జోగి మెడకు నకిలీ మద్యం ఉచ్చు!
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:21 AM
మాజీ మంత్రి జోగి రమేశ్ మెడకు నకిలీ మద్యం ఉచ్చు బిగుస్తోంది. అద్దేపల్లి జనార్దనరావు విడుదల చేసిన వీడియో వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వైపీపీ ప్రభుత్వ హయాం నుంచి నకిలీ మద్యం తయారు చేశారు. అనేక మంది ఈ మద్యం తాగి ప్రాణాలు కొల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆది నుంచి జోగి రమేశ్ అనేక వివాదాల్లో ఉన్నారు. నాడు చంద్రబాబు ఇంటిపైన దాడికి యత్నించారు. అగ్రిగోల్డ్ భూముల కబ్జాలోనూ ఉన్నారు.
- రమేశ్ పేరు ప్రస్తావిస్తూ వీడియో విడుదల చేసిన జనార్దనరావు
- వైసీపీ హయాంలో నకిలీ మద్యానికి అనేక కుటుంబాలు బలి
- ఆది నుంచి అనేక వివాదాల్లో జోగి రమేశ్
- నాడు చంద్రబాబు ఇంటిపైన దాడికి యత్నం
- అగ్రిగోల్డ్ భూముల కబ్జా కేసులోనూ ఆరోపణలు
మాజీ మంత్రి జోగి రమేశ్ మెడకు నకిలీ మద్యం ఉచ్చు బిగుస్తోంది. అద్దేపల్లి జనార్దనరావు విడుదల చేసిన వీడియో వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. వైపీపీ ప్రభుత్వ హయాం నుంచి నకిలీ మద్యం తయారు చేశారు. అనేక మంది ఈ మద్యం తాగి ప్రాణాలు కొల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆది నుంచి జోగి రమేశ్ అనేక వివాదాల్లో ఉన్నారు. నాడు చంద్రబాబు ఇంటిపైన దాడికి యత్నించారు. అగ్రిగోల్డ్ భూముల కబ్జాలోనూ ఉన్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
నకిలీ మద్యం తయారీ మూలాల వెనుక మాజీ మంత్రి జోగి రమేశ్ ఉన్నాడని జనార్దనరావు బాంబు పేల్చటంతో జోగి చుట్టూ మరో వివాదం ముసురుకుంది. ఇప్పటికే చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నం, అగ్రిగోల్డ్ భూముల కబ్జా కేసుల్లో ఉన్నారు. తాజాగా నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నకిలీ మద్యంపై సిట్‌ను కూడా ఏర్పాటు చేయటంతో సమగ్ర విచారణ జరిపి నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. అవసరమైతే అరెస్టులు కూడా చేసి కస్టడీ కోరనుంది. సిట్ విచారణతో కల్తీ మద్యం గుట్టు తేలే అవకాశం ఉంది. జనార్దనరావు వైసీపీ హయాంలో తాను కల్తీ మద్యం చేసినట్టుగా చెప్పటంతో కల్తీ మద్యం ఎక్కడ పుట్టిందన్నది అర్థమవుతోంది. అప్పట్లో కల్తీ మద్యం ఎవరెవరి సహకారంతో చేశారన్నది సిట్ విచారించనుంది. జనార్దనరావు జోగి రమేశ్ పేరును ప్రధానంగా ప్రస్తావించటంతో పాటు ఆయన ఆధ్వర్యంలోనే తాను నకిలీ మద్యాన్ని తయారు చేసినట్టు అంగీకరించటంతో.. జోగి పాత్రపై సమగ్ర విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భయపడి నకిలీ మద్యం తయారీని తాను మానుకున్నానని, జోగి రమేశ్ తనకు ఫోన్ చేసి నకిలీ మద్యం తయారీకి పురికొల్పారని, టీడీపీ ప్రభుత్వాన్ని బ్రష్టుపట్టించటానికి తనతో నకిలీ మద్యం తయారు చేయించారని, ఇబ్రహీంపట్నంలోనే తాను తయారు చేయాలనుకున్నా.. ప్రభుత్వంపై బురద చల్లటానికి తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని ఎంచుకున్నానని టీడీపీ ఎమ్మెల్యే జయచంద్రారెడ్డికి సంబంధం లేదని జోగి రమేశ్ తనను నమ్మించి మోసం చెయ్యటంతోనే తాను నిజం చెబుతున్నానని వీడియో విడుదల చేయటంతో జనార్దనరావు, జోగి రమేశ్‌ల బంధం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది.
