Share News

Excise Police Report: కల్తీ కిక్కులో కొత్త కోణం

ABN , Publish Date - Oct 08 , 2025 | 04:25 AM

నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్‌ సొంత బార్‌ నడుపుతూ అప్పులఊబిలో కూరుకుపోయాడా అందులో నుంచి బయటపడడానికి ‘సొంతంగా’ మద్యం తయారు చేసేందుకు సిద్ధమయ్యాడా..

Excise Police Report: కల్తీ కిక్కులో కొత్త కోణం

  • నకిలీ డిస్టిలరీ ఏర్పాటుకు వైసీపీ టైంలోనే జనార్దన్‌ యత్నాలు

  • వైసీపీ హయాంలోనే సన్నాహాలు.. సొంత బార్‌లో ఐదు కోట్లు నష్టం

  • పూడ్చుకోవడానికి అడ్డదారులు.. దక్షిణాఫ్రికాకు పరార్‌!

  • సోదరుడు సహా ముగ్గురి అరెస్టు.. కాకినాడ ల్యాబ్‌కు ‘నకిలీ’ నమూనాలు!

(విజయవాడ - ఆంధ్రజ్యోతి)

నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్‌ సొంత బార్‌ నడుపుతూ అప్పులఊబిలో కూరుకుపోయాడా? అందులో నుంచి బయటపడడానికి ‘సొంతంగా’ మద్యం తయారు చేసేందుకు సిద్ధమయ్యాడా? ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారీ ప్లాంట్‌ కోసం వైసీపీ హయాంలోనే సన్నాహాలు మొదలుపెట్టాడా?... అంటే అవుననే ఎక్సైజ్‌ వర్గాలు సమాధానం ఇస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలోని బార్‌ నుంచి సరుకు సీజ్‌ వరకు జరిగిన ప్రక్రియపై ఎక్సైజ్‌ డీసీ ఎస్‌.శ్రీనివాసరావు, ఈఎస్‌ కె.శ్రీనివాసరావు ఒక నివేదికను తయారు చేశారు. దానిని మంగళవారం ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయానికి పంపారు. ఎక్సైజ్‌ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. కరోనా సమయంలో జనార్దన్‌ బాగా అప్పులపాలయ్యారు. ఇబ్రహీంపట్నం బార్‌ నష్టాల్లో కూరుకుపోయింది. రూ. ఐదు కోట్లు నష్టపోయారు. దీంతో నకిలీ డిస్టిలరీ ఏర్పాటుచేసి డబ్బులు సంపాదించాలని ఆలోచించారు. బార్‌ ఉన్న ప్రాంతానికి సమీపంలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని నెమ్మది నెమ్మదిగా పరికరాలను అమర్చడం మొదలుపెట్టారు. గతంలో జనార్దన్‌ దక్షిణాఫ్రికాలో నకిలీ మద్యం వ్యాపారం చేశారు. ఆ అనుభవంతోనే మినీ డిస్టలరీ ఏర్పాటుకు పూనుకున్నారు. జనార్దన్‌ తెలుగుదేశం నాయకుడిగా స్థానికంగా చలామణి అయినప్పటికీ వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలు నడిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్నారు. జనార్దన్‌ సోదరుడు జగన్మోహనరావుతోపాటు బార్‌లో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన బాదల్‌ దాస్‌, ప్రదీప్‌ దాస్‌ అనే ఇద్దరిని భవానీపురం ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఆరో మెట్రోపాలిటన్‌ కోర్టులో మంగళవారం హాజరుపరచగా, కోర్టు 17వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. అనంతరం వారిని నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు.


నకిలీ మద్యాన్ని ములకలచెరువు నుంచి ఇబ్రహీంపట్నం తీసుకురావడం, ఇక్కడ విక్రయించడం వంటి పనులు ప్రదీప్‌ దాస్‌, బాదల్‌ దాస్‌ చేసేవారు. ములకలచెరువు నకిలీ సరుకును.. బార్‌ మూసివేశాక మద్యం కోసం వచ్చేవారికి విక్రయించేవారని అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని జగన్మోహనరావు వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది. జనార్దన్‌ దక్షిణాఫ్రికాలో ఉన్నట్టు కొందరు.. హైదరాబాద్‌లోఉన్నారని మరికొంతమంది చెబుతున్నారు. కాగా ఇబ్రహీంపట్నంలో గోదాము నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ మద్యం నమూనాలను కాకినాడ రీజనల్‌ ఎక్సైజ్‌ ల్యాబ్‌(ఆర్‌ఈఎల్‌)కు పంపాలని అధికారులు నిర్ణయించారు.

Updated Date - Oct 08 , 2025 | 07:18 AM