Share News

CM Chandrababu: ప్రతిపక్షం కాదు.. విష వృక్షం

ABN , Publish Date - Aug 24 , 2025 | 04:02 AM

వైసీపీ ప్రతిపక్షం కాదు.. విష వృక్షమని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. సోషల్‌ మీడియాలో మహిళలపై బూతులు, రౌడీ రాజకీయాలు, తప్పుడు విధానాలే జగన్‌ పార్టీ అజెండా అంటూ ఆగ్రహించారు.

CM Chandrababu: ప్రతిపక్షం కాదు.. విష వృక్షం

  • ఆ భూతాన్ని పాతాళంలోకి దించేశామనుకున్నాం కానీ, ఫేక్‌ ప్రచారాలతో మళ్లీ పైకొస్తోంది

  • ఉపేక్షిస్తే రాష్ట్రానికి ప్రమాదకరం.. హత్యలు, దొంగతనాలు చేసేవారంతా వైసీపీలోనే

  • జగన్‌లాంటి వ్యక్తికి పార్టీ పెట్టే అర్హతే లేదు.. మునిగింది అమరావతి కాదు, వైసీపీనే

  • భూస్థాపితం కాబోయేది కూడా ఆ పార్టీయే.. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభలో బాబు ధ్వజం

  • పదేళ్ల పది వైసీపీ కుట్రలను వివరించిన సీఎం.. అందరి ఆలోచనలు మారితేనే స్వర్ణాంధ్ర

  • 2019-2024లో వైకుంఠపాళి ఆటలా పైనుంచి కిందకు పడిపోయిన రాష్ట్రం

  • మళ్లీ మనకు ఆ ఆట వద్దని ముఖ్యమంత్రి పిలుపు.. పెద్దాపురంలో స్వచ్ఛాంధ్ర ర్యాలీ

‘‘‘రాష్ట్రంలో ఎక్కడా అర్హుల పింఛన్లు తొలగించలేదు. కానీ లక్ష పింఛన్లు తొలగించినట్లు వైసీపీ సోషల్‌ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. సంక్షేమ పథకాలపై చర్చ జరగరాదనే కుట్రతోనే ఇదంతా చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది, ప్రకాశం బ్యారేజీలో గేటు విరిగిపోయిందంటూ ఫేక్‌ ప్రచారాలు చేస్తున్నారు. వైసీపీ విధానాలను, కుట్రలను ఉదాహరణలతో చెబితే ప్రజలు అర్థం చేసుకుంటారు. మనం చేసిన మంచిని ప్రజలకు నిత్యం వివరించాలి. ప్రజలకు వాస్తవాలు చెబుతూనే ఉండాలి. ‘గెలిచాం.. అధికారంలో ఉన్నాం కదా’ అని తప్పుడు ప్రచారాలను ఉపేక్షిస్తే అది ప్రమాదకరంగా మారుతుంది.’’

- చంద్రబాబు

కాకినాడ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రతిపక్షం కాదు.. విష వృక్షమని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. సోషల్‌ మీడియాలో మహిళలపై బూతులు, రౌడీ రాజకీయాలు, తప్పుడు విధానాలే జగన్‌ పార్టీ అజెండా అంటూ ఆగ్రహించారు. జగన్‌ పార్టీ నేరపూరిత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్‌ అనే భూతాన్ని పాతాళంలోకి దించేశాం అని పెట్టుబడిదారులకు ధైర్యం చెప్పామని, కానీ ఫేక్‌ ప్రచారాలతో అరుంధతి సినిమాలోవదల బొమ్మాళి.. వదల.. తరహాలో మళ్లీ అది పైకి వస్తోందంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో వైసీపీ మునగడం, భూస్థాపితం కావడం ఖాయమన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర..స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలోనూ, అమరావతి ఉండవల్లిలో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్‌, వైసీపీ రాజకీయాలపై తీవ్ర స్వరం వినిపించారు.

Untitled-5 copy.jpg


పదేళ్లలో వైసీపీ పది అరాచక అబద్ధాలను పెద్దాపురం సభలో వినిపించారు. తొలుత ఈ పట్టణంలో స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొని అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ప్రసగించారు. సూపర్‌ సిక్స్‌... సూపర్‌ హిట్‌ అయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ మనకు వైకుంఠపాళీ ఆట వద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..

