Social Media Misinformation: పింఛన్లపై పీక్స్‌కు ఫేక్
ABN , Publish Date - Aug 25 , 2025 | 05:18 AM
అర్హులైనవారిలో ఏఒక్కరి పింఛను కూడా తొలగించరాదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. పింఛన్లకు అర్హత విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులను పదేపదే ఆదేశిస్తోంది.
ఆర్థిక బాధలతో దంపతుల ఆత్మహత్య
వారి కుమార్తె, గ్రామస్థులు చెప్పింది ఇదే
కానీ, దివ్యాంగ పింఛన్ నిలిపివేయడమే కారణమంటూ ఫేక్ సైకోల విషం
గార రూరల్, శ్రీకాకుళం, కోడూరు, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): అర్హులైనవారిలో ఏఒక్కరి పింఛను కూడా తొలగించరాదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. పింఛన్లకు అర్హత విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని అధికారులను పదేపదే ఆదేశిస్తోంది. అయినా, అధికారుల నిర్లక్ష్యంతో అక్కడక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి. మరోవైపు, ఫించన్లపై ఫేక్ ప్రచారాలు జోరందుకున్నాయి. వడపోతలో దివ్యాంగులు కాదని తేలినవారి పింఛన్లను ప్రభుత్వం తొలగిస్తే.. అదేదో నేరం, ఘోరం అయినట్టు వైసీపీ సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. అర్హులు కానివారిని అర్హులుగా చిత్రీకరిస్తూ.. ఫేక్ ఫొటోలు, మార్ఫింగ్ చిత్రాలతో విషం కక్కుతోంది. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులో ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, దివ్యాంగ పింఛన్ తీసివేయడం వల్ల మనస్తాపం చెంది బలవన్మరణం చెందారని ఫేక్ సైకోలు తప్పుడు కథనాలు అల్లారు. అంపోలుకు చెందిన కొల్లి అప్పారావు(45), కొల్లి లలిత(42) దంపతులు. వీరికి ఇంటర్ చదువుతున్న కుమార్తె దేవి ఉంది. అప్పారావు ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఆయనకు కళ్లు సరిగ్గా కనబడవు. అంధత్వ సమస్య పెరగడంతో ఉద్యోగం మానేశారు. దీంతో లలిత కూలి పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేది. కుటుంబ అవసరాల కోసం దొరికినకాడకు అప్పులు చేశారు. వృద్ధురాలైన అప్పారావు తల్లి ఇటీవల మృతి చెందింది. దీంతో ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఇంటిని ఖాళీ చేయాలని అన్నదమ్ముల నుంచి అప్పారావుపై ఒత్తిడి వచ్చింది.
దీంతో ఆత్మహత్య చేసుకోవాలని అప్పారావు, లలిత, దేవి నిర్ణయించుకున్నారు. శనివారం రాత్రి వారు ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున వారి ఇంట్లోకి స్థానికులు వెళ్లిచూడగా అప్పారావు, లలిత విగతజీవులుగా పడిఉన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న దేవిని జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతున్న దేవిని పోలీసులు విచారించగా.. ‘‘ఎలుకల మందు తాగినట్లు తల్లిదండ్రులు చెప్పారు. నేను ఒక్కదాన్ని ఉండి ఏమి సాధిస్తానని మిగిలి ఉన్న మందు తాగాను.’’ అని తెలిపారు.
ఆత్మహత్యకూ, పింఛన్లకూ సంబంధం లేదు
అంపోలులో చోటుచేసుకున్న కుటుంబ ఆత్మహత్య ఘటనకు ఆస్తి వివాదమే కారణమని అధికారులు తేల్చారు. పింఛన్ నిలిపేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం అసత్యమని తెలిపారు. దంపతుల ఆత్మహత్యకు, పింఛన్ సమస్యకు సంబంధంలేదని నిర్ధారణ అయిందన్నారు. దివ్యాంగ పింఛను లబ్ధిదారులకు వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా నోటీసులు ఇచ్చినట్టే అప్పారావుకు కూడా ఇచ్చామేగానీ, ఆయన పింఛను తొలగించలేదని వివరణ ఇచ్చారు. దీనిపై కలెక్టరేట్ ప్రకటన వెలువరించింది. ఇదే అంశంపై విచారణ చేసి శ్రీకాకుళం ఆర్డీవో నివేదిక సమర్పించారు. అప్పారావు కుమార్తె దేవి పోలీసులకు ఇచ్చిన సమాచారంలో కుటుంబ ఆస్తి వివాదమే కారణమని పేర్కొన్నారు.
ఆమె దైన్యం ‘కనిపించలేదా’?
ఈ చిత్రంలో గాజుకన్నును చూపిస్తున్న మహిళ పేరు భూపతి నాగమణి. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు గ్రామం. 40శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నదంటూ ఈమెకు ఉన్న పింఛనును తొలగిస్తూ నోటీసు ఇచ్చారు. దీంతో నాగమణి కన్నీరుమున్నీరు అవుతున్నారు. 2006నుంచి ఆమె దివ్యాంగ పింఛను తీసుకుంటున్నారు. తనకు ఒక కన్ను లేదంటూ ఆదివారం గాజుకన్నును తీసి చూపించారు. ఆమె పరిస్థితిని కోడూరు ఎంపీడీవో సుధా ప్రవీణ్ పరిశీలించి పింఛన్ కోసం మళ్లీ అప్పీలు చేస్తామన్నారు. అటు.. ఫేక్‌లపై సమరం.. ఇటు అధికారుల పొరపాట్ల దిద్దుబాటు ప్రభుత్వం ముందున్న ప్రధాన సమస్య అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
