Share News

Fake Liquor Scam: ఇబ్రహీంపట్నంలోనూ నకిలీ యూనిట్‌

ABN , Publish Date - Oct 09 , 2025 | 06:00 AM

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఎన్టీఆర్‌ జిల్లాలో అమ్మారు. అంతేగాక ఇబ్రహీంపట్నంలోనూ మద్యం తయారీ యూనిట్‌ను తెరిచారు.

Fake Liquor Scam: ఇబ్రహీంపట్నంలోనూ నకిలీ యూనిట్‌

  • మూడు నెలలుగా నకిలీ మద్యం తయారీ

  • ప్రధాన నిందితుడు జనార్దనరావుకు సోదరుడి అండ

  • బెంగళూరు నుంచి స్పిరిట్‌, సీల్స్‌, మూతలు, మిషనరీ

  • హైదరాబాద్‌ నుంచి నకిలీ లేబుళ్లు సరఫరా

  • జనార్దనరావు బార్‌, ఆయన భాగస్వామిగా ఉన్న శ్రీనివాస వైన్స్‌లో అమ్మకాలు

  • ఎన్టీఆర్‌ జిల్లా ఎక్సైజ్‌ అధికారుల రిమాండ్‌ రిపోర్టు

విజయవాడ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా ములకలచెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఎన్టీఆర్‌ జిల్లాలో అమ్మారు. అంతేగాక ఇబ్రహీంపట్నంలోనూ మద్యం తయారీ యూనిట్‌ను తెరిచారు. ఇబ్రహీంపట్నంలోని ఏఎన్‌ఆర్‌ బార్‌లో కనిపించిన నకిలీ మద్యం మరకలు విజయవాడలోని ఓ వైన్‌ షాపులో కనిపించాయి. బార్‌ యజమాని, నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు భాగస్వామ్యంతో నడుసున్న విజయవాడ విద్యాధరపురంలో ఉన్న శ్రీనివాస వైన్స్‌లో నకిలీ మద్యం విక్రయించినట్టు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో వైన్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న అంగులూరి కల్యాణ్‌ కీలకంగా వ్యవహరించాడు. ప్రతివారం 15 కేసుల నకిలీ మద్యాన్ని జనార్దనరావు వద్ద నుంచి కొనుగోలు చేసేవాడు. ఆ సరుకుని శ్రీనివాస వైన్స్‌లో ఉంచి అమ్మేవాడు. ఇలా వచ్చిన ఆదాయంలో సగ భాగాన్ని కల్యాణ్‌ తీసుకునేవాడు. ఎక్సైజ్‌ పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఈ విషయాన్ని పేర్కొన్నారు. విద్యాధరపురంలో ఉన్న శ్రీనివాస వైన్స్‌ షాపు లైసెన్స్‌ జనార్దనరావు స్నేహితుడి పేరు మీద ఉంది. మూడు నెలలుగా ఏఎన్‌ఆర్‌ బార్‌లోనే కాకుండా శ్రీనివాస వైన్స్‌లోనూ నకిలీ మద్యం విక్రయించినట్టు ఎక్సైజ్‌ అధికారులు నిర్ధారించారు.


