Share News

Excise Department: నకిలీకి నాడే నాంది

ABN , Publish Date - Oct 09 , 2025 | 03:56 AM

ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతున్న నకిలీ మద్యం అక్రమాలన్నింటికీ తెరలేచింది జగన్‌ జమానాలోనే. నకిలీ మద్యం మొదలైంది.. తయారు చేయడానికి పరిస్థితులు ఉత్పన్నమైనది..

 Excise Department: నకిలీకి నాడే నాంది

  • జగన్‌ జమానాలోనే నకిలీ మద్యం తయారీ మొదలు

  • కొవిడ్‌ సమయంలోనే దానికి ఊతం

  • అప్పట్లో మద్యం ధరలు అమాంతం పెంచిన జగన్‌

  • నకిలీ వైపు అక్రమార్కుల బాట.. భారీగా లాభాలు

  • అదే సమయంలో పెరిగిన గంజాయి విక్రయాలు

  • రాష్ట్రంలో చాపకింద నీరులా ‘మత్తు’ విస్తరణ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతున్న నకిలీ మద్యం అక్రమాలన్నింటికీ తెరలేచింది జగన్‌ జమానాలోనే. నకిలీ మద్యం మొదలైంది.. తయారు చేయడానికి పరిస్థితులు ఉత్పన్నమైనది.. గ్రామ స్థాయికీ గంజాయి విస్తరించింది కూడా వైసీపీ హయాంలోనే. జగన్‌ సర్కారు పోయినా నాటి దుష్పరిణామాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. అంతకుముందు రాష్ట్రంలో మహా అంటే నాటుసారా ప్రభావం మాత్రమే కనిపించేది. అలాంటిది నకిలీ మద్యంతో పాటు గ్రామస్థాయికి గంజాయిని తీసుకెళ్లిన ఘనత గత జగన్‌ సర్కారుదే. కొవిడ్‌ సమయంలో ఎలాంటి ముందస్తు ఆలోచనా లేకుండా అడ్డగోలుగా మద్యం ధరలు రెట్టింపు చేశారు. దీంతో లాక్‌డౌన్‌ సమయంలోనే నకిలీ మద్యం తయారీ మొదలైంది. రాష్ట్రంలో పలు ప్రాంతాలకు విస్తరించింది. కోవిడ్‌ తర్వాత కొంతకాలానికి జంగారెడ్డిగూడెంలో 27 మంది నకిలీ మద్యం తాగి మృత్యువాతపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం దొరికితేనే కఠిన చర్యలు చేపట్టగా.. అప్పట్లో అంతమంది చనిపోయినా జగన్‌ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. అసలు అక్కడేం జరగలేదన్నట్టుగా ఆ ఘటనను తీసిపారేసింది. నకిలీ మద్యం వెనుక ఉన్నవారిపై చర్యలు కూడా తీసుకోలేదు. కానీ ఇప్పుడు అదే వైసీపీ కూటమి ప్రభుత్వం విషం చిమ్ముతోంది.


ఇలా మొదలైంది...

కోవిడ్‌ సమయంలో 42 రోజుల లాక్‌డౌన్‌ అనంతరం మద్యం షాపులు తెరిచిన వెంటనే మద్యం కోసం మందుబాబులు ఎగబడ్డారు. మద్యం షాపుల ముందు కిక్కిరిసిన జనాల వీడియోలు వైరల్‌ అయ్యాయి. జాతీయ మీడియాలోనూ ప్రతికూల కథనాలు వచ్చాయి. దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసిన అప్పటి సీఎం జగన్‌ వెంటనే మద్యం ధరలు రెట్టింపు చేశారు. రాత్రికి రాత్రి రూ.100 సీసా రూ.200 అయ్యింది. దీంతో పక్క రాష్ర్టాల మద్యం, నాటుసారా పెరిగాయి. నకిలీ మద్యం, గంజాయి వేగంగా విస్తరించాయి. ఆ సమయంలోనే రాష్ట్రం నుంచి ఇతర రాష్ర్టాలకు ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కాహాల్‌(ఈఎన్‌ఏ) ఎగుమతులు పెంచారు. ఈ క్రమంలో దానిని తీసుకుని నకిలీ మద్యం తయారు చేయడం ప్రారంభించారు. అప్పట్లోనే శ్రీసత్యసాయి జిల్లాలో విపరీతంగా నకిలీ మద్యం అమ్మారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఈ అక్రమాలు కొనసాగుతున్నాయి.