సూపర్‌ సిక్స్‌...హిట్‌ కొట్టాం..

‘‘రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమ ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోంది. మా మూడు పార్టీల ఆలోచన, ఆశయం ఒక్కటే. సంపద సృష్టించడం, తద్వారా ఆదాయం పెంచడం, తిరిగి ప్రజలకు సంక్షేమం రూపంలో అమలు చేయడం ఎలాగో ప్రభుత్వానికి తెలుసు. కానీ అప్పులు చేసి సంక్షేమం అమలుచేయడం, దోపిడీలకు పాల్పడం గత పాలకుల నైజం. ఏ వ్యక్తి అయితే సంపద సృష్టిస్తాడో అతడికే సంక్షేమ పథకాలు అమలుచేసే అర్హత ఉంది. ఎన్నికలప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే సూపర్‌సిక్స్‌ అమలు చేస్తాం అంటే చాలామంది సాధ్యం కాదన్నారు. కానీ ఇప్పుడు అన్నింటినీ అమలుచేసి చూపించాం. సూపర్‌ సిక్స్‌ను సూపర్‌ హిట్‌ చేశాం. ఈ ఆగస్టు నెలనే తీసుకుంటే ఎన్నో పథకాల ద్వారా సంక్షేమ పథకాలు అమలుచేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. నేను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి చెబితే ఎగతాళి చేశారు. కానీ నేడు ఆడబిడ్డలు ఎంచక్కా ఎక్కడకు కావాలంటే అక్కడకు ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. శ్రీశైలం, సింహాచలం, తిరుపతి వెళ్లాలన్నా వెళ్లొచ్చు..’’


మ్యాజిక్‌ డ్రెయిన్‌ పట్ల సీఎం ఆసక్తి

పెద్దాపురం పట్టణంలోని పదో వార్డులోని మ్యాజిక్‌ డ్రెయిన్‌ను పరిశీలించారు. ఇంకుడు గుంత తరహాలో ఈ డ్రెయిన్‌ ద్వారా భూగర్భ జలాలను పెంచేలా నిర్మించారు. దానిని ఆయన ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం యాక్సిస్‌ బ్యాంకు 55,686 మంది పారిశుధ్య కార్మికులకు ప్రమాదబీమా సౌకర్యం కల్పించే కార్యక్రమం చంద్రబాబు సమక్షంలో జరిగింది. బాధిత కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయలు, అవుట్‌సోర్సింగ్‌ అయితే రూ.20 లక్షల వరకూ దీనివల్ల పరిహారం అందుతుంది. ముగ్గురు కుటుంబ సభ్యులకు రూ.15 లక్షల వరకూ బీమా వర్తింపజేస్తారు. ఎడ్యుకేషన్‌ గ్రాంటు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. అలాగే అక్టోబరు 2న స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 16 కేటగిరీల కింద అవార్డులు ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఉత్తమ మునిసిపాలిటీ, గ్రామ పంచాయతీ, స్కూల్‌, అంగన్‌వాడీ కేంద్రం, హాస్టల్‌, మురికివాడ, విలేజి లెవిల్‌ ఫెడరేషన్‌, బస్‌స్టేషన్‌, రైతుబజారు, పరిశ్రమ, ఎన్‌జీవో, శానిటరీ వర్కర్లు.. ఇలా పలు కేటగిరిల్లో అవార్డులు అందిస్తారు.


నేతల విగ్రహాల్ని అవమానిస్తే సహించబోం

కైకలూరు ఘటనపై చంద్రబాబు సీరియస్‌

దివంగత నేత వంగవీటి మోహనరంగా విగ్రహంపై ఆగంతుకులు దుశ్చర్యకు పాల్పడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. నేతల విగ్రహాలను అవమానిస్తే సహించబోమని హెచ్చరించారు. శనివారం ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండిలో మోహనరంగా విగ్రహానికి పేడ పూసి కొందరు ఆగంతకులు అవమానించారు. ఈ ఘటనకు పాల్పడినవారిని పట్టుకుని శిక్షించాలని పోలీసు డిపార్టుమెంటును చంద్రబాబు ఆదేశించారు.


