Share News

Excise Police Raid: నకిలీ మకిలిలో వైసీపీ

ABN , Publish Date - Oct 07 , 2025 | 04:01 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ లింకులు బయటపడుతున్నాయి.

Excise Police Raid: నకిలీ మకిలిలో వైసీపీ

  • మద్యం తయారీ కేంద్రం లీజు ఆ పార్టీ నేత పేరుతోనే

  • ఏ-12గా తెనాలి వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు

  • ఐదేళ్లుగా ఇదే దందాలో ఉన్నారనే అనుమానం

  • అరెస్టు చేస్తే తమ గుట్టూ రట్టవుతుందనే భయం

  • నిందితులకోసం ఎక్సైజ్‌ అధికారుల గాలింపు

  • అదుపులో ఏ-2 నిందితుడు కట్టా రాజు?

  • జయచంద్రారెడ్డి పీఏ రాజేశ్‌ కోసం గాలింపు

  • ఇబ్రహీంపట్నంలో జనార్దన్‌రావు బార్‌ సీజ్‌

  • నిందితుల కాల్‌ డేటా, బ్యాంక్‌ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి.. కీలక ఆధారాలు లభ్యం

విజయవాడ/తెనాలి/రాయచోటి/ములకలచెరువు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం తయారీ కేసులో వైసీపీ లింకులు బయటపడుతున్నాయి. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బయటపడిన మద్యం తయారీ ‘కేంద్రం’ లీజు తీసుకున్నదే వైసీపీ నేత. ఇక... మరో అనుమానితుడు జయచంద్రారెడ్డి పేరుకే టీడీపీ నాయకుడు! ఆయన మనసంతా వైసీపీయే అనే వాదనలున్నాయి. నిజానికి ఐదేళ్ల కిందట వైసీపీ హయాంలోనే ఈ ‘నకిలీ మకిలి’ మొదలైందని, తీగలాగితే తమ డొంకా కదులుతుందని పలువురు వైసీపీ నేతలు భయపడుతున్నారు. ఈ కేసులో ఏ-12 నిందితుడిగా ఉన్న తెనాలికి చెందిన వైసీపీ నాయకుడు కొడాలి శ్రీనివాసరావుకు ఆ పార్టీ నేతలు అండగా నిలబడ్డారు. ఆయన పట్టుబడితే నకిలీ మద్యం రాకెట్‌ వెనకున్న వైసీపీ నేతల పాత్ర బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో శ్రీనివాసరావు అరెస్ట్‌ కీలకంగా మారింది. సోమవారం గుంటూ రు ఎక్సైజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రవికుమార్‌, డీసీ శ్రీనివాస్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏఈఎస్‌ మారయ్యబాబులు మూడు బృందాలుగా ఏర్పడి తెనాలి, గుంటూరు, విజయవాడ కేంద్రాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలో ఉన్న జనార్దన్‌రావుకు చెందిన ఏఎన్‌ఆర్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు సీజ్‌ చేశారు. ఏ-2 కట్టా రాజును అదుపులోకి తీసుకుని ములకలచెరువుకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. జయచంద్రారెడ్డి పీఏ రాజేశ్‌ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.


కొడాలి పేరిటే లీజు...

