‘కృష్ణా’లోనూ నకిలీ మరక
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:20 AM
రాష్ట్రంలో సంచలనం కలిగించిన నకిలీ మద్యం మరకలు కృష్ణా జిల్లాలో కనిపించాయా? అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన మద్యం వ్యాపారికి ఈ మరకలు అంటుకున్నాయా? కొన్ని నెలల క్రితం బయటపడిన నకిలీ మద్యం సీసాలు భూమిలో సమాధి అయిపోయాయా? అంటే అవుననే జవాబులు విశ్వసనీయవర్గాల నుంచి వస్తున్నాయి. అ
ఈలచెట్ల దిబ్బలో నకిలీ మద్యం సీసాల గుర్తింపు
ఆరు నెలల క్రితం జరిగిన ఘటన
గోప్యంగా ఉన్న వ్యవహారం
అవనిగడ్డకు చెందిన వ్యాపారి సూత్రధారి
రిమాండ్ రిపోర్టులో వ్యాపారి పేరు
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
రాష్ట్రంలో సంచలనం కలిగించిన నకిలీ మద్యం మరకలు కృష్ణా జిల్లాలో కనిపించాయా? అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన మద్యం వ్యాపారికి ఈ మరకలు అంటుకున్నాయా? కొన్ని నెలల క్రితం బయటపడిన నకిలీ మద్యం సీసాలు భూమిలో సమాధి అయిపోయాయా? అంటే అవుననే జవాబులు విశ్వసనీయవర్గాల నుంచి వస్తున్నాయి. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రం వ్యవహారం వెలుగులోకి వచ్చిన కొద్దిరోజులకే ఇబ్రహీంపట్నంలోని అద్దేపల్లి జనార్దనరావు ఆధ్వర్యంలో జరుగుతన్న నకిలీ మద్యం తయారీ బయటపడింది. ఈ కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతూనే ఉంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వరకు పరిమితమైన ఈ నకిలీ వ్యవహారం అవనిగడ్డ నియోజకవర్గంలో ఆరు నెలల క్రితమే తేలినట్టు తెలుస్తోంది. నాగాయకలంక మండలంలోని ఈలచెట్లదిబ్బ గ్రామంలో ఆరు నెలల క్రితం నకిలీ మద్యం సీసాలను గుర్తించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అవనిగడ్డలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలతో అంటకాగి, ఇప్పుడు కూటమి గోడలకు జారబడిన మద్యం వ్యాపారి పేరు ఈ క్రమంలో వినిపిస్తోంది. తాజాగా అద్దేపల్లి జనార్దనరావును కోర్టులో హాజరుపరిచినప్పుడు ఎక్సైజ్ పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఆ మద్యం వ్యాపారి పేరు ఉండడం గమనార్హం.
లంకలను టార్గెట్ చేసుకున్నారా?
అవనిగడ్డ నియోజకవర్గంలో లంక గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మత్స్యకార జనాభా అధికం నివపిస్తుంటారు. వారిని టార్గెట్ చేసుకుని నకిలీ మద్యం సరుకును చలామణి చేసినట్టు తెలుస్తోంది. ఈలచెట్లదిబ్బలో కొన్ని నెలల క్రితం ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేసినప్పుడు ఈ నకిలీ మద్యం సీసాలను గుర్తించినట్టు నియోజకవర్గంలో ప్రచారం నడుస్తోంది. వాటిని గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు ఏ జిల్లాకు చెందిన వారన్నది సందేహంగా మారింది. ఈ గ్రామం రేపల్లెకు సమీపంగా ఉంటుంది. అక్కడి నుంచి ఎక్సైజ్ పోలీసులు వచ్చి ఈ నకిలీ మద్యం సీసాలను గుర్తించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు వెలుగులోకి రాకుండా ఉన్న ఈ విషయం ఇబ్రహీంపట్నం వ్యవహారంతో తెరపైకి వచ్చింది. రేపల్లె ఎక్సైజ్ పోలీసులు వస్తే ఆ సమాచారాన్ని కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులకు ఎందుకు ఇవ్వలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం మీద నకిలీ మద్యం తయారీ విషయం ఎక్సైజ్ శాఖను కుదిపేస్తోంది. అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఆ మద్యం వ్యాపారి పేరును జనార్దనరావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని పోలీసులు రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. జనార్దనరావుతో కలిసి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ7 బార్‌లో అవనిగడ్డకు చెందిన మద్యం వ్యాపారి ఒక భాగస్వామిగా ఉన్నాడు. జనార్దనరావు ఈ బృందాన్ని తీసుకుని గోవాకు వెళ్లినప్పుడు అందులోనూ ఉన్నాడు. అసలు నకిలీ మద్యం తయారీకి ఫార్ములాను రూపొందించిన బాలాజీతో జరిగిన చర్చల్లో పాల్గొన్నాడు. తాను వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి నకిలీ మద్యం తయారు చేస్తున్నట్టు జనార్దనరావు అంగీకరించాడు. ఈ పరిస్థితుల్లో అవనిగడ్డకు చెందిన మద్యం వ్యాపారిపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.