ఫేక్‌ ప్రచారాలు.. అబద్ధపు రాతలు..

‘‘గత ఎన్నికల్లో దుర్మార్గులకు ఓటు వేశారు. దీంతో నేర మనస్తత్వం ఉన్నవారు అధికారంలోకి వచ్చారు. నా జీవితంలో వైసీపీ లాంటి పార్టీని, జగన్‌ వంటి నాయకుడిని చూడలేదు. టీడీపీ, పవన్‌కల్యాణ్‌, బీజేపీకి సొంతంగా టీవీ లేదు, పేపర్‌ లేదు. కానీ జగన్‌కు మాత్రం పేపర్‌, టీవీ ఉన్నాయి. వీటిని తప్పుడు వార్తలు రాసేందుకు, ఫేక్‌ ప్రసారానికి వాడుతున్నారు. హత్యలు, దొంగతనాలు చేసేవారంతా వైసీపీలోనే ఉన్నారు. సోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రచారాలు, రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. తప్పుడు విధానాలే వీరి అజెండా. 2019-2024లో వైకుంఠపాళీ ఆటలా పైనుంచి కిందకు దిగి వచ్చాం. మనకు వైకుంఠపాళీ ఆట వద్దు. అభివృద్ధి కావాలి, పేదరికం పోవాలి. అందుకే పీ4 తీసుకువచ్చాం.’’ అని చంద్రబాబు అన్నారు. అనంతరం పీ 4 కింద 50 బంగారు కుటుంబాలను లలిత ఇండస్ట్రీస్‌, పట్టాభి ఆగ్రో ఫుడ్స్‌ అధినేతలు చంద్రబాబు సమక్షంలో దత్తత తీసుకున్నారు.


ఈ పదీ అందరికీ చెప్పండి : సీఎం

వైసీపీ కుట్ర రాజకీయాలకు పదేళ్లలో పది ఉదాహరణలున్నాయంటూ.. వాటిని చంద్రబాబు సభలో వినిపించారు.

1) సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణంగా హత్య చేశారు. పేపర్లో నా చేతిలో గొడ్డలి పెట్టి నేను చంపినట్టు తప్పుడు ప్రచారం సాగించారు.

2) విశాఖలో కోడి కత్తి డ్రామా ఆడారు. కోడికత్తితో దాడి చేసిన వారితో నేను మాట్లాడానని ప్రచారం సాగించారు. ఇదొక మిస్టరీగా తయారైంది.

3) ఎన్నికలప్పుడు గులకరాయి డ్రామా ఆడారు. విజయవాడలో ఓ అమాయకుడిని హింస పెట్టారు.

4) పోలవరం డ్రయాఫ్రం వాల్‌ కట్టకుండా నిర్లక్ష్యం చేశారు. దీనివల్ల డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోతే అదీ నావల్లే అని ప్రచారం చేశారు.

5) వైసీపీకి వలంటీర్లు ఎన్నికల ప్రచారం చేస్తుంటే వారు లేకుండా పింఛన్లు ఇవ్వాలని చెప్పాం. ఆ సాకుతో పింఛన్లు ఇవ్వకుండా తిప్పి 15 మంది వృద్ధుల చావుకు కారణమయ్యారు. ఆ నెపాన్ని కూడా నా పైకి నెట్టే ప్రయత్నం చేశారు.

6) నేను ఎక్కడికి వెళ్లినా రాష్ట్రంలో పనులు బాగా చేస్తున్నారని చెబుతున్నారు. మీ ప్రాంతంలో ఒక భూతం ఉందని వారు అంటే, దానిని పాతాళంలో బిగించామని చెబుతున్నా. కానీ, అది మళ్లీ పైకి రావడానికి ప్రయత్నం చేస్తోంది.

