శ్రీలక్ష్మి వద్దకు ఆదివారం వచ్చారు. శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులకు, రామచంద్రరావుకు మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలోతో శ్రీలక్ష్మి, ఆమె తండ్రి సత్యనారాయణపై రామచంద్రరావు కత్తితో దాడి చేశాడు. సత్యనారాయణ కుమారుడు రాజేశ్ అడ్డుకునే ప్రయత్నం చేయగా అతడిపైనా దాడి చేయడంతో చేతి నాలుగు వేళ్లు తెగిపోయాయి. దీంతో ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకోవడంతో రామచంద్రరావు, కృష్ణ అక్కడి నుంచి జారుకున్నారు. గాయపడిన శ్రీలక్ష్మి, సత్యనారాయణ, రాజేశ్‌ను స్థానికులు 108లో భీమవరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం నిమిత్తం రాజేశ్‌ను విజయవాడ తరలించారు. భీమవరం డీఎస్పీ జయసూర్య, పాలకోడేరు ఎస్‌ఐ రవివర్మ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పాలకోడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.