Share News

Alcohol Demies: కల్తీ లిక్కర్‌ వయా బెల్టు షాప్‌

ABN , Publish Date - Nov 05 , 2025 | 05:46 AM

వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా జరిగిన కల్తీ మద్యం సరఫరా మూలాలన్నీ ఇబ్రహీంపట్నంలోనే బయటపడుతున్నాయి. ఆనాడు కరోనా మీదకు నెట్టేసిన పలు మరణాల్లోనూ ఇక్కడ తయారైన కల్తీ మద్యం తాగి మరణించిన కేసులు....

Alcohol Demies: కల్తీ లిక్కర్‌ వయా బెల్టు షాప్‌

  • వైసీపీ హయాంలో ఈ షాపులే ‘నకిలీ’ అడ్డాలు

  • ఇబ్రహీంపట్నంతో వాటికి లింకులు

  • ఆర్టీసీ కార్గో ద్వారా రాష్ట్రమంతా సరఫరా

  • తాగిన వారిలో చాలామంది మృత్యువాత

  • వాటిని ‘కరోనా’మీదకు తోసేసిన వైనం

  • జోగి అరెస్టుతో ఒక్కొక్క లింకు వెలుగులోకి..

(విజయవాడ, ఆంధ్రజ్యోతి)

వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా జరిగిన కల్తీ మద్యం సరఫరా మూలాలన్నీ ఇబ్రహీంపట్నంలోనే బయటపడుతున్నాయి. ఆనాడు కరోనా మీదకు నెట్టేసిన పలు మరణాల్లోనూ ఇక్కడ తయారైన కల్తీ మద్యం తాగి మరణించిన కేసులు కూడా ఉన్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. గత ఎన్నికల సమయంలో ఇదే మద్యం ఆర్టీసీ కార్గోల ద్వారా రాష్ట్రమంతా పారించినట్టు కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ఆనాడు అధికారం అండగా కల్తీ మద్యాన్ని బెల్ట్‌షాపులనే లక్ష్యంగా చేసుకుని సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్టు నేపథ్యంలో ఈ విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జోగి రమేశ్‌ సలహాతోనే వైసీపీ హయాంలో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని తాము ప్రారంభించామని అద్దేపల్లి సోదరులు విచారణలో తెలిపిన విషయం తెలిసిందే. తమ దందాకు వీరు బెల్టుషాపులను నాడు ఎంచుకున్నారు. నిజానికి, బెల్ట్‌షాపుల తాటతీశామని ఆనాడు చెప్పుకొన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో ఊరికో బెల్ట్‌ షాప్‌ నడిచింది. ఈ బెల్ట్‌ షాపుల నుంచి నకిలీ మద్యాన్ని కొనుగోలుచేసి సేవించినవారిలో చాలామంది మృత్యువాత పడేవారు. దీర్ఘకాలిక రోగాలకు గురయ్యేవారు. నాడు కల్తీ మద్యం తాగి ఒక్క ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే పెద్దఎత్తున మరణించారు. వీటిలో బయటకు వచ్చిన ఉదంతాలు కొన్నే. కల్తీ మద్యం కారణంగా కార్డియాక్‌ అరెస్టులతో చనిపోయినవారు ఎక్కువగా ఉన్నారు. అది కరోనా సమయం కావటంతో ఆ మహమ్మారి వచ్చిపోయాక శరీరంలోని వివిధ భాగాలపై ప్రభావం చూపిస్తుందన్న ప్రచారం బాగా జరిగింది.


ఈ నేపథ్యంలో ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. సరిగ్గా ఇదే సమయంలో కల్తీ మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావటంతో అది తాగినవారు మృత్యువాత పడ్డారు. అయితే, లాక్‌డౌన్‌ కారణంగా అప్పట్లో కల్తీ మద్యం తయారీకి అవసరమైన కొన్ని రసాయనాల దిగుమతికి వీలు కాలేదు. దీంతో అందుబాటులోని స్పిరిట్‌ను బాటిల్‌లో నింపి, రంగు కలిపి వాటిని బెల్ట్‌షాపులకు తరలించినట్టుగా తెలుస్తోంది. ఈ మద్యం తాగినవారు ఎక్కువ సంఖ్యలో మృతి చెందారు. ఇబ్రహీంపట్నం కేంద్రంగా తయారై, సరఫరా అయిన కల్తీమద్యం తాగి వీరంతా చనిపోతున్నారన్న విషయం ఐదారు నెలల వరకు కూడా బయటకు తెలియలేదు. ఆకస్మిక మరణాలతో వారి కుటుంబ సభ్యులకు మొదట అనుమానం వచ్చింది. ఈ క్రమంలో అసలు ‘గుట్టు’ వెలుగులోకి వచ్చింది. గత ఎన్నికల సమయంలో కూడా కల్తీ మద్యాన్ని పెద్ద ఎత్తున పంపిణీ చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల సమయంలో కూడా కల్తీ మద్యం తాగి చనిపోయిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.

Updated Date - Nov 05 , 2025 | 05:51 AM