Worker Exploitation: సీఎం గారూ.. మీరే ఆదుకోవాలి
ABN , Publish Date - Oct 01 , 2025 | 04:53 AM
సౌదీలో యజమాని చిత్ర హింసలు పెడుతున్నాడని, జీతం ఇవ్వకుండా వేధిస్తున్నాడని, తనను స్వదేశానికి రప్పించాలంటూ ఓ వ్యక్తి...
సౌదీలో ‘అనంత’ వాసికి చిత్రహింసలు
సెల్ఫీ వీడియోలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్‌కు బాధితుడి విజ్ఞప్తి
స్వదేశానికి తీసుకువస్తామని మంత్రి భరోసా
అనంతపురం క్రైం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): సౌదీలో యజమాని చిత్ర హింసలు పెడుతున్నాడని, జీతం ఇవ్వకుండా వేధిస్తున్నాడని, తనను స్వదేశానికి రప్పించాలంటూ ఓ వ్యక్తి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్‌కు సెల్ఫీ వీడియోలో వేడుకున్నాడు. ఈ వీడియో మంగళవారం వైరల్ కావడంతో మంత్రి లోకేశ్ స్పందించారు. అనంతపురం నగరంలోని ఆజాద్ నగర్‌కు చెందిన నిజాంకు భార్య రేష్మ, కుమారుడు సొహైల్ ఉన్నారు. గతంలో ఓసారి నిజాం సౌదీ వెళ్లారు. కుమారుడి ఆపరేషన్ కోసం సుమారు రూ.12 లక్షలు అప్పు చేశారు. వాటిని తీర్చేందుకు నిజాం రెండు నెలల క్రితం మళ్లీ సౌదీకి వెళ్లారు. ఓ వ్యక్తి వద్ద డ్రైవర్‌గా చేరారు. ఆ వ్యక్తి జీతం సరిగా ఇవ్వకపోగా, నిత్యం కొడుతూ హింసిస్తున్నాడు. దీంతో నిజాం పది రోజుల క్రితం తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో తన కష్టాలను వివరిస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ విషయం తెలిసి ఢిల్లీలో ఉన్న లోకేశ్ నిజాం భార్య రేష్మకు ఫోన్ చేసి పరామర్శించారు. ఇండియన్ ఎంబసీతో మాట్లాడి, నిజాంను స్వదేశానికి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.