Share News

Fake Liquor: నకిలీ మద్యం తీగ.. తెనాలిలో కదిలిన డొంక!

ABN , Publish Date - Oct 06 , 2025 | 03:32 AM

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బయటపడిన భారీ నకిలీ మద్యం రాకెట్‌లో కీలక నిందితుల కోసం ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వేట మొదలుపెట్టారు.....

Fake Liquor: నకిలీ మద్యం తీగ.. తెనాలిలో కదిలిన డొంక!

  • వైసీపీ హయాం నుంచీ యథేచ్ఛగా రాకెట్‌

తెనాలి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బయటపడిన భారీ నకిలీ మద్యం రాకెట్‌లో కీలక నిందితుల కోసం ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వేట మొదలుపెట్టారు. అక్కడ తీగ లాగితే గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ నేతల పాత్ర ఉన్న ఈ రాకెట్‌ డొంక కదులుతోంది. ముఖ్యంగా ఓ ప్రధాన వ్యక్తి పాత్రపై అనుమానంతో రెండ్రోజులుగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్‌ను ఈ నెల 3న కడప జిల్లా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే తమిళనాడు, ఒడిశాతో పాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్‌ వెనకున్న నలుగురు కీలక నిందితులు మాత్రం పరారీలో ఉన్నారు. వారిలో తెనాలి వాసి కొడాలి శ్రీనివాసరావు కూడా ఒకరు. ములకలచెరువులో ఈ రాకెట్‌ నడుపుతున్న పాత డాబా అద్దె ఒప్పందం ఇతడి పేరుపైనే ఉండడంతో ఈ కేసులో 12వ నిందితుడిగా చేర్చారు. ఈ వ్యవహారానికి సంబందించి ఆరా తీస్తుంటే.. విస్తుగొలిపే విషయాలు చాలానే వెలుగు చూస్తున్నాయని ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి ఈ రాకెట్‌ యఽథేచ్ఛగా సాగుతోందని, అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో సాగించిన దందాను.. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకుల అండతో కొనసాగిస్తున్నారని అంటున్నాయి. అప్పటి ఓ వైసీపీ కీలక నేతకు శ్రీనివాసరావు బంధువని, అతడి అండతోనే గత ప్రభుత్వంలోని ఐదేళ్లూ గుంటూరు జిల్లా తెనాలి, గుంటూరు, బాపట్ల జిల్లా రేపల్లె, చెరుకుపల్లి, నిజాంపట్నంలో నకిలీ మద్యం సీసాలను ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేసి డబ్బు వెనకేసుకున్నట్లు తెలిసింది. అప్పట్లో శ్రీనివాసరావే ములకలచెరువు నుంచి కొంత, తెలంగాణ మద్యం మరికొంత తీసుకొచ్చి దుకాణాలకు అందించినట్లు చెబుతున్నారు.


శ్రీనివాసరావు బంధువు కారులో ఈ మద్యం బాక్సులు తీసుకొచ్చి ప్రభుత్వ మద్యం దుకాణాలకు అందించేవాడు. ప్రస్తుతం అదే కారులో పరారయ్యాడని అనుమానిస్తున్నారు. తెనాలిలో ఒక్క కేసు కూడా లేకుండా చేసుకున్నాడని, వైసీపీ హయాంలో సాగించిన దందాను ఇప్పుడు కూడా నడుపుతున్నాడని అంటున్నారు. అయితే తెనాలి ప్రాంతంలో మద్యం సరఫరా చేసిన దాఖలాలు లేవని ఎక్సైజ్‌ అధికారులు చెబుతుండగా.. ఇప్పటికీ తెనాలి, గుంటూరు, రేపల్లె ప్రాంతాల్లో దుకాణాలకు ఆయా ప్రాంతాల్లోని టీడీపీ నేతల అండతో సాగిస్తున్నాడని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల క్రితం దుగ్గిరాల దగ్గర నకిలీ మద్యం లోడుతో ఒక ట్రక్‌ పట్టుబడిన వ్యవహారంలోనూ ఇతడి పాత్ర ఉందని కేసు నమోదైందని.. అయితే వైసీపీ నేతల అండతో అరెస్టు కాకుండా, కేసు మాఫీ చేసే ప్రయత్నాలు చేశాడని చెబుతున్నారు. కృష్ణా జిల్లాలోనూ ఇతడి ఎన్నారై బంధువుకు సంబంధించి 3 మద్యం దుకాణాలు ఉన్నాయని, వాటి ద్వారా కూడా నకిలీ మద్యం రాకెట్‌ నడిపినట్లు సమాచారం. ఈ దందాలో శ్రీనివాసరావే కీలక నిందితుడా.. లేక ఎవరైనా వైసీపీ నేతలకు బినామీగా ఉన్నాడా.. పెట్టుబడులు పెడుతున్న ఎన్నారైలకు బినామీగా వ్యవహరించాడా అనే దిశగా దర్యాప్తు జరుగుతోంది.

కొడాలి కేంద్రాలపై అధికారుల కన్ను!

తెనాలి ఐతానగర్‌లో శ్రీనివాసరావు కుటుంబం నివాసం ఉంటోంది. అందులో అధికారులు శని, ఆదివారాల్లో సోదాలు నిర్వహించారు. అతడు తన బంధువు వాహనంలో శనివారమే పరారైనట్లు సమాచారం రావడంతో అతడి స్వగ్రామం బాపట్ల జిల్లా గూడవల్లితో పాటు గుంటూరు, విజయవాడ నగరాల్లోని అతడి కేంద్రాలపై దృష్టిపెట్టినట్లు సమాచారం. ఇతడు పట్టుబడితే వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన నకిలీ మద్యం గుట్టు చాలావరకు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి మారయ్యబాబు స్పందిస్తూ.. అన్నమయ్య జిల్లా అధికారులు సమాచారం ఇవ్వడంతో సోదాలు నిర్వహించామని.. శ్రీనివాసరావు ఇంటిలో ఎటువంటి మద్యం సీసాలూ దొరకలేదని తెలిపారు. అతడు కీలక నిందితుల్లో ఒకరు కావడంతో ముమ్మరంగా గాలింపు చేపట్టామని, గత చరిత్ర కూడా తెలుసుకునేందుకు లోతుగా విచారణ జరుపుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో నకిలీ మద్యం దందా నిర్వహించిన ఇతడి వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Oct 06 , 2025 | 03:32 AM