Jagan Liquor Scam: మకిలి చరిత్ర మరిచి...
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:32 AM
మద్యాన్నే ఆదాయ మార్గంగా ఎంచుకుని... కనీవినీ ఎరుగని రీతిలో ముడుపులు దండుకుని... అదే సొమ్ములతో మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు స్కీములు రచించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే నేడు నకిలీ మద్యం అంటూ రచ్చ చేస్తున్నారు.
నకిలీ మద్యంపై జగన్ రాజకీయం
ప్రభుత్వ పెద్దలకు ముడిపెట్టే ప్రయత్నాలు
తయారీ కేంద్రాన్ని బయటపెట్టిందే నేటి ప్రభుత్వం
వారూవీరూ అని లేకుండా సొంత నేతలపైనా చర్యలు
క్షణం ఆలస్యం చేయకుండా ఇద్దరిపై సస్పెన్షన్ వేటు
వివాదాస్పదులను ఏ మాత్రం ఉపేక్షించని చంద్రబాబు
నాడు.. అరాచకవాదులకు జగన్ ప్రోత్సాహం
దళిత డ్రైవర్ శవాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబు
ఆయనను ఇంటికి పిలిచి భోజనం పెట్టిన జగన్
చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగికి పదవి
జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం చావులపై చర్యలు నిల్
మల్లాది బార్‌లో ఆరుగురు మృతి.. ఆయనకు టికెట్
ఎంత తేడా?
ములకలచెరువులో ‘నకిలీ’ మద్యం తయారీ కేంద్రాన్ని కనిపెట్టిందీ.. కేసు కట్టిందీ.. కూటమి ప్రభుత్వంలోని ఎక్సైజ్ అధికారులు! నిందితుల కోసం వేట మొదలుపెట్టింది.. ఏపీ పోలీసులు! ఈ దందాతో సంబంధమున్న టీడీపీ నేతలపై క్షణం ఆలోచించకుండా సస్పెన్షన్ వేటు వేసింది ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు! అయినా సరే.. నకిలీ మద్యం తయారీ వెనుక ప్రభుత్వ పెద్దలే ఉన్నారని చిలవలు పలవలు అల్లడం జగన్ రోత మీడియాకే చెల్లింది! అదంతా పక్కనపెట్టండి! ఇదే దందా వైసీపీ హయాంలో వైసీపీ నేతలు చేసి ఉంటే ఏం జరిగేది? ఒక్క క్షణం ఆలోచించండి! నాటి ప్రభుత్వ శాఖలు పట్టించుకునేవే కావు. మీడియా బయటపెట్టినా... స్పందించేవారూ కారు! పైగా... ఇలాంటి ‘దందా’కోరులను పిలిచి పదవులిచ్చి సత్కరించిన నేపథ్యం వైఎస్ జగన్‌ది! నాటికీ... నేటికీ తేడా ఇది!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
మద్యాన్నే ఆదాయ మార్గంగా ఎంచుకుని... కనీవినీ ఎరుగని రీతిలో ముడుపులు దండుకుని... అదే సొమ్ములతో మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు స్కీములు రచించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే నేడు ‘నకిలీ మద్యం’ అంటూ రచ్చ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో ఎక్సైజ్ అధికారులు బయటపెట్టిన నకిలీ/అనధికార మద్యం తయారీ కేంద్రాన్ని ప్రభుత్వ పెద్దలతో ముడిపెట్టేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ‘దీని వెనక ఎవరున్నా వదలొద్దు’ అని ప్రభుత్వం సూటిగా ఆదేశించడంతో ఎక్సైజ్, పోలీసు అధికారులు పార్టీలతో సంబంధం లేకుండా నిందితుల కోసం వేట ప్రారంభించారు. జగన్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా రాజకీయ కోణంలో బురదజల్లడంపైనే దృష్టి సారించారు. నాడు... దందాలు, దాడులు, హత్యలు చేసిన వారికి పదవులిచ్చి జగన్ ప్రోత్సహించారు! నేడు... కూటమి ప్రభుత్వంలో తరతమ భేదాలు చూడకుండా చర్యలు తీసుకుంటున్నారు!
నాడు కల్తీ మద్యమే లేదా?
