Fake Liquor Case: డైరీలో నకిలీ లెక్కలు
ABN , Publish Date - Nov 23 , 2025 | 05:47 AM
రాష్ట్రంలో సంచలనం కలిగించిన నకిలీ మద్యం తయారీ కేసులో ‘లెక్కలు’ బయటపడుతున్నాయి. ఎవరెవరికి ఎంతెంత ఏ రూపంలో ముట్టిందో వెలుగుచూస్తోంది.
బాలాజీకి రూ.2.50 కోట్లకు పైగా చెల్లింపులు
ములకలచెరువు డెన్ నుంచే రూ.కోటి
నిందితుడు కట్టా రాజు డైరీలో వివరాలు
విజయవాడ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం కలిగించిన నకిలీ మద్యం తయారీ కేసులో ‘లెక్కలు’ బయటపడుతున్నాయి. ఎవరెవరికి ఎంతెంత ఏ రూపంలో ముట్టిందో వెలుగుచూస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దనరావు, ఆయన సోదరుడు జగన్మోహనరావు కస్టడీలో వెల్లడించిన వివరాలకు సంబంధించిన ఆధారాలను సిట్, ఎక్సైజ్ అధికారులు సేకరించినట్టు తెలిసింది. ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేయడానికి ఉపయోగించిన ఫార్ములాకు చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ, అతడి కుమారుడు సుదర్శన్‌కు రూ.2.50 కోట్లకు పైగా డబ్బులు అందినట్టు తేలింది. నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న కట్టా రాజు రాసుకున్న డైరీ ద్వారా ఈ లెక్కలు బయటికి వచ్చినట్టు సమాచారం. అద్దేపల్లి సోదరులను సిట్ అధికారులు రెండోసారి నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. ఈ విచారణ శనివారంతో ముగిసింది. ఇంతకుముందు వారం పాటు కస్టడీలో విచారించారు. మొదటిసారి కస్టడీలో సాగిన విచారణకు కొనసాగింపును ఈ నాలుగు రోజుల్లో చేశారు. విచారణ ముగిసిన తర్వాత నిందితులు ఇద్దరినీ ఆరో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి జి.లెనిన్‌బాబు ఇంటి ముందు హాజరుపరిచారు. అనంతరం జనార్దనరావును నెల్లూరు కేంద్ర కారాగారానికి, జగన్మోహనరావును విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. తాజా విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని విశ్వసనీయంగా తెలిసింది. జనార్దనరావు ఆఫ్రికాకు వెళ్లడానికి ముందు మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వెళ్లినట్టు మరోసారి స్పష్టం చేశాడు. సిట్, ఎక్సైజ్ అధికారులకు ఈవిధంగానే సమాచారం అందింది. దీన్ని నిర్ధారించేందుకు అధికారులు జోగి ఇంటి సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడానికి హార్డ్‌డి్‌స్కను స్వాధీనం చేసుకున్నారు. దీనికి పాస్‌వర్డ్ ఉండడం వల్ల తెరుచుకోలేదని తెలిసింది.
‘లెక్కల’ పుస్తకం
జనార్దనరావు 2021లో నకిలీ మద్యం తయారీకి శ్రీకారం చుట్టాడు. దీనికి సంబంధించిన ఫార్ములాను చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ అమలు చేసేవాడు. ఇంతకుముందు గోవా, బెంగళూరులోని డిస్టిలరీల్లో పనిచేసిన అనుభవంతో ఫార్ములాపై బాలాజీ పట్టు సాధించాడు. దీన్ని అద్దేపల్లికి ఇవ్వడానికి బాలాజీ అంగీకరించలేదు. మిశ్రమం మొత్తం తానే చేస్తానని, దానికి సంబంధించి డబ్బులు ఇవ్వాలని బాలాజీ చెప్పాడు. ఇందుకోసం అతడికి రూ.25 లక్షలు చెల్లించినట్టు జనార్దనరావు ఇంతకుముందు కస్టడీలో అంగీకరించాడు. ఫార్ములాతో ముడిసరుకుల మిశ్రమం చేసినందుకు బాలాజీ, అతడి కుమారుడికి రూ.2.50 కోట్లు అందినట్టు తేలింది. ఒక్క ములకలచెరువు డెన్ నుంచే రూ.కోటి వరకు తీసుకున్నట్టు గుర్తించారు. అటు ములకలచెరువు కేసులోను, ఇటు ఇబ్రహీంపట్నం కేసులోను నిందితుడిగా ఉన్న కట్టా రాజు రాసుకున్న డైరీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం డెన్ నుంచి దాదాపుగా రూ.30-40 లక్షల వరకు బాలాజీ, అతడి కుమారుడికి చెల్లింపులు చేసినట్టు డైరీలో రాజు రాసుకున్నాడు.
‘మూతల’ మనోజ్ మహా ముదురు
నకిలీ మద్యం తయారీ కేసులో కొద్దిరోజుల క్రితం వెలుగులోకి వచ్చిన పేరు మనోజ్‌కుమార్ జైన్ అలియాస్ ముతా మనోజ్. విజయవాడ వన్‌టౌన్‌లో పోలిశెట్టి వారి వీధిలో ప్లాస్టిక్ సీసాలు, మూతల వ్యాపారి. అద్దేపల్లి అన్నదమ్ములు వెల్లడించిన వివరాలతో మనోజ్ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు అద్దేపల్లి జనార్దనరావు ఎవరో తెలియదని బుకాయిస్తున్న అతడి లింకులను అధికారులు గుర్తించారు. ప్లాస్టిక్ సీసాలు, సిల్వర్ మూతలను అద్దేపల్లి జనార్దనరావుకు విక్రయించినట్టు నిర్ధారించారు. ఒక సిల్వర్ మూత 25-30పైసలు ఉంటుంది. ఒక్కో మూతను రూపాయి నుంచి రూ.1.50కు అద్దేపల్లికి సరఫరా చేశాడు. ఒక ప్లాస్టిక్ సీసా ఖరీదు రూపాయి నుంచి రూ.1.50 ఉంటే దాన్ని రూ.2.50 నుంచి 3 రూపాయలకు విక్రయించాడు. ఈ విధంగా జనార్దనరావు నుంచి రూ.లక్షలు ఆదాయంగా పొందాడు. అద్దేపల్లి సోదరుల బ్యాంక్ స్టేట్‌మెంట్లు వారి ముందు ఉంచి లెక్కలు చెప్పాలని ప్రశ్నించినప్పుడు మనోజ్ అధిక ధరల పాత్ర అధికారులకు చిక్కింది.
మనోజ్ కొఠారి కాదు.. ముతా మనోజ్
ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు రామును అరెస్టు చేసినప్పుడు అద్దేపల్లి సోదరులు ఇచ్చిన సమాచారంతో ఏ19గా మనోజ్ కొఠారి పేరును చేర్చారు. దీంతో అద్దేపల్లి సోదరులకు ప్లాసిక్ట్ సీసాలు, మూతలు సరఫరా చేసిన మనోజ్ కుమార్ జైన్ అలియాస్ ముతా మనోజ్ తెలివితేటలను ఉపయోగించడం మొదలుపెట్టాడు. జరిగిన పొరపాటును గుర్తించిన అధికారులు దాన్ని సరిచేసే ప్రక్రియ మొదలుపెట్టారు. కేసు డైరీలో ముతా మనోజ్‌కు బదులుగా మనోజ్ కొఠారి పేరు పేర్కొన్నామని, దాన్ని తొలగించి అసలు పేరును చేర్చామని ఆరో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో మెమో దాఖలు చేశారు.