Share News

Fake Liquor Case: ఏ1 జనార్దనరావు అరెస్టు

ABN , Publish Date - Oct 11 , 2025 | 03:43 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఏ-1 నిందితుడు అద్ద్దేపల్లి జనార్దనరావును అరెస్ట్‌ చేశారు.

Fake Liquor Case: ఏ1 జనార్దనరావు అరెస్టు

  • నకిలీ మద్యం కేసు నిందితుడు గన్నవరం ఎయిర్‌పోర్టులో అదుపులోకి

  • దక్షిణాఫ్రికా నుంచి ముంబై మీదుగా రాక

  • అరెస్ట్‌ చేసిన ఎన్టీఆర్‌ జిల్లా ఈఎస్‌టీఎఫ్‌

  • ఏ క్షణమైనా మిగతా నిందితులూ అరెస్టు?

  • జయచంద్రారెడ్డి డ్రైవర్‌ అదుపులోకి

విజయవాడ/రాయచోటి/ములకలచెరువు, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఏ-1 నిందితుడు అద్ద్దేపల్లి జనార్దనరావును అరెస్ట్‌ చేశారు. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ఎన్టీఆర్‌ జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఈఎ్‌సటీఎఫ్‌) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి శుక్రవారం మధ్యాహ్నం ముంబై చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి ఎయిరిండియా విమానం గన్నవరం వచ్చాడు. ఎక్సైజ్‌ అధికారులు అదుపులోకి తీసుకుని రోడ్డుమార్గంలో ములకలచెరువుకు తరలించినట్టు తెలుస్తోంది. ములకలచెరువు కేసుతో పాటు ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో నమోదైన నకిలీ మద్యం తయారీ కేసులోనూ ఆయన ప్రధాన నిందితుడు. ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ వ్యవహారం బయటకు వచ్చేసరికి ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దనరావు, టీడీపీ నుంచి సస్పెండైన తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి దక్షిణాఫ్రికాలో ఉన్నారు. దక్షిణాఫ్రికాలోనూ వారు డిస్టిలరీలను నిర్వహిస్తున్నారు. నకిలీ మద్యం తయారీకి సంబంధించి అన్నమయ్య జిల్లాలోను, ఎన్టీఆర్‌ జిల్లాలోను ఎక్సైజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అజ్ఞాతంలో ఉన్న జనార్దనరావు సెల్ఫీ వీడియోను మీడియాకు విడుదల చేశాడు. అప్పటి నుంచి ఎక్సైజ్‌ పోలీసులు జనార్దనరావుపై నిఘా పెట్టారు. మూడు రోజుల క్రితం నుంచి ఆయన విజయవాడ రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఓ పార్టీకి అనుకూలంగా ఉండే న్యాయవాదిని నియమించుకున్నాడు. గన్నవరం విమానాశ్రయానికి జనార్దనరావు చేరుకోవడానికి ముందుగానే న్యాయవాది అక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి జనార్దనరావు బయటకు రాగానే ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, జనార్దనరావు కోర్టులో లొంగిపోతాడని మూడు, నాలుగు రోజులుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు ముందుజాగ్రత్తగా గన్నవరం, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ విమానాశ్రయాలకు లుక్‌ అవుట్‌ నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ విమానాశ్రయాల వద్ద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన జనార్దనరావును ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఏ-17గా జయచంద్రారెడ్డి

ప్రధాన నిందితుడు జనార్దనరావు అనుచరుడు కట్టా రాజు ఇచ్చిన వాంగ్మూలం మేరకు ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో కొత్తగా తొమ్మిది మందిని చేర్చారు. ఇందులో జయచంద్రారెడ్డితో పాటు ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి, ఇంట్లో పనిచేసే అంబురసు అలియాస్‌ బాబు, ఎస్కార్ట్‌ వాహన డ్రైవర్‌ అష్ర్‌ఫతో పాటు బెంగళూరుకు చెందిన బాలాజీ, సుదర్శన్‌, హైదరాబాద్‌కు చెందిన నకిరికంటి రవి, కృష్ణాజిల్లా గన్నవరం మండలం సూరంపల్లెకు చెందిన శ్రీనివాసులురెడ్డి, అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన చైతన్యబాబుపై కేసు నమోదైంది. దీంతో నకిలీ మద్యం కేసులో నిందితుల సంఖ్య 23కు చేరింది. టీడీపీ నుంచి సస్పెండైన తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డిని ఎక్సైజ్‌ అధికారులు ఏ-17 నిందితుడిగా చేర్చారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు బెంగళూరులో మకాం వేశాయి. ఏ క్షణమైనా ఆయన్ను అరెస్టు చేసే అవకాశముంది. శుక్రవారం జయచంద్రారెడ్డి ఎస్కార్ట్‌ వాహన డ్రైౖవర్‌ అష్ర్‌ఫను ఎక్సైజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల కస్టడీ పిటిషన్‌ 13కు వాయిదా

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటికే అరెస్టయి మదనపల్లె సబ్‌జైలులో ఉన్న 10 మంది నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఈ నెల 7వ తేదీన ఎక్సైజ్‌ అధికారులు తంబళ్లపల్లె కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను విచారించి పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉందని, మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. కస్టడీ పిటిషన్‌పై విచారణను కోర్టు 13వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - Oct 11 , 2025 | 03:45 AM