Excise Department Raids: ఖర్చు 25.. దోపిడీ 75
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:13 AM
మేం ట్యాక్స్ పేయర్లం. మేం తాగకపోతే ప్రభుత్వాలు నడవవు’.. ఓ సినిమాలో హాస్య నటుడు సరదాగా చెప్పే డైలాగ్ ఇది. ఇందులో వాస్తవం లేకపోలేదు. ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల్లో అత్యధిక పన్నులు చెల్లించేది ఒక్క మద్యానికే.
నకిలీ మద్యం ముఠాకు కాసుల వర్షం
ఒక్కో సీసాపై అద్దేపల్లి గ్యాంగ్‌కు 50 శాతం
బ్లెండ్ సరఫరా చేసిన బాలాజీకి 20శాతం
ఎక్సైజ్ దాడుల్లో తేలింది రూ.1.68 కోట్లు
2023 నుంచే నకిలీ మద్యం దందా
అప్పట్నుంచి ఎన్ని కోట్లు సంపాదించారో?
ప్రభుత్వానికి వచ్చే పన్నులన్నీ వారి జేబుల్లోకి
ఒక్కో మద్యం క్వార్టర్ బాటిల్ తయారీకి అవసరమయ్యే బ్లెండ్ ఖర్చు రూ.15 లోపు ఉంటుంది. కానీ బెంగళూరుకు చెందిన బాలాజీ రూ.45కు అద్దేపల్లి సోదరులకు విక్రయించాడు. నకిలీ మద్యం నింపడానికి ప్లాస్టిక్ ఖాళీ సీసాకు ఒక రూపాయి, మూతకు మరో రూపాయి, బాటిల్‌పై అంటించే లేబుల్‌కు 20 పైసలు ఖర్చు చేశారు. బ్లెండ్, ఇతర ఖర్చు మొత్తం కలిపినా క్వార్టర్ బాటిల్‌కు రూ.48 మాత్రమే ఖర్చు అయ్యింది.
నకిలీ లిక్కర్ గ్యాంగ్ తమ మద్యం షాపుల్లో ఒక్కో బాటిల్‌ను రూ.100కు విక్రయించారు. ఒక్కో సీసాపై రూ.50కు పైగా లాభం అద్దేపల్లి సోదరులతో పాటు లిక్కర్ గ్యాంగ్‌కు వచ్చింది. బ్లెండ్ పంపిన బాలాజీకి రూ.20 చేరింది. ఇలా 2023లో వైసీపీ హయాంలో మొదలైన నకిలీ మద్యం దందాలో.. అప్పట్నుంచి మొన్నటి ఎక్సైజ్ దాడుల వరకు కోట్లలో సొమ్ము చేసుకున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘మేం ట్యాక్స్ పేయర్లం. మేం తాగకపోతే ప్రభుత్వాలు నడవవు’.. ఓ సినిమాలో హాస్య నటుడు సరదాగా చెప్పే డైలాగ్ ఇది. ఇందులో వాస్తవం లేకపోలేదు. ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల్లో అత్యధిక పన్నులు చెల్లించేది ఒక్క మద్యానికే. ప్రతి మద్యం సీసా మొత్తం ధరలో దాదాపు 75 శాతం ప్రభుత్వానికి పన్ను రూపంలో వస్తుంది. మద్యం వ్యాపారంలో ఉత్పత్తిదారులు, షాపుల లైసెన్సీలకు మిగిలే లాభంతో పోలిస్తే ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చేదే భారీగా ఉంటుంది. అద్దేపల్లి సోదరులు, లిక్కర్ గ్యాంగ్ చిన్నపాటి లాభాలతో సరిపెట్టకుండా అసలు పన్నులకే ఎసరు పెట్టాలనే ఉద్దేశంతో నకిలీ మద్యం దందా మొదలుపెట్టారు.
నకిలీ మద్యం ఉత్పత్తి, అమ్మకాలలో వారు చేసిన ఖర్చుకు, పొందిన లాభాలకు ‘కొండంత’ తేడా ఉంది. ప్రభుత్వం కళ్లుగప్పి అతి తక్కువ ఖర్చుతో అత్యధిక లాభాలు పొందారు. కొందరు రాజకీయ నేతలూ ఇందులో ఉన్నారనే అభియోగాలున్నాయి. నకిలీ మద్యం తయారీకి బ్లెండ్ సరఫరా చేసిన బెంగళూరుకు చెందిన బాలాజీకి కూడా భారీ లాభాలు వచ్చాయి. ఎక్సైజ్ శాఖ పరిశీలనలో ఈ అంశాలు వెలుగుచూశాయి. సిట్, ఎక్సైజ్ శాఖలు దీనిని నకిలీ మద్యం నేరంగా పరిగణించి మాత్రమే విచారణ చేస్తున్నాయి. ఇందులో ఆర్థిక లబ్ధి కోణంలో విచారణ జరగడం లేదని సమాచారం.
ఎలా తయారు చేశారంటే..
