Resort Booking Scam: నకిలీ వెబ్‌సైట్లతో దోపిడీ
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:17 AM
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 రాష్ట్రాల్లో 127 కేసులు.. దాదాపు ఏడాది నుంచి బ్యాంకు ఖాతాలు మార్చి మార్చి.. పర్యాటకులే లక్ష్యంగా దోపిడీ.. అన్నిచోట్లా ఫిర్యాదులు తీసుకోవడం తప్ప విచారణ ముందుకు సాగని పరిస్థితి..
18 రాష్ట్రాల్లో.. 127 ఫిర్యాదులు
రిసార్ట్స్, హోటల్స్ బుకింగ్ పేరిట నగదు కాజేత
ముగ్గురు విద్యార్థుల ఖాతాల్లో సొమ్ము జమ
రాజస్థాన్‌లో ఇద్దరు సైబర్ నేరగాళ్ల అరెస్టు
బాపట్ల, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 రాష్ట్రాల్లో 127 కేసులు.. దాదాపు ఏడాది నుంచి బ్యాంకు ఖాతాలు మార్చి మార్చి.. పర్యాటకులే లక్ష్యంగా దోపిడీ.. అన్నిచోట్లా ఫిర్యాదులు తీసుకోవడం తప్ప విచారణ ముందుకు సాగని పరిస్థితి..! కానీ.. బాపట్ల జిల్లా పోలీసులు పక్కావ్యూహంతో ముందుకెళ్లడంతో సైబర్ నేరగాళ్లు దొరికిపోయారు. ఈ కేసుపైనే ఏడాదిపాటు దృష్టి సారించిన రెండు బృందాలు.. ఖాకీ సినిమా తరహాలో రాజస్థాన్ వెళ్లి.. స్థానిక పోలీసుల సాయంతో ఇద్దరు నిందితులను ఇక్కడకు పట్టుకొచ్చారు. ఆ వివరాలను పోలీసులు శుక్రవారం వెల్లడించారు.
హరిత రిసార్టుపైనే 49 ఫిర్యాదులు
చీరాల, బాపట్ల తీర ప్రాంతాలు పర్యాటకంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. తెలంగాణతో పాటు బెంగళూరు, తమిళనాడు నుంచి కూడా వారాంతాల్లో పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ దొంగల కన్ను ఈ ప్రాంతంపై పడింది. సూర్యలంకలోని హరిత రిసార్ట్ ను లక్ష్యంగా నకిలీ వెబ్‌సైట్ సృష్టించి దందాకు తెరలేపారు. ఈ వెబ్‌సైట్‌లో రిసార్టులు బుక్ చేసుకున్న వారు భారీగా డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ మోసాలపై వివిధ ప్రాంతాల్లో 49ఫిర్యాదులు నమోదయ్యాయి. గతేడాది జూన్ 16న బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు ఎస్పీ తుషార్ డూడీ.. ఏడుగురు పోలీసులతో ఐటీ సైబర్ కోర్ టీమ్, ఐదుగురు పోలీసులతో విచారణ అండ్ ఫీల్డ్ టీమ్ అంటూ రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లు బ్యాంకు ఖాతాలు మొదలుకుని ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ల వరకూ.. ఏ ఒక్క సాంకేతిక అంశాన్నీ వదలకుండా జల్లెడ పట్టాయి. ఐపీ అడ్ర్‌సలను నిత్యం ట్రాక్‌లో ఉంచి మూలాలు రాజస్థాన్‌లో ఉన్నాయని గుర్తించాయి.
రెండు దఫాలుగా రాజస్థాన్‌కు..
కేసు విచారణలో భాగంగా తొలుత ముగ్గురు విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ నగదు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వీరంతా రాజస్థాన్‌కు చెందిన వారు కావడంతో అక్కడకే వెళ్లి విచారణ చేపట్టారు. అయితే ఈ ముగ్గురూ అమాయకులని, వారిని ఎరగా వేసి సైబర్ నేరగాళ్లు డబ్బు కొల్లగొడుతున్నారని గుర్తించారు. రెండోసారి పక్కా ఆధారాలతో రాజస్థాన్ వెళ్లిన పోలీసులు దాదాపు రెండు వారాలు అక్కడే ఉండి కేసును ఛేదించారు. నిందితులు ఉన్నట్లు గుర్తించిన దిగ్ జిల్లాలోని సహసన్ ప్రాంతానికి కొత్తవ్యక్తులు వెళ్లడం అసాధ్యం. అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్న నిందితులు బయటి నుంచి ఎవరు వచ్చినా తెలిసేలా పటిష్ఠ నిఘా వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. ఆ ప్రాంతానికి వెళ్లడమే పోలీసులకు సవాల్‌గా మారింది. రెండు సార్లు ప్రయత్నించి విఫలయ్యారు కూడా. అయితే స్థానిక ఉన్న ఫారెస్ట్ అధికారి సాయంతో ఎట్టకేలకు అక్కడకు వెళ్లి పరంజిత్ (20), బిట్లూ (21)లను అదుపులోకి తీసుకుని ఇక్కడకు తీసుకువచ్చారు. నిందితులు చేసిన మోసాలపై 18 రాష్ట్రాల పరిధిలో 127 ఫిర్యాదులు వచ్చినట్లు పోలీసు విచారణలో తేలింది. ఎంతో శ్రమించి కేసు ఛేదించిన రెండు టీమ్‌లను ఎస్పీ తుషార్ డూడీ అభినందించారు.