7) మొన్న జగన్‌ కారు కింద పడి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త చనిపోయాడు. ముందేమో అసలు మా కారు కింద పడలేదన్నారు. ఇప్పుడు ఆ వీడియోలు బయటపడితే మృతుడి భార్యను బెదిరించి అంబులెన్స్‌ వాళ్లే చంపేశారని చెప్పించారు.

8) మొన్న జగన్‌ నెల్లూరు వెళ్లినప్పుడు మనుషులు రాలేదు. దీంతో బంగారుపాళ్యెం ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ప్రచారం చేశారు

9) వర్షాలకు అమరావతి మునిగిపోయిందని దుష్పప్రచారం చేస్తున్నారు. నేను ఒక్కటే చెబుతున్నా. అమరావతి మునగలేదు. మునిగిపోయింది వైసీపీ. భూస్థాపితం కాబోయేది కూడా ఆ పార్టీయే.

10) గత ప్రభుత్వంలో పింఛన్లు వికలాంగులు కానివారికి ఇచ్చారు.అర్హులకే పింఛన్లు ఇవ్వాలని మేంచూస్తున్నాం. దీనిపైనా బురద చల్లుతున్నారు.


చెత్తపనులు చేసిపోయారు

‘‘ముఖ్యమంత్రిగా నేను పెద్ద పెద్ద ప్రారంభోత్సవాల కోసం ఇక్కడకు రాలేదు. మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పడానికే వచ్చా. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌ కావాలంటే ప్రతి ఒక్కరి ఆలోచనలు మారాలి. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది. కానీ, చెత్త చెత్తగా రాష్ట్రాన్ని వదిలేసిపోయింది. ఎన్నికల సమయంలో నేను, పవన్‌, బీజేపీ ఒక్కటే చెప్పాం. మళ్లీ వస్తాం...ప్రక్షాళన చేస్తాం అని చెప్పాం. ఇప్పుడు చేసి చూపిస్తున్నాం. కేబినెట్‌లో తాజాగా సర్క్యులర్‌ ఎకానమీ పాలసీని ఆమోదించాం.’’


ఫేక్‌ ప్రచారాలను ఉపేక్షిస్తే ప్రమాదకరం

పార్టీ నేతల భేటీలో చంద్రబాబు వెల్లడి

తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేస్తున్నవారిని ఉపేక్షించడానికి వీల్లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘వాళ్లు ఫేక్‌ ప్రచారాలను రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. ప్రజల సమస్యలు, ప్రజల ప్రయోజనాలు వాళ్లకు అనవసరం. వాళ్లకు కావాల్సింది రాద్ధాంతం.. తప్పుడు ప్రచారం, మంచిపై చర్చ జరగకుండా చూడటం.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ ఫేక్‌ ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ నేతల సమావేశంలో సీఎం మాట్లాడారు. వైసీపీ సోషల్‌ మీడియా నిత్యం తప్పుడు ప్రచారంతో ప్రభుత్వ పథకాలపై, మంచి కార్యక్రమాలపై చర్చ జరగకుండా చేస్తోందని సీఎం మండిపడ్డారు. నీచస్థాయి పార్టీ చేసే చిల్లర రాజకీయాలు వైసీపీ చేస్తోందని, వాళ్లే వివాదం సృష్టించి, వాళ్లే నేరాలు చేసి మళ్లీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు.


కాన్వాయ్‌కిఅడ్డు వెళ్లిన రైతు

చంద్రబాబు కాన్వాయ్‌లో హఠాత్పరిణామం జరిగింది. తన భూమి ఆన్‌లైన్‌లో తక్కువగా చూపిస్తోందని న్యాయం చేయాలంటూ ఫ్లెక్సీతో చంద్రబాబు కాన్వాయ్‌పైకి ఓ వ్యక్తి దూసుకువచ్చాడు. గొల్లప్రోలుకు చెందిన గంగాధర్‌ అనే వ్యక్తి కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే చంద్రబాబు కాన్వాయ్‌ ఆపి బాధితుడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకూ 70సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని వివరించాడు. గంగధర్‌ ఫిర్యాదుపై సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్‌ను పిలిచి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Untitled-5 copy.jpg

Updated Date - Aug 24 , 2025 | 04:11 AM