Excise Department Investigation: జోగి చెప్పాడు.. మేం చేశాం
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:07 AM
మాజీ మంత్రి జోగి రమేశ్ చెప్పాడు.. మేము నకిలీ మద్యం తయారీ ప్రారంభించాం. అప్పులపాలైన మాకు నకిలీమద్యం తయారు చేయాలని సలహా ఇచ్చింది ఆయనే.
ఆయన ప్రోత్సాహంతోనే నకిలీ మద్యం తయారీ
ఎక్సైజ్ విచారణలో ఏ1 జనార్దన్‌రావు వెల్లడి
రాయచోటి/ములకలచెరువు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘‘మాజీ మంత్రి జోగి రమేశ్ చెప్పాడు.. మేము నకిలీ మద్యం తయారీ ప్రారంభించాం. అప్పులపాలైన మాకు నకిలీమద్యం తయారు చేయాలని సలహా ఇచ్చింది ఆయనే. ఆయన ప్రోత్సాహంతోనే ములకలచెరువులో నకిలీ మద్యం తయారు చేశాం’’ అని నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావు వెల్లడించినట్లు తెలిసింది. ఎక్సైజ్ అధికారుల విచారణలో ఆయన కీలక విషయాలు చెప్పినట్టు సమాచారం. అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నవంబరు 28న అరెస్టై మదనపల్లె సబ్‌జైలులో ఉన్న జనార్దన్‌రావు (ఏ1)తో పాటు ఆయన తమ్ముడు జగన్‌మోహన్‌రావు(ఏ26), తాండ్ర రమేశ్ (ఏ28), తిరుమలశెట్టి శ్రీనివాసరావు (ఏ27), షేక్ అల్లాబక్షు(ఏ29)లను మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి ఉమర్ ఫరూక్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఐదుగురు నిందితులను శుక్రవారం ఎక్సైజ్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం విచారణ నిమిత్తం మదనపల్లె ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ కడప ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర నిందితులను సుదీర్ఘంగా విచారించారు. ‘‘జోగి రమేశ్ చెప్పడంతో 2023లో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ ప్రారంభించాం. ఆయన చెప్పడంతోనే ములకలచెరువులోనూ నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టాం’’ అని జనార్దన్‌రావు వెల్లడించినట్లు తెలిసింది. మిగిలిన నిందితులను కూడా విచారించారు. మరో రెండు రోజులు వీరిని విచారించనున్నారు. కాగా అద్దేపల్లి జనార్దన్‌రావును విచారించేందుకు శనివారం విజయవాడ నుంచి సిట్ ఉన్నతాధికారులు మదనపల్లెకు రానున్నట్లు తెలిసింది.