బెంగళూరు నుంచి ముడిసరుకు

అప్పుల ఊబిలో కూరుకుపోయిన అద్దేపల్లి జనార్దనరావు అందులో నుంచి బయటకు రావడానికి నకిలీ మద్యం తయారీని ఎంచుకున్నాడు. దీనికి సంబంధించిన ముడిసరుకు, సామగ్రిని బెంగళూరు నుంచి రప్పించేవాడు. 4 నెలల క్రితం అన్నమయ్య జిల్లా ములకలచెరువులో జనార్దనరావు నకిలీ మద్యం తయారీని ప్రారంభించాడు. స్పిరిట్‌, సీల్స్‌, మూతలు, చక్కెర, మిషనరీని బెంగళూరు నుంచి బాలాజీ అనే వ్యక్తి సరఫరా చేసేవాడు. హైదరాబాద్‌కు చెందిన రవి నకిలీ లేబుళ్లను సమకూర్చేవాడు. జనార్దనరావు, జగన్మోహనరావుది ఉమ్మడి కుటుంబం. ఇబ్రహీంపట్నంలో ఇద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. నకిలీ మద్యం తయారీని ఇబ్రహీంపట్నంలో 3 నెలల క్రితం మొదలుపెట్టాడు. జనార్దనరావు బార్‌ నడుపుతుండగా, జగన్మోహనరావు కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఇబ్రహీంపట్నానికి చెందిన సయ్యద్‌ హజి, కట్టా రాజు, ఒడిసాలోని గంజాంకు చెందిన బాదల్‌దాస్‌, ప్రదీప్‌ దాస్‌, మిథున్‌ దాస్‌, అంతా దాస్‌లు స్పిరిట్‌ రసాయనాలు మిశ్రమం చేయడం, సీళ్లు వేయడం, లేబుళ్లు అతికించడం చేసేవారు. సయ్యద్‌ హజి ఏడేళ్లుగా బార్‌లో పనిచేస్తున్నాడు. ములకలచెరువులో నకిలీ మద్యం తయారీలోకి హజిని అతడి సోదరుడు అధిక వేతనానికి తీసుకెళ్లాడు. కట్టా రాజు పదేళ్లకు పైగా కిరాణా షాపు, బార్‌లో పనిచేస్తున్నాడు. అతడూ నకిలీ మద్యం తయారు చేసేవాడు.


మిథున్‌ దాస్‌, అంతా దాస్‌ మూడు, నాలుగేళ్లుగా బార్‌, కిరాణా షాపులో పనిచేస్తున్నారు. వీరిద్దరూ ములకలచెరువులో నకిలీ మద్యం మిశ్రమాన్ని చేసేవారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని సూరంపాలెంలో ఉన్న ఎలీప్‌ పారిశ్రామికవాడలో శ్రీనివాసరెడ్డి నుంచి ప్లాస్టిక్‌ సీసాలను కొనుగోలు చేశారు. ఇక బాదల్‌ దాస్‌ జగన్మోహనరావు కిరాణా షాపులో పనిచేసేవాడు. అక్కడి నుంచి రెండేళ్లుగా జనార్దనరావుకు చెందిన ఏఎన్‌ఆర్‌ బార్‌లో పనిచేయడం మొదలుపెట్టాడు. నకిలీ మద్యం తయారు చేస్తే రెట్టింపు వేతనం ఇస్తానని జనార్దనరావు ఈ యువకులకు ఎరవేశాడని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. కేసులో భవానీపురం ఎక్సైజ్‌ స్టేషన్‌ అధికారులు 12 మందిని నిందితులుగా చేర్చారు. ఏ1 అద్దేపల్ల్లి జనార్దనరావు, ఏ2 అద్దేపల్లి జగన్మోహనరావు, ఏ3 బాలాజీ, ఏ4 రవి, ఏ5 సయ్యద్‌ హజి, ఏ6 కట్టా రాజు, ఏ7 బాదల్‌ దాస్‌, ఏ8 ప్రదీప్‌ దాస్‌, ఏ9 మిథున్‌ దాస్‌, ఏ10 అంతాదాస్‌, ఏ11 శ్రీనివాసరెడ్డి, ఏ12గా అంగులూరి కల్యాణ్‌ పేర్లను చేర్చారు. ఇందులో జగన్మోహనరావు, బాదల్‌ దాస్‌, ప్రదీప్‌ దాస్‌కు కోర్టు రిమాండ్‌ విధించింది. శ్రీనివాస వైన్స్‌ మేనేజర్‌ అంగులూరి కల్యాణ్‌ను బుధవారం అరెస్ట్‌ చేశారు.

Updated Date - Oct 09 , 2025 | 06:01 AM