శుక్రవారం తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియ్‌సగా తీసుకున్న ప్రభుత్వం దీని వెనుక ఎవరున్నా వదలొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన నిందితుడు జనార్దన్‌రావు, ఆయన ముఖ్య అనుచరుడు, ములకలచెరువు కల్తీమద్యం కేంద్ర మేనేజర్‌ కట్టా రాజు, టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తంబళ్లపల్లె నేత జయచంద్రారెడ్డి పీఏ రాజేశ్‌, కొడాలి శ్రీనివాసరావు బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలపై ఆరా తీసి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. నిందితుల ఫోన్‌ కాల్‌ డేటాపైనా ఆరా తీశారు. నకిలీ మద్యం తయారీ వెనుక సూత్రధారులు, పాత్రధారులు, సహకరించిన పెద్దలు, అఽధికారుల పాత్రపై ఇప్పటికే విచారణాధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌లో కొడాలి శ్రీనివాసరావు పేరుతో ములకలచెరువులో మూతపడిన ఓ డాబాను లీజుకు తీసుకున్నారు. పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగించి ప్రభుత్వం సరఫరా చేస్తున్న బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యం తయారు చేసి బెల్ట్‌ షాపులకు సరఫరా చేశారు. ఈ కేసులో పది మంది నిందితులను అరెస్టు చేశారు. కూటమి ప్రభుత్వం ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించింది. జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడును టీడీపీ నుంచి సస్పెండ్‌ చేశారు. పెద్దతిప్పసముద్రం (పీటీఎం) మండలంలో ఉన్న సురేంద్రనాయుడుకు చెందిన ఆంధ్రవైన్స్‌ దుకాణాన్ని అధికారులు సీజ్‌ చేశారు. రాజేశ్‌కు చెందిన ములకలచెరువులోని రాక్‌స్టార్‌ మద్యం షాపును సీజ్‌ చేశారు. నకిలీ మద్యం తయారీ, విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ములకలచెరువు ఎక్సైజ్‌ సీఐ హిమబిందురెడ్డి ఫోన్‌ కాల్‌డేటా, బ్యాంకు లావాదేవీలను విచారణాధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం తయారీ వ్యవహారం మొత్తం హిమబిందురెడ్డికి తెలుసని, నెలనెలా ఆమెకు రూ.10-15 లక్షలు మామూళ్లు వెళ్లేవనే ఆరోపణలున్నాయి. అయితే ఆమె అవినీతి బాగోతం బయటపడకుండా.. ఎక్సైజ్‌ శాఖలో ఓ జిల్లా అధికారి రక్షణ కల్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


జయచంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డిలపై కేసు?

టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డిపై ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. తంబళ్లపల్లె నియోజకవర్గంలో టెండర్ల ద్వారా పలు మద్యం దుకాణాలను జయచంద్రారెడ్డి అనుచరులే దక్కించుకున్నారు.

ఓటరుపై దాడి కేసులో శ్రీనివాసరావు ఏ-11

గత ఎన్నికల సమయంలో తెనాలిలో ఓటరుపై జరిగిన దాడి కేసులోనూ కొడాలి శ్రీనివాసరావు పాత్ర ఉంది. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఐతానగర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసేందుకు క్యూలో కాకుండా తన అనుచరులతో కలసి నేరుగా వెళ్లారు. లైన్‌లో రావాలని శివకుమార్‌ను అదే ప్రాంతానికి చెందిన ఎన్నారై గొట్టిముక్కల సుఽధాకర్‌ కోరారు. దీంతో సుధాకర్‌పై శివకుమార్‌ చేయి చేసుకోగా, తిరిగి సుధాకర్‌ కూడా ఆయన్ను చెంపదెబ్బ కొట్టారు. ఆ తర్వాత ఓటర్‌ సుధాకర్‌పై శివకుమార్‌ అనుచరులు పలు దఫాలుగా దాడిచేసి కొట్టారు. ఈ కేసులో కొడాలి శ్రీనివాసరావు ఏ-11 నిందితుడిగా ఉన్నారు.

రూ.25 లక్షల మద్యం స్వాధీనం

ములకలచెరువులో వెలుగుచూసిన నకిలీ మద్యం లింక్‌లు విజయవాడను తాకాయి. అక్కడ తయారైన నకిలీ మద్యాన్ని విజయవాడలో విక్రయించినట్లు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. గోదాములో ఉన్న సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన జనార్దనరావు నిర్వహిస్తున్న ఏఎన్‌ఆర్‌ బార్‌లో డిపోల నుంచి కొనుగోలు చేసిన కొద్దిపాటి మద్యం సీసాలను ప్రదర్శనలో ఉంచి, నకిలీ మద్యాన్ని విక్రయించేవారు. ఈ నకిలీ మద్యాన్ని భద్రపరచడానికి బార్‌కు ఎదురుగా ఉన్న వీధిలో ఒక గోదామును అద్దెకు తీసుకున్నారు. అధికారులు గోదాములో సోదాలు నిర్వహించి రూ.25 లక్షల విలువచేసే నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏఎన్‌ఆర్‌ బార్‌ను సీజ్‌ చేశారు. జనార్దన్‌పై భవానీపురం ఎక్సైజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Oct 07 , 2025 | 04:02 AM