Kurnool Bus Accident: మృతదేహాల కోసం నిరీక్షణ
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:40 AM
వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు తమవారి మృతదేహల కోసం నిరీక్షిస్తున్నారు.
మాంసపు ముద్దలుగామారిన మృతదేహాలు
డీఎన్‌ఏ పరీక్షలకు బెజవాడ ల్యాబ్‌కు నమూనాలు
సోమవారం ఉదయం ఫలితాలు వచ్చే అవకాశం
ఆ తర్వాతే అప్పగిస్తామని చెబుతున్న అధికారులు
కర్నూలులో కుటుంబ సభ్యుల ఎదురుచూపులు
కర్నూలు, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు తమవారి మృతదేహల కోసం నిరీక్షిస్తున్నారు. ఆప్తులను కోల్పోయిన ఆవేదనకు తోడు డీఎన్‌ఏ రిపోర్టు రావడానికి కనీసం 48గంటలు పడుతుందని చెబుతుండటంతో ఉసూరుమంటున్నారు. కర్నూలు నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ‘వేమూరి కావేరి’ ట్రావెల్స్‌కు చెందిన బస్సులోని 19మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు మాంసపు ముద్దగా మారాయి. రిజర్వేషన్ చార్ట్ ప్రకారం మృతులతో పాటు వారి కుటుంబీకులను గుర్తించారు. అయితే ఏ మృతదేహం ఎవరిదో గుర్తించలేనంతగా కాలిపోవడంతో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా డీఎన్‌ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను అప్పగిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మృతదేహాలను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఫోరెన్సిక్ విభాగం ఏసీ గదుల్లో భద్రపరిచారు. దీంతో శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వద్ద మృతదేహాల కోసం వచ్చిన రక్త సంబంధీకులు నిరాశతో వెనుదిరిగారు.
రేపు ఉదయానికి డీఎన్‌ఏ రిపోర్టులు: కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ మెడికల్ విభాగం హెచ్‌వోడీ ప్రొఫెసర్ డాక్టర్ టి.సాయిసుధీర్ ఆధ్వర్యంలో డీఎన్‌ఏ పరీక్షల కోసం మృతదేహాల నుంచి కండరాలు, ఎముకలు, దంతాల నమూనాలు సేకరించారు. అలాగే మృతుల రక్తసంబంధీకులైన తల్లి, తండ్రి, పిల్లలు మొత్తం 16మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. బిహార్, ఒడిశాకు చెందిన ఇద్దరు మృతుల రక్త సంబంధీకుల నమూనాలు విజయవాడలో సేకరించారు. ఈ శాంపిల్స్ శనివారం విజయవాడ ల్యాబ్‌లో అప్పగించారు. ఫలితాలు రావడానికి కనీసం 48గంటలు పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. సోమవారం ఉదయానికి డీఎన్‌ఏ రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. బస్సుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాల కోసం నెల్లూరు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక నుంచి వారి బంధువులు వచ్చారు. వారికి కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ప్రభుత్వ అతిథి గృహంలో బస, భోజన ఏర్పాట్లు చేశారు. అయితే రెండు రోజులు నిరీక్షించలేక చాలామంది స్వగ్రామాలకు వెళ్లిపోయారు. సమాచారం కోసం పోస్టుమార్టం విభాగం సమీపంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు.
బ్యాటరీలు పేలడంతో పెరిగిన తీవ్రత
ప్రమాదం జరిగిన సమయంలో బస్ కార్గోలో రియల్‌మీ ఆర్‌ఎంఎక్స్ 3990 సెల్‌ఫోన్లు 235కు పైగా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి వాటిని హైదరాబాద్‌లో బుక్ చేసి ఈ బస్సులో రవాణా చేస్తున్నారు. బస్ కింద ఇరుక్కుపోయిన పల్సర్ బైక్, రోడ్డు రాపిడికి నిప్పురవ్వలు రావడం, బైక్ పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయి పెట్రోలు బయటకు చిమ్మడంతో మంటలు చెలరేగాయని గుర్తించారు. ఆ అగ్ని కీలలు సెల్‌ఫోన్లకు తాకడం, ఫోన్లు కాలిపోయి బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోవడంతో ప్రయాణికుల సీట్ల దిగువన ఉన్న ఇనుప రేకులు పగిలిపోయి ప్రమాద తీవ్రత పెరిగిందని అంటున్నారు. బస్సులో ఉన్న రెండు 12 కేవీ బ్యాటరీలు కూడా పేలిపోవడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది. ఏసీ బస్సు కావడం వల్ల ఆక్సిజన్ ఎక్కువై మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు. అత్యవసర ద్వారాలు తెరుచుకోకపోవడం కూడా మృతుల సంఖ్య పెరగడానికి కారణమైందని అంటున్నారు.