జగన్ సోమవారం తాను ఎంపిక చేసుకున్న మీడియాతో మాట్లాడుతూ.. తన హయాంలో కల్తీ మద్యమే లేదని గొప్పలు చెప్పారు. కానీ ఆయన హయాంలోనే జంగారెడ్డిగూడెంలో 2022 మార్చిలో కల్తీ మద్యం తాగి 27 మంది చనిపోయారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అసెంబ్లీ సాక్షిగా వాటిని కరోనా అనంతర మరణాల ఖాతాలో వేసేశారు. అసలు విషయం బయటపడుతుందని మృతుల పోస్టుమార్టం నివేదికలను కూడా రహస్యంగా ఉంచారు. ఈ మరణాలకు కారణమైన ఏ ఒక్కరిపైనా చర్యలు లేవు. ఇక... విజయవాడ కృష్ణలంకలో 2015 డిసెంబరు 8న నాటి కాంగ్రెస్ నాయకుడు మల్లాది విష్ణుకు చెందిన బార్‌లో కల్తీ మద్యం తాగి ఏకంగా ఆరుగురు మరణించారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి... తాము అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తామని ప్రకటించారు. అక్కడ సీన్ కట్ చేస్తే... 2018లో మల్లాది విష్ణును వైసీపీలో చేర్చుకున్నారు. 2019లో విజయవాడ సెంట్రల్ టికెట్ కూడా ఇచ్చారు. జగన్ చేసిన మద్య నిషేధ ప్రకటన కూడా గాల్లో కలిసిపోయింది. ముడుపులు దండుకునేందుకు వీలుగా... మద్యం విధానాన్నే మార్చేశారు. కమీషన్లు ఇచ్చిన వారి సరుకు మాత్రమే కొన్నారు. సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ దుకాణాల్లో అత్యంత నాసిరకం మద్యం విక్రయించి... జనం ప్రాణాలతో ఆడుకున్నారు. దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్‌కు అనుమతించలేదు. నాటి లిక్కర్ దందాలోని అన్ని కోణాలను నేడు ‘సిట్’ బయటపెడుతోంది. మద్యం విషయంలో మకిలిని తన వెనుక పెట్టుకున్న వారే... నేడు నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ప్రభుత్వ పెద్దలతో ముడిపెట్టడానికి ప్రయత్నిస్తుండటం గమనార్హం.
నాడు: అరాచకాలకు ప్రోత్సాహం...
తప్పు చేసిన వారిని దూరం పెట్టడం, మరీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై వేటు వేయడం చంద్రబాబు అనుసరించే విధానం! జగన్ ఇందుకు పూర్తిగా రివర్స్! తప్పు చేసిన వారిని పిలిచి భుజం తట్టి, పదవులిచ్చిన సంస్కృతి ఆయనది.
వైసీపీ హయాంలో ఎమ్మెల్యే జోగి రమేశ్ నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి తెగబడ్డారు. ఆయనకు జగన్ మంత్రి పదవిని కానుకగా ఇచ్చారు.
తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఓ దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే... ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇంటికి పిలిచి భోజనం పెట్టి అక్కున చేర్చుకున్నారు.
హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ 2022లో ఓ మహిళకు న్యూడ్ వీడియోకాల్ చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఆయనపైనా జగన్ కనీస చర్యలు తీసుకోలేదు. మందలించనూ లేదు. వివాదాస్పద కాల్స్‌లో దొరికిపోయిన అంబటి, అవంతి మీదా ఎలాంటి చర్యలు లేవు.
సొంత చెల్లెలు షర్మిల మీద వైసీపీ నేత వర్రా రవీంద్రా రెడ్డి, ఇతర వైసీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా నీచపు రాతలు రాసినా జగన్ పట్టించుకోలేదు. ముంబై నటి కాదంబరి జత్వానీని దారుణంగా వేధించి, ఆమెపై తప్పుడు కేసులు పెట్టిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను... దీనికి సహకరించిన పోలీసు అధికారులనూ కాపాడుకుంటూ వచ్చారు. ‘ఇది తప్పు’ అని ఖండించిన వారు లేరు.
పల్నాడులో బీసీ వర్గానికి చెందిన చంద్రయ్యను వైసీపీ హయాంలో పట్టపగలు నడిరోడ్డుపై నరికి చంపారు. గ్రామంలో టీడీపీ జెండాను నిలబెట్టడమే ఆయన చేసిన ‘నేరం’! ఈ హత్య వెనుక నాటి వైసీపీ నేతల ప్రత్యక్ష హస్తం, ప్రోత్సాహం ఉన్నట్లు తెలిసినా చర్యలు లేవు. ప్రొద్దుటూరులో టీడీపీకి చెందిన నందం సుబ్బయ్య అనే బీసీ నేత హత్య వెనుక ఉన్న వైసీపీ పెద్దలకూ జగన్ అండగా నిలిచారు.
నేడు: అతి చేస్తే అరదండాలే
సొంత చెల్లిని సొంత పార్టీ వారే అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో బూతులు తిట్టినా జగన్ పట్టించుకోలేదు. కానీ... జగన్ సతీమణి వైఎస్ భారతిపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం వెనువెంటనే స్పందించింది. కిరణ్ వ్యాఖ్యలు పార్టీ నైతిక ప్రమాణాలకు పూర్తి వ్యతిరేకమని భావించి... అటువంటి నీచప్రవర్తనను టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో సహించదని చంద్రబాబు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. పోలీసులు కిరణ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు.
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన వెంటనే... వాటిలో నిజానిజాలు ఏమిటనేవి కూడా పరిశీలించకుండానే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
నకిలీ మద్యం తయారీ విషయంలోనూ అదే జరుగుతోంది. దీనిని బయటపెట్టింది కూటమి ప్రభుత్వంలోని అధికారులే. ఇందులో సొంత పార్టీ వారు ఉన్నా చర్యలకు ప్రభుత్వం వెనుకాడలేదు. తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, మరో టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడిపై ఆరోపణలు వచ్చిన వెంటనే వారిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. అదే వైసీపీ పార్టీ అయితే వాళ్లకే మద్యం కాంట్రాక్టు ఇచ్చేవారని టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.