గోవా నుంచి బాలాజీ నకిలీ మద్యం తయారీకి అవసరమైన బ్లెండ్ సరఫరా చేశాడు. బ్లెండ్ అంటే బాటిలింగ్‌కు సిద్ధం చేసిన మద్యం ద్రావణం. ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కాహాల్(ఈఎన్‌ఏ) లేదా రెక్టిఫైడ్ స్పిరిట్‌తో మద్యం తయారు చేస్తారు. రెక్టిఫైడ్ స్పిరిట్‌ను మరింత ప్యూరిఫై చేస్తే ఈఎన్‌ఏగా మారుతుంది. ఏపీలో ఈఎన్‌ఏతోనే మద్యం ఉత్పత్తి చేయాలనే నిబంధన ఉంది. నకిలీ మద్యంలో ఈఎన్‌ఏ వాడారా? లేదా రెక్టిఫైడ్ స్పిరిట్ వాడారా? అనేది తెలియలేదు. దానికి కారెమెల్(ఫ్లేవర్), రంగు కలిపితే అది బ్లెండ్‌గా మారుతుంది. అయితే కారెమెల్, రంగు కలిపిన తర్వాత దాన్ని బ్లెండింగ్ ప్రాసెస్ చేయాలి. ఈ ప్రక్రియ గోవా లేదా కర్ణాటక రాష్ర్టాల్లో జరిగింది. అక్కడి నుంచి 30 లీటర్ల క్యాన్లలో బ్లెండ్‌ను ములకలచెరువు, ఇబ్రహీంపట్నం పంపించారు. ఇక్కడ దాన్ని బాటిలింగ్ చేసి విక్రయించారు.
ఎంత ఖర్చు పెట్టారంటే..
ఒక లీటరు బ్లెండ్‌తో 5.5 క్వార్టర్ సీసాల మద్యం తయారు చేశారు. ఒక్కో క్వార్టర్ ఉత్పత్తికి రూ.45 విలువైన బ్లెండ్ వినియోగించారు. ప్లాస్టిక్ ఖాళీ సీసాకు ఒక రూపాయి వెచ్చించారు. మూతకు మరొక రూపాయి, సీసాపై అంటించే లేబుల్‌కు 20 పైసలు ఖర్చు చేశారు. బ్లెండ్ కాకుండా ఇతర ఖర్చు రూ.3 కూడా అవ్వలేదు. మొత్తం కలిపినా సీసాకు రూ.48 ఖర్చు అయ్యింది. దానిని వారి మద్యం షాపుల్లో రూ.100కు విక్రయించారు. అందులో రూ.50కు పైగా లాభం అద్దేపల్లి సోదరులతో పాటు లిక్కర్ గ్యాంగ్‌కు వచ్చింది. ఒక్కో సీసా తయారీకి అవసరమయ్యే బ్లెండ్‌ను బాలాజీ రూ.45కు విక్రయించాడు. వాస్తవంగా ఒక క్వార్టర్ సీసా తయారీకి అయ్యే బ్లెండ్ ఖర్చు రూ.15 దాటదు. అక్రమంగా తీసుకురావడం వల్ల ఖర్చు పెరిగినా ఒక్కో సీసాకు అదనంగా రూ.10 నుంచి రూ.15 అవుతుంది. కానీ ఏకంగా రూ.45 వసూలు చేశాడు. బాలాజీకి పెట్టుబడి లేకుండా భారీ లాభం చేకూరింది.
ప్రభుత్వానికి సీసాకు 70 నష్టం
నకిలీ మద్యాన్ని అధికారిక షాపుల్లోనే అసలు మద్యం అని నమ్మించి అమ్మారు. అది నకిలీ మద్యం కాకపోయి ఉంటే వాటిపై పన్నులు ప్రభుత్వానికి వెళ్లేవి. ఒక్కో సీసాను రూ.100కు విక్రయించిన నకిలీ మద్యంలో అద్దేపల్లి సోదరులు, లిక్కర్ గ్యాంగ్‌కు రూ.50 వరకు, బాలాజీకి రూ.20 లాభం వచ్చింది. ఎక్సైజ్ దాడుల్లో సుమారు 5 వేల కేసుల మద్యం తయారు చేసినట్లు తేలింది. ఆ మేరకు ఖాళీ క్యాన్లు దొరికాయి. 5 వేల కేసుల మద్యం అంటే.. దాని విలువ సుమారు రూ.2.4 కోట్లు ఉంటుంది. అందులో ఖర్చు పోగా బాలాజీ, అద్దేపల్లి సోదరులు, ఇతర భాగస్వామ్యులకు రూ.1.68 కోట్లు వెళ్లింది. అయితే ఇది ఎక్సైజ్ దాడుల సమయంలో దొరికింది మాత్రమే. 2023లో ప్రారంభించిన నకిలీ మద్యం దందాలో ఎంతమేర మద్యం విక్రయించారనేది తేలాలి.
వైసీపీ హయాంలోనే మొదలు
వైసీపీ ప్రభుత్వంలో నకిలీ మద్యం దందా మొదలైంది. నకిలీ మద్యం విక్రయిస్తున్న ప్రాంతాల్లోని షాపులు, బార్లలో అమ్మకాలు తగ్గాయి. అమ్మకాలు ఎందుకు తగ్గాయనేది అప్పట్లోనే గుర్తించి ఉంటే ఈ దందా అప్పట్లోనే వెలుగులోకి వచ్చేది. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో అమ్మకాలు తగ్గినా ఎవరూ పట్టించుకోలేదు. మరోవైపు నకిలీ మద్యం దందా చేసినవారు చాలా తెలివిగా వ్యవహరించారు. చీప్ లిక్కర్‌లో తక్కువ ధర ఉండే మద్యం బ్రాండ్ల పేర్లతో తక్కువ ధర మద్యాన్నే అమ్మారు. ఎక్కువ ధర మద్యాన్ని నకిలీ చేస్తే అనుమానం వస్తుందని, అతి తక్కువ ధరకు అమ్మే బ్రాండ్లను ఎంచుకుని నకిలీ చేశారు.