స్పిరిట్‌తో తయారీ

ఇప్పుడు నకిలీ మద్యం తయారీకి రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ ఎక్కడి నుంచి వచ్చిందనేది కీలకంగా మారనుంది. స్పిరిట్‌ ప్రైమరీ డిస్టిలరీ యూనిట్లలో తయారవుతుంది. ఆ తర్వాత సెకండరీ డిస్టిలరీ యూనిట్లలో దాన్ని ఈఎన్‌ఏగా మార్చి మద్యం తయారు చేస్తారు. అయితే ఇప్పుడు దొరికిన నకిలీ మద్యం చాలావరకు స్పిరిట్‌తోనే తయారు చేసినట్లు తెలుస్తోంది. స్పిరిట్‌కు రంగు, ఫ్లేవర్‌ కలిపి మద్యం తయారు చేస్తున్నారు. అందులోనూ అక్రమార్కులు కక్కుర్తి పడ్డారు. డిస్టిలరీల్లో తయారు చేసే మద్యం 25 అండర్‌ ప్రూఫ్‌ స్ర్టెంథ్‌తో ఉంటుంది. అంటే.. 75 శాతానికి పైగా అందులో ఆల్కాహాల్‌ ఉంటుంది. ఇప్పుడు దొరికిన నకిలీ మద్యం 30 నుంచి 35 శాతం అండర్‌ ప్రూఫ్‌గా ఉంది. అంటే.. 65 నుంచి 70 శాతం మాత్రమే ఆల్కాహాల్‌ ఉంటుంది. దీంతో తగిన స్థాయిలో మత్తు ఎక్కదు. నకిలీ మద్యం తయారీ ద్వారా లాభాలు భారీ స్థాయిలో వస్తాయి. సాధారణంగా మీడియం రేంజ్‌ లిక్కర్‌ క్వార్టర్‌ సీసా తయారీకి సగటున రూ.20 ఖర్చు అవుతుంది. దాన్ని ప్రభుత్వం రూ.150 కంటే ఎక్కువ ధరకు అమ్ముతుంది. ఇతరత్రా ఖర్చులు పోయినా చివరికి ప్రభుత్వానికి రూ.120 వరకు ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఆ మొత్తం పన్నులు అక్రమార్కులకే మిగులుతాయి. అంటే.. ఒక్క సీసాపైనే ఎంత లేదన్నా రూ.100కు పైగా లాభం. అందుకే అక్రమార్కులు వైసీపీ హయాంలో నకిలీ బాట పట్టారు.


రెండేళ్ల కాల్‌ డేటా తీద్దాం

నకిలీ మద్యం వ్యవహారం ఇప్పటిది కాదని ఎక్సైజ్‌ శాఖ నిర్ణయానికి వచ్చింది. అసలు ఇది ప్రారంభమైంది ఎప్పుడు? ఎవరెవరితో సంబంధాలున్నాయి? ఎవరు సహకరిస్తున్నారు? అనే వివరాలు సేకరించే పనిలో పడింది. అందులో భాగంగా నిందితుల రెండేళ్ల కాల్‌ డేటా తీయాలని నిర్ణయించారు. కాల్‌ డేటా కోసం అధికారులు దరఖాస్తు చేసినట్లు తెలిసింది. దీంతో మొత్తం పాత వివరాలు కూడా బయటికొచ్చే అవకాశం ఉంది.

నాడు.. నేడు.. ఇదీ పరిస్థితి

వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్‌ను రెండుగా విభజించడం కూడా నకిలీ మద్యం, గంజాయి లాంటివి పెరగడానికి కారణమైంది. నాటుసారా, నకిలీ మద్యంపై ఎక్కువ నిఘా పెట్టే ఎక్సైజ్‌ శాఖను విడగొట్టి అందులో 70 శాతం అధికారులు, సిబ్బందితో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏర్పాటు చేశారు. మిగిలిన 30 శాతం అధికారులు, సిబ్బందితో ఎక్సైజ్‌ శాఖ పరిమితంగా మారింది. పైగా సెబ్‌కు మద్యంతో పాటు ఇసుక, గ్యాంబ్లింగ్‌, గుట్కా లాంటి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో నకిలీ మద్యంపై దృష్టి పెట్టలేకపోయారు. ఇప్పుడు సెబ్‌ను రద్దు చేసి శాఖను మళ్లీ పాత విధానంలోకి మార్చారు. కూటమి ప్రభుత్వం గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపింది. నకిలీ మద్యం అక్రమార్కులపైనా కఠిన చర్యలు తీసుకుంటోంది.

Updated Date - Oct 09 , 2025 | 03:58 AM