జోగి, అద్దేపల్లి చిన్నప్పుడు ఒక బజారులోనే ఉండేవారు :
జోగి రమేశ్, జనార్దనరావు ఇద్దరిదీ ఇబ్రహీంపట్నం కావటం గమనార్హం. రింగ్ సెంటర్ దగ్గర జోగి రమేశ్ ఉన్నపుడు జనార్దనరావు తాత ఇల్లు కూడా ఉండేది. జోగికి, జనార్దనరావుకు పరిచయమే లేదన్నది హాస్యాస్పదంగానే ఉంది. అద్దేపల్లి జనార్దనరావు వీడియో విడుదల చేసిన కొద్ది గంటలకే జోగి రమేశ్ తన నివాసంలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశాడు. ఈ ప్రెస్‌మీట్‌లో అద్దేపల్లి జనార్దనరావుతో తనకు పరిచయమే లేదని బొంకారు. నకిలీ మద్యం కేసులు పట్టుబడక ముందు జనార్దనరావు జోగి రమేశ్‌ను కలవటానికి వచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు జోగి రమేశ్ వచ్చాడేమో ? బయటున్నాడేమో అంటూ వ్యాఖ్యానించారు. మా తాత, వాళ్ల తాత ఒకే బజారులో ఉండేవారంటూ చెప్పుకొచ్చారు.
అంతా జోగే నని అద్దేపల్లి అంటుంటే.. బట్టలూడదీస్తామంటూ జోగి రంకెలు :
ఒకవైపు జనార్దనరావు కథ - స్ర్కీన్‌ప్లే - డైరెక్షన్ అంతా జోగి రమేశ్ అని చెబుతుంటే ఆయన మాత్రం ప్రెస్‌మీట్‌లో అంతా చంద్రబాబు అని ఆరోపించారు. రిమాండ్ రిపోర్టులో తన పేరు లేదని జోగి వాదించారు. దర్యాప్తులో భాగంగా తదుపరి రిమాండ్ రిపోర్టులో జోగిని చేర్చటానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా జోగి రిమాండ్ రిపోర్టులో తన పేరు లేదంటూ చెప్పుకొచ్చారు. కృష్ణాజిల్లా తన అడ్డా.. గడ్డ అంటూ పేర్కొంటూ తాను రాజశేఖరరెడ్డి అనుచరుడినని, క్షణికానందం కోసం నన్ను అరెస్టు చేయించవచ్చేమో కానీ తర్వాత మీ బట్టలూడదీస్తాం అంటూ రంకెలు వేశారు. రెడ్‌బుక్‌ను ఫైర్ చేస్తానంటూ అరిచారు.
సీబీఐ ఎంక్వయిరీ డిమాండ్ చేయటంలో ఆంతర్యం ఏమిటి ?
మాజీ మంత్రి జోగి రమేశ్ గత మూడు రోజులుగా ఏదో ఒక సందర్భంలో సీబీఐ ఎంక్వయిరీని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం రాత్రి మైలవరంలో సిట్ విచారణలు కాదని, సీబీఐ ఎంక్వయిరీలు చేయించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం మైలవరంలో ఎక్సైజ్ కార్యాలయంలో మహిళలతో కలిసి వినతిపత్రం ఇచ్చిన సందర్భంలో కూడా జోగి సిట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మీ సిట్‌లు వల్ల ఉపయోగం లేదని సీబీఐ ఎంక్వయిరీ కోరారు. సిట్ వేస్తారని ముందుగానే జోగికి ఎలా లీకైందన్నది ప్రశ్నార్థకంగా ఉంది.
అద్దేపల్లిని జోగి అడ్డంగా ఇరికించాడా?
రాజకీయ ప్రయోజనాల కోసం అద్దేపల్లిని మాజీ మంత్రి జోగి పావుగా వాడుకున్నాడా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జనార్దనరావు నకిలీ మద్యం తయారు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చాక కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. టీడీపీ ఎమ్మెల్యే జయచంద్రారెడ్డితో పాటు మరికొందరిని సస్పెండ్ చేసింది. దీంతో పాటు బాధ్యులైన వారిని ఎవ్వరినీ వదలవద్దని ఆదేశించటంతో .. అద్దేపల్లి తాను కేసులో ఇరుక్కుపోయానని భావించి లొంగిపోయాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయాన్ని జనార్దనరావు కూడా తన వీడియోలో ప్రస్తావించాడు. తనను దక్షిణాఫ్రికా పంపించింది కూడా జోగి రమేశ్ అని, తనను బెయిల్ మీద బయటకు తీసుకువస్తానని చెప్పి పట్టించుకోలేదని చెప్పటంతో జోగి రమేశ్, అద్దేపల్లి జనార్దనరావును పావుగా ఉపయోగించుకున్నాడా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.